ఎన్నికల బడ్జెట్‌ | Sakshi Editorial On Union Budget 2019 | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 2 2019 12:46 AM | Last Updated on Sat, Feb 2 2019 12:46 AM

Sakshi Editorial On Union Budget 2019

గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన వర్గాలను నరేంద్రమోదీ ప్రభుత్వం ఎట్టకేలకు కనికరిం చింది. పదవీకాలం ముగుస్తుండగా ‘కొసమెరుపు’లా వరాల జల్లు కురిపించి వారిని సంభ్రమాశ్చ ర్యాల్లో ముంచెత్తింది. శుక్రవారం ‘తాత్కాలిక బడ్జెట్‌’ ప్రవేశపెట్టిన  కేంద్రమంత్రి పియూష్‌ గోయెల్‌ ప్రధానంగా అటు చిన్న సన్నకారు రైతులను, ఇటు మధ్యతరగతిని సమ్మోహనపరచడానికి ప్రయ త్నించారు. ఇతరేతర వర్గాలకూ ఎన్నో తాయిలాలు పంచారు. అయిదెకరాల లోపు ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6,000 మూడు దఫాలుగా ఇస్తామని ప్రకటించారు. ఈ నగదును నేరుగా కేంద్రమే రైతులకు బదిలీ చేస్తుంది. గత డిసెంబర్‌ నుంచి ఇది అమల్లోకొస్తుంది. అంటే ఎన్నికల ముందు దేశ వ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు రూ. 2,000 చొప్పున అందుతాయి. వేతన జీవుల ఆదాయ పన్ను పరిమితిని రూ. 5 లక్షలకు పెంచడం, 60 ఏళ్ల వయసుపైబడిన అసంఘటిత రంగ కార్మికు లకు నెలకు రూ. 3,000 చొప్పున పెన్షన్‌ పథకం వంటివి సహజంగానే ఆ వర్గాలను ఆకట్టుకుం టాయి. తాజా ప్రతిపాదనలతో ఆదాయపన్ను పరిధి నుంచి తప్పుకునేవారి సంఖ్య 3 కోట్లు ఉండొ చ్చునని అంచనా.

అలాగే 10 కోట్లమంది అసంఘటిత కార్మికులు పెన్షన్‌ లబ్ధి పొందుతారని లెక్కే స్తున్నారు. పదవీకాలం ముగుస్తున్న ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌తో సరిపెట్టడమే సంప్రదాయంగా వస్తోంది. మోదీ సర్కారు కూడా దీన్ని తాత్కాలిక బడ్జెట్‌ అని చెబుతోంది. కానీ బడ్జెట్‌ ప్రతిపాద నలు గమనిస్తే ఇవి మూడు నెలల కాలానికి ఉద్దేశించినవి కాదని సులభంగానే తెలుస్తుంది. కొత్తగా పన్నులు విధించడం లేదా ఉన్న పన్నుల్ని తగ్గించడం, ప్రభుత్వ వ్యయాన్ని పెంచే ప్రతిపాదనలు చేయడం వగైరాలకు ఫైనాన్స్‌ బిల్లు  సవరించవలసిన అవసరం ఏర్పడుతుంది. నిష్క్రమిస్తున్న ప్రభుత్వం ఇలా తదుపరి ప్రభుత్వానికి భారం కలిగించరాదన్నది ఓటాన్‌ అకౌంట్‌ సంప్రదాయం లోని ఉద్దేశం. లోక్‌సభకూ, రాష్ట్రాల అసెంబ్లీలకూ జమిలి ఎన్నికలు జరపడంపై నిర్మాణాత్మక చర్చ సాగించాలని ఆమధ్య నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఎప్పుడూ ఏవో ఎన్నికలు ముంచుకొస్తున్నం దువల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతున్నదని ఆయన ఫిర్యాదు. కానీ తరచు ఎన్ని కలు వస్తే బడ్జెట్‌లు ఎంత బాగుంటాయో తాజా బడ్జెట్‌ చూశాక అందరికీ అర్ధమవుతుంది.

ఇది పూర్తి స్థాయి బడ్జెట్టా, తాత్కాలికమా అన్న వివాదం సంగతలా ఉంచి ఇందులో సాధారణ రైతుల్ని పట్టించుకుని వారికి ఏదోమేర ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించడం హర్షించదగ్గ విషయం. నిజానికి రైతులకు ఆర్థిక ఆసరా కల్పించి వారి కష్టాలను తీర్చడానికి ప్రయత్నించే పథకాన్ని దేశంలోనే మొట్టమొదటిసారి ప్రకటించిన ఘనత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుంది. ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ కింద ప్రతి ఏడాది మే నెలలో రైతులకు రూ. 12,500 చొప్పున అందజేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి రెండేళ్లక్రితం చెప్పారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ‘రైతుబంధు’, ఒడిశా ‘కలియా’, జార్ఖండ్‌ ‘ముఖ్యమంత్రి కృషి యోజన’వంటి పథకాలను ప్రకటించాయి. ఇప్పుడు కేంద్రం కూడా ఆ వరసలో చేరింది. అయితే నిజంగా రైతులకు లబ్ధి చేకూర్చదల్చుకుంటే తాజా పథకం వారి కష్టాలను ఏమాత్రం తీర్చదు. అలా తీరాలంటే 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలి. స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సుకు అనుగుణంగా సాగు దిగుబడికయ్యే వ్యయానికి అదనంగా 50 శాతం చేర్చి కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) నిర్ణయిస్తామని ఆ మేనిఫెస్టో చెప్పింది. నిజానికి సాగు వ్యయం అయిదారేళ్లుగా అపారంగా పెరిగింది. విత్తనాలు మొదలుకొని ఎరువులు, పురుగు మందులవరకూ అన్నిటి ధరలు మండుతున్నాయి. సాగు ఉపకరణాలకిచ్చే సబ్సిడీలు కొన్నేళ్లుగా కనుమరుగయ్యాయి. ఏటా కేంద్రం విడుదల చేసే ఆర్థిక సర్వేలే రైతు వార్షికాదాయం గరిష్టంగా రూ. 20,000 మించడం లేదని చెబుతున్నాయి. ఇంటిల్లిపాదీ కష్టపడటంతోపాటు కూలీలను కూడా నియమించుకుని పనిచేసే రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 6,000(నెలకు రూ. 500) ఏ మూలకు సరిపోతాయి?

ఈ బడ్జెట్‌లో అత్యంత కీలకమైన గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 60,000 కోట్లు కేటాయిస్తూ చేసిన ప్రతిపాదన నిరాశ కలిగిస్తుంది. అయితే అవసరమనుకుంటే దీన్ని పెంచుతామని మంత్రి గోయెల్‌ హామీ ఇస్తున్నారు. నిరుటి బడ్జెట్‌లో ఈ పథకానికి రూ. 55,000 కోట్లు కేటాయించారు. మళ్లీ అవసరాలు పెరగడంతో ఆ కేటాయింపులు రూ. 61,084 కోట్లకు చేరాయి. అయితే ఈసారి ఆ మొత్తాన్ని మరింత పెంచకపోగా రూ. 1,084 కోట్లు కోత విధించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. చట్ట నిబంధనలకు అనుగుణంగా దీన్ని సక్రమంగా కొనసాగించడానికి కనీసం రూ. 80,000 కోట్లు అవసరమవుతాయని ఆ రంగంలోని ప్రజాసంఘాలు చెబుతున్నాయి. విద్యారంగానికి చేసిన కేటాయింపులు కూడా నిరాశ కలిగిస్తాయి. నిరుడు ఆ రంగానికి రూ. 85,010 కోట్లు కేటాయిస్తే, ఇప్పుడది 10శాతం పెరిగి రూ. 93,847 కోట్లకు చేరుకుంది. ఇది ఏమూలకూ సరిపోదని విద్యారంగ నిపుణులు చేస్తున్న వాదనలో నిజముంది. విద్య, ఉద్యోగావకాశాల్లో పేదలకు పది శాతం కోటా కల్పిస్తూ గత నెలలో సర్కారు నిర్ణయించింది. ఉన్నత విద్యాసంస్థల్లో అది అమలు కావాలంటే అదనంగా 25 శాతం సీట్లు పెంచాలి. ఇంత స్వల్ప మొత్తం అదనపు అవసరాలకు ఏమాత్రం చాలదు. ఇక ఇతర ఉన్నత సంస్థల సంగతి చెప్పనవసరం లేదు. రక్షణ వ్యయం 7 శాతం పెరిగి అది రూ. 3లక్షల కోట్లు దాటింది. ఆంధ్రప్రదేశ్‌కు ఈ బడ్జెట్‌లో ఎప్పటిలాగే మొండిచేయి చూపారు. ఈ ఎన్నికల సంవత్సరంలోనైనా రైల్వేజోన్, ప్రత్యేక హోదా వంటి వాగ్దానాలను పరిశీలించేందుకు, సానుకూల నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం ప్రయత్నించలేదు. తాజా జనాకర్షణ బడ్జెట్‌ మరికొన్ని నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏమేరకు ఓట్లు రాబడుతుందో వేచిచూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement