రైతు బజార్ లోపల చోటు లేక గేటు వద్దే అమ్మకాలు సాగిస్తున్న రైతులు
విశ్వనగరం దిశగా అడుగులు వేస్తున్న భాగ్యనగరంలో అతిముఖ్యమైన ‘మార్కెట్ల’ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. జనాభా కోటికి చేరువైన గ్రేటర్ నగరంలో అవసరాలకు తగినట్లుగా నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు విక్రయించేందుకు అవసరమైన మార్కెట్లు, రైతుబజార్లు లేవు. వాస్తవంగా నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున రైతుబజార్ ఏర్పాటు చేయాలి. కానీ గ్రేటర్ పరిధిలో కేవలం 11 రైతుబజార్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న జనాభా అవసరాలు తీర్చేందుకు 50కి పైగా మార్కెట్లు అవసరం. అత్యాధునిక రైతుబజార్లు, మార్కెట్లు అందుబాటులో లేనికారణంగా పలు కాలనీలు, బస్తీల జనం దాదాపు ఐదారు కిలోమీటర్లు ప్రయాణించి...మూడు నుంచి నాలుగు గంటల సమయం వెచ్చించి తమకు కావాల్సిన కూరగాయలు, పండ్లు తెచ్చుకొని నిల్వ చేసుకుంటున్నారు. నాలుగేళ్ల క్రితం సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ మోండా మార్కెట్‌ను సందర్శించినప్పుడు నగర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మార్కెట్లు నిర్మిస్తామని చెప్పినా సాధ్యం కాలేదు.
సాక్షి సిటీబ్యూరో: చారిత్రక హైదరాబాద్ అధునాతన అభివృద్ధికి కేంద్రంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో ‘డైనమిక్ సిటీ’గా రెండో స్థానం దక్కించుకుంది. వరుసగా మూడో ఏడాది కూడా అగ్రభాగాన నిలిచి నగర కీర్తిని విశ్వవ్యాప్తం చేసింది. నిత్యం ఉపాధికోసం వేలమంది వస్తున్న ఈ సిటీలో జనాభా కోటికి చేరువైంది. అయితే, ఇంత మందికి సరిపడా నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు సమకూర్చేందుకు ఇప్పటికీ సరైన ఏర్పాట్లు లేవు. దశాబ్దాల క్రితం నెలకొల్పిన రైతుబజార్లు తప్ప.. కొత్తగా ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు అంటూ లేవు. సుమారు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నగరంలో నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున రైతుబజార్ ఏర్పాటు చేయాలి. కానీ గ్రేటర్ పరిధిలో ఉన్నవి కేవలం 11 రైతుబజార్లు మాత్రమే. ప్రస్తుతం ఉన్న జనాభా అవసరాలు తీర్చేందుకు 50కి పైగా మార్కెట్లు అవసరమని నిపుణుల అంచనా. పలు కాలనీలు, బస్తీ జనం దాదాపు ఐదారు కిలోమీటర్లు ప్రయాణించి మూడు నుంచి నాలుగు గంటలు సయం వెచ్చించి రైతు బజార్లల నుంచి తమకు కావాల్సిన కూరగాయలు తెచ్చుకొని నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
సరిపడని రైతు బజార్లు లేవు
ఆరుగాలం కష్టపడి పండించే రైతుకు గిట్టుబాటు ధర అందాలని, నగర ప్రజలకు తక్కువ ధరలకు ఫ్రెష్ కూరగాయలు అందాలని 1999లో రైతుబజార్లను అందుబాటులోకి తెచ్చారు. ఆనాటి జనాభా గ్రేటర్ జనాభా 40 లక్షలు మాత్రమే. అందుకు అనుగుణంగా ఏర్పాటు చేసిన రైతబజార్లు ప్రస్తుత జనాభాకకు సరిపోవడంలేదు. మార్కెటింగ్ శాఖ కొత్తగా ఏర్పాటు చేయాలన్నా నగరంలో ఖాళీ స్థలాలు దొరకడం లేదు. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, నీరుపారుదలశాఖ, హెచ్‌ఎండీఏ, వక్ఫ్ పరిధిలో ఉన్న అనేక ఖాళీ స్థాలాలు కబ్జాకు గురయ్యాయి. కనీసం ఎకరం స్థలం చూపితే గాని రైతుబజార్ ఏర్పాటు చేయమని మార్కెటింగ్ శాఖ చెబుతోంది. ఈక్రమంలో పలు ప్రాంతాల్లో అంతకంటే తక్కువగా ఉన్న స్థలాలను వాడుకోలేని పరిస్థితి నెలకొంది.
అందుబాటులోకి రాని మోడల్ మార్కెట్లు
గ్రేటర్‌లో ప్రతి 10 వేల మంది జనాభాకు ఓ రైతుబజార్ లేదా మాడల్ మార్కెట్ ఉండాలని, అందుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు ప్రారంభించింది. కానీ ఇంత వరకు మోడల్ మార్కెట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు.
రైతుబజార్లుల్లో దళారుల రాజ్యం
ప్రస్తుతం నగరంలో ఉన్న రైతు బజార్లలో దళారులు రాజ్యమేలుతున్నారు. రైతులకు నామమాత్రంగా కార్డులు కేటాయించి మార్కెట్లను వ్యాపారులకు కట్టబెట్టారు. పలు సందర్భాల్లో ఉన్న కొద్దిపాటి రైతులకు స్థాలాలు దొరక్క రైతుబజార్ల బయట విక్రయాలు చేస్తున్నారు. నగరంలోని ఒక్కో రైతుబజార్‌లో సాధారణ రోజుల్లో 200 క్వింటాళ్ల కూరగాయల వ్యాపారం జరుగుతుందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, సరూర్‌నగర్, మెహిదీపట్నం వంటి పెద్ద మార్కెట్లలో 3500 క్వింటాళ్ల కూరగాయలు అమ్మకాలు చేస్తారు. ఒక్కో రైతుబజార్‌లో రోజుకు రూ.20 లక్షల వరకు వ్యాపారం జరగుతుంది. శని, అదివారాల్లో రూ.50 లక్షల అమ్మకాలు జరుగుతాయిని వ్యాపారుల అంచనా. ఈ మొత్తం విక్రయాలు రైతుల పేరిట అక్కడి వ్యాపారులు సాగిస్తున్నారు. వీరి వ్యాపారానికి ఎక్కడా బిల్లులు ఉండవు.. వాణిజ్య పన్నూ ఉండదు.
సీఎం కేసీఆర్ చెప్పిన మాట ఇదీ..
నగరంలో గత పాలకుల హయాంలో ఏర్పాటు చేసిన మార్కెట్లే తప్ప కొత్తవి రాలేదని, దీంతో తక్కువ స్థలంలో ఎక్కువ మంది అమ్మకాలు చేయడం వల్ల అసౌకర్యంగా ఉందని నాలుగేళ్ల క్రితంముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ మోండా మార్కెట్ సందర్శించినప్పుడు పేర్కొన్నారు. ‘పదివేల మంది జనాభాకు ఒక మార్కెట్ ఉండాలి. నగర వ్యాప్తంగా కేవలం 30 మార్కెట్లు (రైతు బజార్లతో కలిపి) మాత్రమే ఉన్నాయి. ఇవి ఏ మూలకూ సరిపోవు. ప్రజల అవసరాల కనుగుణంగా తగినిన్ని మార్కెట్లు నిర్మాస్తాం. మోండా మార్కెట్‌ను అధునీకరిస్తాం’ అని పేర్కొన్నారు. అందుకనుగుణంగా జీఎచ్‌ఎంసీ అధికారులు పనులకు శ్రీకారం చుట్టారు. తొలిదశలో 200 మోడల్ మార్కెట్లు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే, ఈ నాలుగేళ్లలో కేవలం 30 మోడల్ మార్కెట్లు నిర్మించినప్పటీకీ వాటిలో దుకాణాల కేటాయింపు జరగలేదు.
స్థలం దొరకడం లేదు..
కొత్తగా రైతుబజార్ల ఏర్పాటు ప్రణాళికలు సిద్ధం చేశాం. కానీ, గ్రేటర్ పరిధిలో అనుకూలమైన స్థలాలు లభించడం లేదు. కనీసం ఎకరం స్థలం అయినా అవసరం. నగర ప్రజల కూరగాయల అవసరాలు తీర్చడాకి ‘మన కూరగాయల స్టాల్స్’ను పెంచుతున్నాం. – లక్ష్మీబాయి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment