20న తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం  | Tungabhadra Pushkars Start On 20th November | Sakshi
Sakshi News home page

20న తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం 

Published Wed, Nov 18 2020 4:08 AM | Last Updated on Thu, Nov 19 2020 8:55 PM

Tungabhadra Pushkars Start On 20th November - Sakshi

సాక్షి, అమరావతి: తుంగభద్ర పుష్కర ప్రారంభ ముహూర్తం ఖరారైంది. 20వ తేదీ మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరాల ప్రారంభ ముహుర్తంగా దేవదాయ శాఖ నిర్ణయించింది. దేవదాయ శాఖ అర్చక ట్రైనింగ్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల విశాఖపట్నంలో దైవజ్ఞ సమ్మేళనంలో పంచాంగకర్తలు నిర్ధారించిన ఈ ముహూర్త వివరాలను అధికారిక అనుమతి కోసం దేవదాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్‌ 1వ తేదీ మధ్య 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగుతాయి. గతంలో 2008లో తుంగభద్ర పుష్కరాలు జరిగాయి.

23 పుష్కర ఘాట్లు సిద్ధం 
► తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలో 23 పుష్కర ఘాట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. కోవిడ్‌–19 నేపథ్యంలో కేంద్రప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వైద్య, ఆరోగ్య శాఖ ఈసారి నదీ స్నానాలకు బదులుగా భక్తులు జల్లు సాన్నాలు చేయాలని సూచించింది. ఆ మేరకు ఘాట్ల వద్ద అధికార యంత్రాంగం స్ప్రింకర్లను ఏర్పాటు చేస్తోంది.  
► పుష్కరాల సందర్భంగా పితృ దేవతలకు పిండ ప్రదానం చేసేందుకు మొత్తం 443 మంది పురోహితులను ఎంపిక చేసి, వారికి గుర్తింపు కార్డులను అందజేసింది.  
► పిండ ప్రదానం, తదితర కార్యక్రమాలకు రేట్లను దేవదాయ శాఖ నిర్ధారించి, ఆ వివరాలను వీటి కోసం కేటాయించిన షెడ్ల వద్ద ప్రదర్శించనుంది.  
► పుష్కర ఘాట్లకు సమీపంలోని ఆలయాల్లో దర్శనాలకు ఇబ్బంది లేకుండా అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన దాదాపు 300 మందికి పైగా దేవదాయ శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా విధుల్లో నియమించారు. దేవదాయ శాఖ కార్యక్రమాలపై ప్రత్యేక కమిషనర్‌ అర్జునరావు ఆయా జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, పలు సూచనలు చేశారు.

20న పుష్కరాల్లో పాల్గొననున్న సీఎం జగన్‌ 
తుంగభద్ర పుష్కరాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్‌ ఒకటవ తేదీ వరకు తుంగభద్ర పుష్కరాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 20వ తేదీన కర్నూలు జిల్లాలోని సంకల్‌బాగ్‌ పుష్కర ఘాట్‌ వద్ద శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొంటారు. ఈ మేరకు సీఎం పర్యటన వివరాలను ముఖ్యమంత్రి అదనపు పీఎస్‌ కె.నాగేశ్వరరెడ్డి ప్రభుత్వ అధికారులకు సర్క్యులేట్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement