
దేశ ఆర్థిక వృద్ధికి మధ్యతరగతి వర్గాలు, చిన్న వర్తకులు, రైతులు జీవనాడి వంటివారు. బడ్జెట్ 2019లో ప్రకటించిన నిర్ణయాలు లక్షలాది మంది కలలు.
– గౌతం అదానీ, అదానీ గ్రూపు చైర్మన్
ఆర్థిక రంగ దివాలా పరిస్థితి రాకుండా కీలకమైన మధ్యతరగతి, రైతాంగ విభాగాలకు ఇచ్చిన ఉపశమన నిర్ణయాలు గొప్పగా ఉన్నాయి. నియంత్రణతో కూడిన, ప్రేరణనిచ్చే కసరత్తు ఇది. ఆదాయాన్ని స్థిరీకరించి, ఒత్తిడిని ఎదుర్కొంటున్న వర్గాలకు రిస్క్‌ను తగ్గిస్తాయి.
– ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూపు చైర్మన్
గ్రామీణ ప్రజలకు ఉపశమనం కలిగించే, వినియోగానికి ప్రేరణనిచ్చేలా బడ్జెట్ ఉంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి వృద్ధికి ఊతమిచ్చేలా, ద్రవ్య క్రమశిక్షణతో, అదే సమయంలో ప్రభుత్వ ఖజానాపై పెద్ద భారం పడకుండా బడ్జెట్‌ను ప్రకటించినందుకు నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని అభినందించాలి’’
– అనిల్ అగర్వాల్, వేదాంత రీసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్
వినియోగాన్ని పెంచడం, వ్యవసాయం, గ్రామీణ వర్గాలు, అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ప్రయోజనాలు కల్పించే కార్యాచరణ వృద్ధికి ప్రేరణనిస్తుంది. బడ్జెట్ నిర్ణయాలు ఆర్థిక రంగానికి మంచి చేస్తాయి.
– సంజయ్‌పూరి, ఐటీసీ ఎండీ
ఇది ఎన్నికల సంవత్సరం బడ్జెట్. అందరికీ ఉద్దేశించినది. రైతుల నుంచి వర్తకుల వరకు, అవ్యవస్థీకృత రంగంలోని పనివారి నుంచి మధ్యతరగతి వేతన జీవుల వరకు అందరికీ ఏదో ఒకటి ఉంది. ప్రభుత్వం
చాలా సమతూకం పాటించింది. ద్రవ్యలోటుకు కట్టుబడి ఉంటామన్న సంకేతాన్నిచ్చింది. అయితే, ఆరోగ్య రంగానికి అదనపు కేటాయింపుల్లేకపోవడం లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి ప్రోత్సాహకాలు లేకపోవడం నిరాశ కలిగించింది.
– కిరణ్ మజుందార్‌షా, బయోకాన్ సీఎండీ
వ్యవసాయం, మధ్యతరగతి వర్గాలే స్పష్టమైన లక్ష్యంతో బడ్జెట్ ఉంది. నేరుగా నగదు, పన్ను మినహాయింపుతో లబ్ధిదారులకు రూ.93,000 కోట్ల వెసులుబాటు కలిగిస్తుంది. ఈ పథకాలు వినియోగాన్ని పెంచుతాయి. గ్రామీణ ఆర్థిక రంగానికి మేలు చేస్తాయి’’
– పవన్ ముంజాల్, హీరోమోటోకార్ప్ చైర్మన్
ప్రతీ రంగంలో, ప్రతీ వర్గంలో కొనుగోలు శక్తిని పెంచే విధంగా బడ్జెట్ ఉంది. వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపును రూ.5 లక్షలకు పెంచడం చారిత్రక నిర్ణయం. దీంతో వారు ఖర్చు చేసేందుకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి. మరింత మంది ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేస్తారని, పరిశ్రమ వృద్ధికి తోడ్పడుతుందని అంచనా.
– వేణు శ్రీనివాసన్, టీవీఎస్ మోటార్ చైర్మన్
చిన్న, మధ్య స్థాయి రైతులకు ఆదాయాన్నిచ్చే పథకం ఎంతో ఆహ్వానించతగినది. పశు సంరక్షణ, చేపల పెంపకం కోసం వడ్డీ రాయితీతో కూడిన రుణాలు ఆయా రంగాలకు చేయూతనిస్తుంది. ఆదాయపన్ను మినహాయింపును రూ.5 లక్షలకు పెంచడం, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్ పరిమితిని రూ.40,000కు పెంచడం కొత్త డిపాజిట్లను ఆకర్షించేందుకు తోడ్పడతాయి.
– రజనీష్ కుమార్, ఎస్‌బీఐ చైర్మన్
సంక్షోభం లేని ఆరోగ్య వ్యవస్థకు, ఆరోగ్య భారత్ విషయంలో ప్రభుత్వ కట్టుబాటును మధ్యంతర బడ్జెట్ తెలియజేసింది. ప్రభుత్వ చర్యల్లో ఆరోగ్య సంరక్షణ చాలా కీలకంగా ఉండాలి. ఆరోగ్య సదుపాయాల విషయంలో పల్లెలు, పట్టణాల మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు అవకాశాలను కోల్పోకూడదు. ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించే విధానాలు అవసరం’’
– సంగీతారెడ్డి, అపోలో హాస్పిటల్స్ గ్రూపు జాయింట్ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment