రైతులతో ప్రభుత్వమే కాదు.. అధికారులూ ఆడుకుంటున్నారు. ప్రకృతి విపత్తులను పక్కనపెడితే.. చేతనైన సాయం చేసే విషయంలోనూ మీనమేషాలు లెక్కిస్తున్నారు. పచ్చని పైర్లు కళ్లెదుటే ఎండుతుంటే రైతుల గుండె తరుక్కుపోతోంది. ఈ పరిస్థితుల్లో విడుదల చేసిన నీరు.. పొలాలకు చేరకుండానే నిలిపేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా దిగువ కాలువకు సోమవారం మధ్యాహ్నం నుంచి సాగునీటి విడుదలను నిలిపేశారు.
కర్నూలు రూరల్, న్యూస్‌లైన్:
అధికారుల మాటలు నీటి మూటలవుతున్నాయి. సాగునీటి విషయంలో ఆశలు రేకెత్తించడం.. అంతలోనే ఉసూరుమనిపించడం పరిపాటిగా మారింది. ఈ ఏడాది రబీ పంటలకు దిగువ కాలువ కింద 50వేల ఎకరాలకు.. కేసీ కింద 30వేల ఎకరాల ఆయకట్టుకు వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు నీరిస్తామని గత నెల 26న నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో తీర్మానించారు. అందులో భాగంగా ఈ నెల మొదటి వారంలో ఇరిగేషన్ అధికారులు టీబీ డ్యాంను సందర్శించి రబీకి నిరంతరాయంగా సాగునీరు విడుదల చేస్తామని భరోసానిచ్చారు. అలాంటిది పది రోజులు కాక మునుపే దిగువ కాలువకు నీరు నిలిపేయడం రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది.
తుంగభద్ర దిగువ కాలువపై 16 మండలాలు, 192 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. ఖరీఫ్ సీజన్‌లో 43,519 ఎకరాలు, రబీలో 1,07,615 ఎకరాలు సాగవ్వాల్సి ఉంది. ఇందుకోసం టీబీ డ్యాం నుంచి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 24 టీఎంసీల నీరు సరఫరా చేయాలని నిర్ణయించారు. అయితే పూడిక సాకుతో ఏటా నీటి వాటా తగ్గిస్తున్నారు. ఈ ఏడాది 16.32 టీఎంసీల నీటి వాటా కేటాయించగా.. ఖరీఫ్ పంటలకు 9.5 టీఎంసీల నీరు వినియోగించారు. మిగిలిన 6.82 టీఎంసీల నీరు రబీలో 50వేల ఎకరాలకు అందిస్తామని గత నెలలో నిర్వహించిన ఐఏబీ సమావేశంలో తీర్మానించారు. కాగా ఈ కోటాలో 3 టీఎంసీలు తాగునీటికి వినియోగించనున్నారు. ఎగువ ప్రాంతాంలోని కర్ణాటక రైతులు రబీ పంటలకు నారు మళ్లు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జలచౌర్యం జరుగుతుందనే సాకుతో సోమవారం టీబీ డ్యాం నుంచి దిగువ కాలువకు నీటి విడుదలను నిలిపేశారు. అక్కడి రైతులను అడ్డుకోలేక.. జిల్లాలో దిగువ కాలువకు నీరు అవసరం లేదని అధికారులు అడ్డంగా వాదించడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదోని డివిజన్‌లోని హాలహర్వి, హొళగుంద, ఆలూరు, కౌతాళం, ఆదోని ప్రాంతాల్లో దాదాపు 30వేల ఎకరాల్లో మిరప, పత్తి పంటలు సాగులో ఉన్నాయి. ప్రస్తుతం మొగ్గ, పిందె దశలోని పంటలకు రానున్న 15 రోజులు ఎంతో కీలకం. ఈ సమయంలో నీరు నిలుపుదల చేస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా రబీలో వరి సాగుకు సిద్ధం చేస్తున్న నారుమళ్లు ఎండిపోతాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సిద్ధమైన నారుతో నాట్లు వేసేందుకు సిద్ధమవుతుండగా నీళ్లు అందివ్వకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీబీ బోర్డు అధికారులపై కర్ణాటక నేతల ఒత్తిళ్లు అధికంగా ఉంటాయని.. అలాంటిది వారి చెప్పినట్లు జిల్లా అధికారులు నడుచుకోవడంలో అర్థం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేసీ ఆయకట్టు సాగు ప్రశ్నార్థకం
కేసీ కాలువ పరిధిలోని 30వేల ఎకరాల ఆయకట్టుకు రబీలో సాగునీరు ఇస్తామని ఐఏబీలో తీర్మానించారు. నీటి విడుదల అనుమతి కోరుతూ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీరు సోమవారం ప్రభుత్వానికి రెండోసారి లేఖ పంపారు. మొదటి లేఖ పంపి నెల రోజులు గడుస్తున్నా స్పందించని పరిస్థితుల్లో నీటి విడుదల అనుమానమేనని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు. టీబీ డ్యాంలో కేటాయించిన 10 టీఎంసీల్లో కేవలం 6.986 టీఎంసీలే ఈ ఏడాది వాటాగా నిర్ణయించారు. ఇందులో 2 టీఎంసీలు కర్నూలు నగర ప్రజల తాగు నీటి అవసరాలకు వినియోగించనున్నారు.
ఖరీఫ్‌కు సంబంధించి చుక్క నీరు వాడలేదు. ఈ పరిస్థితుల్లో ఎగువనున్న ఆర్డీయస్ ద్వారా కర్ణాటక రైతులు నీటిని ఆ ప్రాంతానికి తరలించుకుంటే దిగువకు నీరు పాడం కష్టమేనని తెలుస్తోంది. 0 నుంచి 120 కి.మీ వరకు ఉన్న కాలువకు కృష్ణ జలాలను తరలించి పూర్తి స్థాయిలో నీటిని అందించేందుకు రూ.120 కోట్లతో చేపట్టిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులు ఓ ప్రజాప్రతినిధి స్వార్థంతో నిలిచిపోయాయి. ఈ పథకం నుంచి 5 టీఎంసీల నీరు కేసీలోకి ఎత్తిపోసుకుని కోతను పూడ్చుకునే అవకాశం ఉంది. అందువల్ల అధికార పార్టీ నేతలు ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకే నీటి సరఫరా నిలిపివేత
తుంగభద్ర దిగువ కాలువకు ప్రభుత్వ ఆదేశాలతోనే సాగునీటిని నిలిపేశాం. ఐఏబీ సమావేశంలో తీర్మినించిన మేరకు నీరు ఇచ్చేందుకు వీలుపడటం లేదు. హాలహర్వి, హొళగుందా, కౌతాళం మండలాల్లో మిరప, పత్తి పంటలకు నష్టం కలగకూడదనే ఒక తడికి నీరిచ్చాం. మరో 15 రోజులు నీరు అందకపోయినా పంటలకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నాం. అయితే రబీలో వరికి నీరిస్తామని చెప్పలేదు.. ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని సూచించాం. వరికి నీరందకపోయినా.. నారు మళ్లు ఎండిపోయినా మాకు సంబంధం లేదు. కొన్ని తీర్మానాలు పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటాయి.
- ఆర్.నాగేశ్వర్ రావు, నీటిపారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీరు
దిగువ కాలువకు నీటి సరఫరా నిలిపివేత
Published Tue, Dec 17 2013 3:51 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement