
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ అనే కొత్త పథకాన్ని శుక్రవారం నాడు పార్లమెంట్‌కు సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీని కోసం 75 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏటా ఆరువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ ఫథకం లక్ష్యం. ‘2022 నాటికి దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ఈ కొత్త పథకంతో సాకారం అవుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు వ్యాఖ్యానించారు. అప్పుడు భారతీయులు 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మరింత సగౌరవంగా జరుపుకోవచ్చని ఆయన అన్నారు. ఆయన మాటల్లో నిజముందా? ఆయన వ్యాఖ్యలు నిజమవుతాయా?
ఐదెకరాలలోపు భూమున్న రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం అంటే నెలకు 500 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడం అన్న మాట. ఓ రైతు కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉన్నారనుకుంటే వారిలో ఒక్కొక్కరికి రోజుకు 3.3 రూపాయల సహాయం అందుతుందన్న మాట. ప్రస్తుతం దేశంలో వ్యవసాయం వద్ధి రేటు జీడీపీలో 2.5 శాతం ఉంది. అది పన్నెండు శాతానికి పెరిగితే తప్పించి రైతుల ఆదాయం రెట్టింపు కాదని వ్యవసాయ నిపుణులు ఇప్పటికే అంచనా వేశారు. మరో మూడేళ్ల కాలంలో 2.5 శాతం ఉన్న వద్ధి రేటు 12 శాతానికి చేరుకోవడం ఎలాసాధ్యం? రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు గత బడ్జెట్‌లో 20 వేల కోట్ల రూపాయలను కేటాయించగా, ఈసారి ఆ మొత్తాన్ని కొత్త పథకం పేరిట 75 వేల కోట్ల రూపాయలకు పెంచారు. రైతు బడ్జెట్‌ను మూడుంబావు రెట్లు పెంచినంత మాత్రాన 2.5 శాతం ఉన్న వ్యవసాయం వద్ధిరేటు 12 శాతాన్ని ఎలా తాకుతుంది?
నరేంద్ర మోదీ ప్రభుత్వం హయాంలో వివిధ వ్యవసాయ పంటల కనీస మద్దతు ధరలు పడిపోయాయి. గిట్టుబాటు ధరలు లేక రైతులు రోడ్డెక్కారు. 2018లో దేశవ్యాప్తంగా రైతులు పలుసార్లు ఆందోళనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారిని మంచి చేసుకోవడం కోసం రానున్న పార్లమెంట్ ఎన్నికలను దష్టిలో పెట్టుకొని రైతులకు తాయిలం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment