రేపేదేశంలో ఆర్థిక సరళీకరణ మొదలైన తర్వాత కాలంతో పాటు బడ్జెట్ లక్ష్యాలు కూడా మారిపోతున్నాయి. 1990వ దశకం నుంచి ఇప్పటి వరకు చూస్తే అప్పటి ప్రభుత్వ ప్రాధమ్యాలు ఏ విధంగా ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు. 1991 నుంచి బడ్జెట్‌లను గమనిస్తే.. 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలకు పెద్ద పీట వేయగా, ఆ తర్వాత 2000 నుంచి 2010 మధ్య కాలంలో ద్రవ్య స్థిరీకరణకు ప్రాధాన్యమిచ్చారు. ఇక 2010 తర్వాత బడ్జెట్లు సామాజిక కార్యక్రమాలపై ఎక్కువగా ఖర్చు చేసేలా దృష్టిపెట్టాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు పేదల సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టగా, ఎన్డీయే ప్రభుత్వాలు పన్నుల సంస్కరణలకు పెద్దపీట వేశాయి.
మన్మోహన్... ఆర్థిక వ్యవస్థకు తలుపులు బార్లా!
♦ 1991– 92 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్ వాణిజ్య విధాన సంస్కరణల్లో నూతన దిశను చూపించారు. పరిమాణ పరిమితుల నుంచి ధరల ఆధారిత యంత్రాంగానికి మారే దిశగా అడుగులు వేశారు. విధానాల పరంగా స్వేచ్ఛనివ్వడంతోపాటు, ప్రాధాన్య రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) 51 శాతానికి మన్మోహన్‌సింగ్ పెంచేశారు. వడ్డీ రేట్ల విధానాన్ని కూడా సరళతరం చేశారు. ఇదిగో... ఇప్పటి నుంచే బడ్జెట్లలో ఆర్థిక రంగ పాత్ర విస్తృతమవుతూ వచ్చింది. మ్యూచువల్ ఫండ్స్ అభివృద్ధికి ప్రోత్సాహం, ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరవడం జరిగింది.
చిదంబరం... సంస్థాగత నిర్మాణం
♦ 1997–98లో నాటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం సంస్థాగత నిర్మాణం, నియంత్రణపరమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమైన నియంత్రణపరమైన కార్యాచరణ ఏర్పాటే లక్ష్యంగా ముందుకెళ్లారు. పలితం... సంస్థాగతంగా మార్పుల్లేకుండా నియంత్రణలతో కూడిన ఆర్థిక వ్యవస్థ కాస్తా క్రమబద్ధీకరణ ఆర్థిక వ్యవస్థగా మారింది. విదేశీ మారక నిర్వహణ చట్టం, నూతన కంపెనీల బిల్లు, నూతన ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లుకు చిదంబరం చోటిచ్చారు.
సిన్హా... మౌలికానికి పెద్దపీట
♦ 1998–99లో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన యశ్వంత్ సిన్హా స్వేచ్ఛగానే వ్యవహరించారు. పట్టణాలు, నగరాల్లోని మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా ఆయన చర్యలను చేపట్టారు. అనుమతులు పొందిన హౌసింగ్ ప్రాజెక్టులకు మొదటి ఐదేళ్లపాటు లాభాలపై నూరు శాతం పన్ను మినహాయింపు కల్పించారు. ఆ తర్వాత ఐదేళ్లకూ 30 శాతం రాయితీ కల్పించారు.
♦ 2001–02 బడ్జెట్‌లో యశ్వంత్‌సిన్హా ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ రెగ్యులేషన్స్‌ను ప్రవేశపెట్టారు. దీని వల్ల భాగస్వామ్య కంపెనీల మధ్య లావాదేవీలు పారదర్శకంగా నిర్వహించడం తప్పనిసరిగా మారింది. పన్ను ఎగవేతల నిరోధం విషయంలో ఈ నియంత్రణ ఎంతో ముఖ్య పాత్ర పోషించిందనే చెప్పుకోవాలి.
ప్రణబ్ ముఖర్జీ... సంక్షేమ బాట
♦ ఇక 2005 నాటి బడ్జెట్‌లో (యూపీఏ–1లో) పి.చిదంబరం పేద ప్రజలే ఫోకస్‌గా ముందుకొచ్చారు. అంతక్రితం ఐదేళ్లలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే పాలన, భారత్ వెలిగిపోతోందంటూ వారు చేసుకున్న ప్రచారం బెడిసి కొట్టి ఓటమిపాలవడంతో, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కారు సామాన్యులపై దృష్టి పెట్టింది. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాలు అమల్లోకి వచ్చాయి. ఇక యూపీఏ–2లో చివర్లో ఆర్థిక మంత్రిగా పగ్గాలు చేపట్టిన ప్రణబ్ ముఖర్జీ కూడా సంక్షేమనానికే సై అన్నారు.
అరుణ్ జైట్లీ... పన్ను సంస్కరణలకు సై
♦ 2014– 2018 మధ్యలో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో అరుణ్ జైట్లీ కీలక సంస్కరణలతోపాటు ఇతర చర్యలూ చేపట్టారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు, డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియాకు నిధులు అందించారు. జీఎస్‌టీ సంస్కరణను తీసుకొచ్చారు. మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గించారు. 2015లో వెల్త్ ట్యాక్స్‌ను (సంపద పన్ను) రద్దు చేసి, రూ.కోటి ఆదాయం దాటిన వారిపై 2% అదనపు సర్‌చార్జ్ తీసుకొచ్చారు. 2017లో రూ.2.5–5 లక్షల మధ్య పన్ను వర్తించే ఆదాయం వారికి పన్ను రేటు 10% నుంచి 5%కి తగ్గించారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు రూ.12,500 ఆదా అయింది.
Comments
Please login to add a commentAdd a comment