
విభజనతో నీటి సమస్యలు తీవ్రతరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం కలసి ఉన్నప్పుడే రాయలసీమకు సరిగ్గా నీళ్లు రావడం లేదని, విడిపోతే సమస్య మరింత సంక్లిష్టమవుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోతే నీటి ఇబ్బందులు ఏర్పడతాయని గ్రహించే తాను సమైక్యవాదం వినిపిస్తున్నానని అన్నారు. సీపీఐ నేతృత్వంలో వందలాది మంది రైతులు సోమవారం ముఖ్యమంత్రిని క్యాంప్ కార్యాలయంలో కలిశారు.
తుంగభద్ర డ్యాం నుంచి పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)కు కేటాయించిన పది టీఎంసీల నీటిని విడుదల చేసి, కుడి కాలువ కింద ఉన్న 49 చెరువులు నింపాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టులో 871 అడుగుల నీటి స్థాయి ఉంటేనే రాయలసీమ ప్రాంతానికి నీరు ఇవ్వడం సాధ్యపడుతుందన్నారు. వాస్తవం ఇలా ఉంటే రామకృష్ణ వంటి సీపీఐ నేతలు విభజన జరగాలంటున్నారని అన్నారు. రైతు సమస్యల్ని గుర్తించయినా సమైక్యవాదాన్ని వినిపించాలని సూచించారు.
కాగా, హంద్రీ-నీవా కాలువ ద్వారా పూర్తి స్థాయిలో నీటిని పంపింగ్ చేసి కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి రిజర్వాయర్ వరకు చెరువుల్ని నింపాలని సీపీఐ అనుబంధ రైతు సంఘం ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా కోరింది. అనంతపురం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పది వేలు, పంట వేయని రైతులకు ఎకరానికి ఐదు వేల చొప్పున నష్టపరిహారం అందించాలని కోరింది. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ అధికారులతో చర్చించి ఆయకట్టుకు నీటి విడుదలపై ఆదేశిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిని కలసిన వారిలో రైతు సంఘం నేతలు కె.రామకృష్ణ, ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్, రావుల వెంకయ్య, పశ్య పద్మ, జగదీష్ తదితరులు ఉన్నారు.