కర్నూలు రూరల్/ఆదోని, న్యూస్‌లైన్ :
కాలువల కింద పంటలు సాగు చేసే జిల్లా రైతాంగానికి ప్రతి ఏడాదీ నిరాశే మిగులుతోంది. జలాశయాల పరిధిలో కేటాయించిన మేరకు కాలువలకు ఏనాడూ సాగునీరు సరఫరా కావడం లేదు. అదీ చాలదన్నట్టు వచ్చే కొద్దిపాటి నీటినీ ఇతర రాష్ట్రాల రైతులు దౌర్జన్యంగా తరలించుకుపోతున్నారు. కాలువలకు గండ్లు, ఆవిరి రూపంలో పోతున్న నీరు మొత్తం జిల్లా వాటాలోనే లెక్కిస్తుండడంతో నష్టం వాటిల్లుతోంది. ప్రజల దాహార్తిని తీర్చేందుకు సైతం ఈ నీటిని వినియోగించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తడంతో ఆయకట్టుసాగు ప్రశ్నార్థకంగా మా రుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ భవనంలో నిర్వహించనున్న సాగునీటి సలహా మండలి(ఐఏబీ) సమావేశంపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. కనీసం ఈ ఏడాది రబీలోనైనా సక్రమంగా నీటిని విడుదల చేయించి ఆదుకోవాలని ఆయకట్టు రైతులు వేడుకుంటున్నారు.
ఎల్లెల్సీ వాటాలో కర్ణాటక దౌర్జన్యం
తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ) కర్ణాటకతోపాటు జిల్లాలో విస్తరించి ఉంది. మొత్తం కాలువ నిడివిలో 250 కిలోమీటర్ల వరకు తుంగభద్ర బోర్డు నిర్వహణలో ఉంది. పరిమితి మేరకు నీటిని సరఫరా చేస్తే రాష్ట్ర సరిహద్దు చింతకుంట(153 కి.మీ.) వద్ద రాష్ర్ట వాటా కింద 725 క్యూసెక్కులు, బోర్డు సరిహద్దు హనువాళు (250 కి.మీ.) వద్ద 650 క్యూసెక్కులు నీటి ప్రవాహం ఉండాలి. అయితే కర్ణాటక రైతుల అక్రమాలు ఏడాదికేడాదికీ అధికమవుతున్నాయి. మోటార్లు, నీటికి అడ్డుకట్టలు వేసి జలచౌర్యానికి పాల్పడుతున్నారు. దానికితోడు కాలువలు దెబ్బతినడం.. ఆవిరైన నీటిని మొత్తం జిల్లా వాటాలోనే చూపుతున్నారు. దీంతో ఎప్పుడూ ప్రవాహం 450 క్యూసెక్కులు మించలేదు. కర్ణాటకలో నీటి అవసరం ఎక్కువగా ఉన్న సమయంతో ప్రవాహం 200 క్యూసెక్కులకు పడిపోయిన సందర్భాలూ ఉన్నాయి.
జిల్లాలోని 16 మండలాల్లో 192 గ్రామాలు ఎల్లెల్సీ నీటిపై ఆధారపడ్డాయి. దీని కింద ఖరీఫ్ సీజన్‌లో 43,519 వేల ఎకరాలు, రబీలో 1,07,615 ఎకరాలు సాగు కావాల్సి ఉంది. బచావత్ ట్రిబునల్ ప్రకారం 24 టీఎంసీల నీటిని జిల్లాకు ఇవ్వాల్సి ఉంది. పూడిక చేరడంతో ఏటేటా వాటా నీరు తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది 16.32 టీఎంసీల నీరు కేటాయిస్తే ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు ఇప్పటికి 8.34 టీఎంసీలు వినియోగించారు. వాటాలో మిగిలిన 7.98 టీఎంసీల నీటిని రబీలో సాగుకు విడుదల చేయాల్సి ఉంది. కనీసం ఈ ఏడాదైనా నీటి సక్రమంగా జిల్లాకు చేరేలా చూడాలని రైతులు అధికారులు, నాయకులను కోరుతున్నారు. అందులో సగం తాగునీటి అవసరాలకు పోయినా, మిగిలిన వాటాతో దాదాపు 50 వేల ఎకరాలు సాగు చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
ఆ‘కేసీ’ చూడడమే లేదు
సుంకేసుల జలాశయంపై ఆధారపడి ఉన్న కర్నూలు-కడప కాలువ పరిస్థితి ఏటేటా దారుణంగా తయారవుతోంది. సెప్టెంబర్, అక్టోబరు నెలలో కురిసిన భారీ వర్షాలకు 90 కి.మీ, 156, 171, 189 కి.మీల దగ్గర కాలువలకు గండ్లు పడ్డాయి. వాటి శాశ్వత మరమ్మతులకు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నిధులు మంజురు చేయడం లేదు. కర్నూలు, కడప జిల్లాల్లో 2,65,628 ఎకరాలకు సాగు నీరు అందించేది. సాగు నీటి కొరత వల్ల 1.70 వేల ఎకరాలకే నీరిచ్చే స్థితికి చేరుకుంది. ఈ కాలువకి టీబీ డ్యాంలో కేటాయించిన 10 టీఎంసీల వాటాకుగాను 7 టీఎంసీలు మాత్రమే ఈ ఏడాది మంజూరు చేశారు. అందులో నుంచి కూడా 2 టీఎంసీల నీరు కర్నూలు నగర ప్రజల తాగునీటికి వినియోగిస్తున్నారు. 2.5 టీఎంసీ అనంతపురానికి తరలిస్తారు. మిగిలిన 2.5 నీటిని కేసీ ఆయకట్టుకు నీటిని అందించడం సాధ్యం కాదు. అందుకే 10 ఏళ్లుగా ఈ కాలువ కింద రెండో పంటకు నీరు అందనే లేదు. నీటి వాటాను పెంచేందుకు కృషి చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
తెలుగు గంగా.. తీరని బెంగ
శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల నీరు ఉన్నప్పుడు మాత్రమే నీటిని వినియోగించుకోవాలనే నిబంధన ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బానకచర్ల కాంప్లెక్సు ద్వారా తెలుగు గంగా, శ్రీశైలం కుడి కాలువ, కె.సి కెనాల్ ఎస్కేప్ చానల్ ద్వారా వినియోగించే నీటితో సుమారు 3.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఈ కాలువ కింద సాగు చేసే ఏ ఆయకట్టుని ఇంత వరకు స్థిరీకరించలేదు. దీంతో తెలుగు గంగాతో పాటు మిగతా కాలువల కింద ఏ మేరకు పంటలు సాగు అవుతున్నాయే కూడా అధికారులు ఖచ్చితమైన లెక్కలు చెప్పలేకపోతున్నారు.
ఏబీసీ కింద ఏళ్లుగా బీడే
తుంగభద్ర ఎగువ కాలువ పరిధిలో 28వ కి.మీ. వద్ద ఉన్న ఆలూరు బ్రాంచ్ కాలువ కింద 14,255 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాలువకి పదేళ్లుగా సాగు నీరు అందడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా నగరడోణ రిజర్వాయర్ నిర్మాణానికి పూనుకున్నా భూ సేకరణ సమస్యలు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు ముందుకు సాగడం లేదు. జిల్లాలో నీటి వనరులు సంవృద్ధిగా ఉన్నా వినియోగించుకునేందకు అవకాశం లేక, అందుబాటులో ఉన్న వనరులకు ప్రత్యామ్నాయ చర్యలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రజా ప్రతినిధులు స్పందించాలి
ఐఏబీ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రితో పాటు జిల్లాకు చెందిన రాష్ట్ర, కేంద్ర మంత్రులు, కలెక్టర్, సాగు నీటి శాఖ ఎస్‌ఈ, ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు. అయితే కర్ణాటకలో ఎల్లెల్సీ నీటి దోపిడీని అరికట్టేందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. మంగళవారం నిర్వహించే సమావేశంలో అయినా దోపిడీపై సమీక్షించి నివారణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఈ సారైనా ‘సాగు’తుందా!
Published Tue, Nov 26 2013 12:53 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement