నీటి కోసం గొడవ
రుద్రవరం: తెలుగుగంగ ప్రధాన కాల్వకు నీటి విడుదల నిలిపి వేయడంతో తుండ్లవాగు రిజర్వాయర్‌లో నిల్వ ఉన్న నీటికోసం పలు గ్రామాల మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. రుద్రవరం సమీపంలోని తుండ్లవాగు రిజర్వాయర్ వెనక వైపు 21, 22 బ్లాక్ చానల్స్ నుంచి నీరు ప్రవహిస్తుంది. 22వ బ్లాక్ చానల్ కింద టి. లింగందిన్నె, ఆర్. నాగులవరం, తువ్వపల్లె తదితర గ్రామాలకు సాగు నీరు అందుతుంది. అలాగే 21వ బ్లాక్ చానల్ ద్వారా ఆర్. నాగులవరం, రెడ్డిపల్లె, తువ్వపల్లె, రుద్రవరం, నక్కలదిన్నె, మందలూరు తదితర గ్రామాలకు సాగునీరు అందుతుంది. నీటి కోసం రైతులు గొడవలు పడుతూ పోలీసు స్టేషన్‌లలో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు.
గత వారం రోజుల నుంచి 21వ బ్లాక్ చానల్ ద్వారా రిజర్వాయర్ నీటిని మదంలూరు, నక్కల దిన్నె గ్రామాలకు అందించాలని తెలుగుగంగ అధికారులను ఆదేశించారు. అధికారుల ఆదేశాల మేరకు నీటి విడుదల చేసేందుకు సిబ్బంది గేట్లు ఎత్తేప్రయత్నం చేయగా.. రుద్రవరం గ్రామ రైతులు అడ్డుకున్నారు. ఆదివారం తెలుగుగంగ అధికారులు.. పోలీసుల సహకారంతో గేట్లు ఎత్తే ప్రయత్నం చేయగా..రుద్రవరం రైతులు అడ్డుకున్నారు. అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వినుకోలేదు. రుద్రవరం రైతులు.. పోలీసు స్టేషన్‌కు చేరుకొని ఎస్‌ఐ హనుమంతయ్య వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. అలాగే మందలూరు, నక్కలదిన్నె గ్రామాల రైతులు పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పి పంపించి వేశారు.