కేసీపై ‘కరువు’ మేఘాలు
మైదుకూరు టౌన్:
జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సాగునీరు అందిస్తున్న ఏకైక కాలువ కేసీ కెనాల్. బ్రిటీష్ కాలంలో నిర్మితమైన ఈ కాలువ కరువుబారిన పడిన రైతుల బతుకుల్లో వెలుగు నింపుతోంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2002, 2003, 2004 వ్యవసాయ సీజన్‌లో వరుసగా మొట్టమొదటి సారిగా కేసీ ఆయకట్టులో కరువు తాండవించింది. ప్రకృతి కంటే ప్రభుత్వ వైఫల్యం కారణంగానే వరుసగా మూడేళ్లు రైతులు తిండి గింజలకు దూరమయ్యారు. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2015 వ్యవసాయ సీజన్‌లో మళ్లీ కరువు ఛాయలు కేసీ ఆయకట్టుపై అలుముకున్నాయి. ఈ ఏడాది నీరు రాకపోతే తమ బతుకులు ఎట్లా అని రైతులు మథనపడుతున్నారు. సొంత పొలమున్న రైతులే ఒడిదుడుకులు ఎదుర్కొంటుంటే.. ఇక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఓ పక్క తిండిగింజలు లేక.. ఈ ఏడాది వరిపంట పండించుకునే అవకాశం కన్పించక రైతులు గుండెలు బాదుకునే దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయి. కేసీ కెనాల్ ప్రాజెక్టుకు సాగునీరు అందని పరిస్థిత్లులో ఆదుకుంటామని రైతుకు అభయమిచ్చిన అధికారపార్టీ నేతల జాడ కన్పించలేదు.
ప్రస్తుత పరిస్థితి
కేసీ ఆయకట్టులో 2002 నుంచి 2004 వరకు నెలకొన్న నాటి పరిస్థితులు గత ఏడాది నుంచి ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లోనూ వెంటాడుతున్నాయి. కేసీ కెనాల్ ఆయకట్టు ప్రాంతంలో భూగర్భ జలాలు 5వందల మీటర్లకు పైగా పడిపోయాయి. గత ఏడాది సాగుచేసిన అరకొర పంటలను భూగర్భ జలాలు కాపాడలేకపోయాయి.. చేతికందిన పంటను కాపాడుకునేందుకు రైతులు బోర్లను తవ్వుకున్నా ఫలితం లేకపోయింది.. ఒక్కో రైతు పంటను కాపాడుకునే క్రమంలో ఏడెనిమిది బోర్లను తవ్వించుకున్నా.. చివరకు భూగర్భజలాలు పైకి రావడానికి ససేమిరా అన్నాయి. ఈ ఏడాది వ్యవసాయ బోర్ల ద్వారా పంట సాగుచేద్దామంటే జలాలు అందడం లేదు. కేసీ పరివాహక ప్రాంతాల్లోని పల్లె సీమల్లోనే కాదు, పట్టణాల్లో సైతం తాగునీటి ఎద్దడి నెలకొంది. బిందెడు నీరు దొరక్క పడిగాపులు కాస్తున్నారు. జూన్ మాసం వెళ్లింది.. జులై మాసం ముగుస్తోంది.. అరకొర వర్షాలు పొలాల్లో పచ్చదనం పెంపొందించాయి తప్ప.. సాగునీటికి భరోసా ఇవ్వలేకపోయాయి.. కేసీ కెనాల్‌కు సాగునీరు అందించే ప్రధాన వనరు శ్రీశైలం రిజర్వాయర్.. ఆ రిజర్వాయరే నీటి కోసం తపిస్తోంది.
కృష్ణాపరివాహక ప్రాంతంలో వరదలు వస్తేనే..
కేసీ కెనాల్‌కు సాగునీరు శ్రీశైలం రిజర్వాయర్ నీటి లభ్యతపై ఆధారపడి ఉంది. ఆయకట్టు ప్రాంతంలో వర్షాలు కురిసినా వరిపంట సాగు చేసుకునే అవకాశం లేదు. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌లో 47.3 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఏస్కెప్ ఛానల్ ద్వారా కేసీ కెనాల్‌కు సాగునీటి సరఫరా జరగాలంటే 143 టీఎంసీల నీరు అవసరం. ఆ మేర నీటి మట్టం రిజర్వాయర్‌లో పెరగాలంటే ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవాల్సి ఉంటుంది. ఇక భారీ వర్షాలు పడి.. రోజుకు 10 లక్షల క్యూసెక్కులపైగా నీరు రిజర్వాయర్‌కు నిరాటంకంగా కొద్ది రోజులు కొనసాగితేనే కేసీకి నీరు అందే పరిస్థితి. ఆ స్థాయిలో వర్షాలు కురవని పక్షంలో కేసీ ఆయకట్టులో మళ్లీ రెండవ ఏడాది కరువు దుర్భర పరిస్థితులను రైతులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
----------------------------------
ప్రాజెక్టు: కేసీ కెనాల్ (కర్నూలు– కడప కాలువ)
ఆయకట్టు: 92,001 ఎకరాలు
ఖరీఫ్ పంటలు: మాగాణి, ఆరుతడి పంటలు
ప్రధాన పంట: వరి (71,848 ఎకరాలు)
సాగునీరు అందే మండలాలు: మైదుకూరు, దువ్వూరు, చాపాడు, ఖాజీపేట, చెన్నూరు, కడప, ప్రొద్దుటూరు, రాజుపాలెం, చింతకొమ్మదిన్నె
-----------------------------------------
ఈ ఏడాది కూడా కరువు తప్పదు..
గత ఏడాది లాగా ఈ ఏడాది కూడా కేసీ ఆయకట్టు రైతులకు కరువు పరిస్థితి తప్పేట్టు లేదు. ప్రస్తుత పాలకులు కృష్టా డెల్టాపై చూపించే ప్రేమలో ఒకింత భాగం రాయలసీమ ప్రాంతంలోని రైతులపై చూపిస్తే కరువు ఉండదు. కాని మన పాలకుల దౌర్భాగ్యంతో కరవు కోరలు చాస్తోంది. దీంతో ఎంతో మంది రైతుల కుటుంబాలు వీధిన పడుతున్నాయి.
– లెక్కల వెంకటరెడ్డి, రైతు నాయకుడు, కుందూ సాహితీ కన్వీనర్