సరదా..! విషాదం మిగిల్చింది. శుభకార్యం జరిగిన ఇంట్లో అశుభం తాండవించింది. స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలికలను,వారిని రక్షించేందుకు యత్నించిన ఓ మహిళను తుంగభద్ర మింగేసింది. తమ పిల్లలు గంగలో మునిగిపోవడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. తల్లి చనిపోవడంతో ఆమె పిల్లలు దిక్కులేనివారయ్యారు. చూస్తుండగానే క్షణాల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో బంధువులు శోకసంద్రంలో మునిగారు.
అలంపూర్, న్యూస్‌లైన్ : ఆ దంపతులకు ఉన్నది ఇద్దరు కుమార్తెలే.. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ జీవిస్తున్నారు.. బాగా చదివించాలనుకున్నా వారి ఆశలు మధ్యలోనే కల్లలయ్యాయి.. అసలే వేసవి సెలవులు..పైగా బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో తమ కూతుళ్లు సరదగా గడుపుతారని తల్లిదండ్రులు పంపించారు.. తుంగభద్ర నది రూపంలో మృత్యువు కబళించడంతో వారి రోదనలు అక్కడివారిని కలిచివేసింది.. వివరాలు.. కర్నూలు నగరంలోని ఎన్టీఆర్‌బిల్డింగ్ కాలనీలో నివాసముంటున్న అమీన్, ఖాజబీ దంపతులకు కుమార్తెలు షేకున్‌బీ (11), రజియా (10) ఉన్నారు.
వీరు అక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరు, ఐదో తరగతి చదువుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ప్రస్తుతం వేసవి సెలవులు ఉండటంతో శుభకార్యం నిమిత్తం మూడు రోజులక్రితం తమ కూతుళ్లను అలంపూర్ పట్టణంలోని కుమ్మరివీధికి చెందిన శాలిమియా ఇంటికి పంపించారు. అలా వచ్చిన వారు ఆదివారం ఉదయం తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లి మృత్యువాత పడటంతో తల్లడిల్లిపోయారు.
ఇదే సంఘటనలో వరసకు చిన్నమ్మ అయిన అలంపూర్‌మండలం తక్కశీలకు చెందిన మహబూబ్‌బీ (27) మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈమెది రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. దీంతో భర్త ఫకృద్దీన్‌కు తోడుగా కూలిపని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. కుమారులు హనీఫ్, మహిబూబ్ ఉన్నారు. తల్లి చనిపోవడంతో వారి రోదనలు మిన్నంటాయి. ఇలా రెండు కుంటుంబాల్లో నది ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. శుభకార్యంతో రెండు రోజులపాటు ఆనందంతో గడిపిన బంధుమిత్రులూ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు.
మృత్యు ఒడిలోకి
Published Mon, May 5 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM
Advertisement
Advertisement