నీళ్లు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. అందుకే రోజూ వీలైంత ఎక్కువగా నీళ్లు తాగాలని డాక్టర్లు కూడా చెబుతుంటారు. మంచినీళ్లు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అయితే మరీ ఎక్కువగా నీళ్లు తాగినా ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఓవర్‌హైడ్రేషన్ వల్ల శరీరం రకరకాల ఇబ్బందులకు గురి అవుతుంది. మరి ఒక మనిషి రోజు ఎన్ని లీటర్ల నీటిని తాగాలి? అతిగా నీళ్లు తాగితే వచ్చే ఇబ్బందులేంటి అన్నది ఇప్పుడు చూద్దాం.
అనేక అనారోగ్య సమస్యల నుంచి దూరం కావాలంటే సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తారు. ఎందుకంటే, నీళ్లు మన శరీరానికి హాని కలిగించే టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. తగినన్ని నీళ్లు తాగకపోతే శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. సరైన మోతాదులో నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అయితే మంచిది కదా అని అతిగా నీళ్లు తాగడం చేయొద్దని డాక్టర్లు చెబుతున్నారు. మోతాదుకు మించి నీళ్లు తాగడం అన్నది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అతిగా నీళ్లు తాగడం వల్ల మెదడపు ఆ ప్రభావం పడుతుంది. బీపీ పెరగడంతో పాటు, కండరాలు నీరసించిపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మన శరీరానికి ఎంత అవసరమో అంత మేరకే నీళ్లు తీసుకోవాలి.
హైపోనాట్రేమియా ఏర్పడి.. మరణానికి కూడా
అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు అతిగా నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు దాహం వేస్తుంది. అప్పుడు నీళ్లు తాగితే మంచిది. కానీ కొందరు కావాలని బలవంతంగా ఎక్కువగా నీళ్లు తీసుకుంటారు. దీని వల్ల రక్తంలో సోడియం లోపం ఏర్పడుతుంది. దీన్నే హైపోనాట్రేమియా అంటారు. ఇది ఎక్కువైతే, మెదడు వాపు,కోమాలోకి వెళ్లడం వంటివి కూడా జరుగుతాయి. కొన్నిసార్లు ఇది మరణానికి దారితీసే అవకాశం కూడా ఉంది. నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా వాటి పనితీరు తగ్గిపోతుంది.
రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి?
మన శరీరానికి నీరు అవసరం అయినప్పుడు దాహం ద్వారా అది మనకు తెలుస్తుంది. అప్పుడు నీళ్లు తీసుకుంటే సరిపోతుంది. చాలామంది నిలబడి నీళ్లు తాగుతుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. దీనివల్ల నీరు చాలా త్వరగా శరీరంలోకి చేరి జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. ఒకేసారి ఏకధాటిగా కాకుండా చిన్న సిప్స్‌లో నెమ్మదిగా నీళ్లు తాగడానికి ప్రయత్నించడం. మరీ చల్లని, మరీ వేడినీళ్లు కాకుండా గోరువెచ్చటి నీళ్లు తాగడం ఉత్తమం. ఆరోగ్యంగా ఉన్న మనిషికి రోజుకు 3-4 లీటర్ల నీరు సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment