మన పరిశ్రమలు ఏపీకి వెళ్లట్లేదు: సీఎం
పారిశ్రామికాభివృద్ధిని తమ రాష్ట్రం ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుందని, అందువల్ల కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కు కొన్ని పరిశ్రమలు తరలిపోతున్నాయన్న వార్తలు అవాస్తవమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. ఇప్పటికి 53 ఫార్మా పరిశ్రమలు పెట్టుబడులు పెడతామంటూ ముందుకొచ్చాయని, మహారాష్ట్ర నుంచి కూడా చాలా పరిశ్రమలు యూనిట్లు నెలకొల్పేందుకు ఆసక్తి చూపాయని ఆయన తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా బీజేపీ సభ్యురాలు తారా అనూరాధ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయనీ వివరాలు చెప్పారు. హీరో మోటోకార్ప్ సంస్థ ఏపీకి వెళ్లిన మాట నిజమే గానీ, అది ఇక్కడ సదుపాయాలు లేక కాదని, అక్కడ ఎక్కువ రాయితీలు వస్తాయనే ఉద్దేశంతోనే వెళ్లిందని వివరించారు. కర్ణాటక పారిశ్రామిక విధానం దేశంలోనే అత్యుత్తమమైనదని సిద్దరామయ్య అన్నారు.