
సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు నిరాశ ఎదురైంది. జిల్లా ప్రస్తావన ఎక్కడా కానరాలేదు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఆదాయ పన్ను రాయితీల వల్ల వేతన జీవులకు కొంత ఊరట లభించింది. వివాదాల మధ్య చిక్కుకున్న బహుళార్ధసాధక పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై పాలకుల నిర్లక్ష్యం మరోసారి స్పష్టంగా బయటపడింది. శుక్రవారం పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ ఇన్‌చార్జ్ మంత్రి పీయూష్‌గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క పైసా కేటాయించకపోవడం గమనార్హం. పోలవరానికి నాబార్డు ద్వారా నిధులు ఇస్తున్నట్లు చెబుతు న్నా.. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంపై బడ్జెట్‌లో ప్రస్తావన చేయకపోవడం నిరాశను మిగిల్చింది.
వేతన జీవులకు ఊరట
వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయలలోపు ఉన్న వారు ఇకపై ఆదాయ పన్ను చెల్లించనవసరం లేదు. రూ.6.5 లక్షల వరకూఉన్న వారు కూడా బీమా, పెన్షన్ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాయితీ పొందవచ్చు. ఇక కొత్తగా ఇల్లు కొనాలనుకునే వారికి జీఎస్టీ మినహాయింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. గృహరుణాలు, ఆరోగ్య బీమా, జాతీయ పింఛను పథకానికి చెల్లించే వారికి రూ.రెండు లక్షల వరకు మినహాయింపు లభించనుంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేటు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యూటీ మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రెండో గృహానికి కూడా అద్దె చెల్లించే వారికి ఆ మేరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం, పోస్టాఫీస్ పొదుపు పథకాలపై వచ్చే వడ్డీపై టీడీఎస్ రూ.10 వేల నుంచి రూ.40 వేలకు పెంచడం, ఇంటి అద్దెలపై టీడీఎస్ రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంపు, ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54 కింద రెండు ఇళ్లపై పెట్టుబడులు పెట్టవచ్చన్న నిబంధనల పట్ల ఉద్యోగవర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు పేదలకు ఇళ్ల పథకం కింద 2020 లోపు రిజిస్టర్ చేసుకొన్న ఇళ్లకు కూడా ఆదాయç పన్నులో మినహాయింపు లభించనుంది.
రైతులకు నామమాత్రపు భరోసా
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం కింద ఐదు ఎకరాలలోపు రైతులకు ఏటా రూ.6,000 చెల్లిస్తామని పీయూష్ ప్రకటించారు.. దీనిని రూ.2,000 చొప్పున మూడు విడతలుగా అందిస్తారు. ఈ మొత్తం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో పడుతుంది. అయితే ఈ పథకం పట్ల రైతుల్లో పెద్దగా స్పందన లేదు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏటా రైతుకు రూ. 12,500 పెట్టుబడి నిధి కింద ఇవ్వడానికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీతో చూస్తే కేంద్రం ప్రకటించిన మొత్తం పట్ల పెద్దగా హర్షం వ్యక్తం కాలేదు.
ప్రత్యేకహోదా, ప్యాకేజీ ఊసే లేదు
పీయూష్‌గోయల్ బడ్జెట్‌లో ఎక్కడా ఓ రాష్ట్రానికి, ప్రాంతానికి సంబంధించిన ప్రస్తావన రాలేదు. అయితే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ప్రత్యేక హోదా, ప్యాకేజీలతోపాటు విభజన చట్టం హామీల అమలు ఊసు వస్తుందని అందరూ ఆశించారు. కానీ బడ్జెట్ ప్రసంగంలో ఏపీ హోదా, ప్యాకేజీల గురించే కాదు రాజధాని నిర్మాణం నిధుల గురించి కూడాఎక్కడా ప్రస్తావన రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేపల సాగుదారులకు వడ్డీపై రెండు శాతం సబ్సిడీ ఇవ్వడం వల్ల ఆక్వా రైతులకు కొంతమేర ఊరట కలగనుంది.
రాష్ట్రానికి ద్రోహం
కేంద్ర బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ప్రత్యేక హోదా ప్రస్తావన, విభజన హామీలకు ఒక్క పైసా కేటాయించలేదు. పోలవరానికి నిధులేమీ ఇవ్వలేదు. కంటి తుడుపు చర్యగా ఐదెకరాలలోపు ఉన్న రైతులకు సంవత్సరానికి రూ.6000 ఆర్థిక సాయాన్ని ప్రకటించడం దారుణం. రానున్న రోజుల్లో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం మరిన్ని ఉద్యమాలు చేయాలి. దీనికి ప్రజలు సన్నద్ధం కావాలి.– చింతకాయల బాబురావు. సీపీఎం జిల్లా అప్‌ల్యాండ్ కార్యదర్శి
ఎన్నికల్లో ఇచ్చిన హామీల ఊసులేదు..
కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచింది. గత ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ఊసు లేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చి గాలికొదిలేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని విస్మరించారు. విభజన హామీలనూ ప్రస్తావించకపోవడం దారుణం. – డేగా ప్రభాకర్. సీపీఐ జిల్లా కార్యదర్శి
రైతుల ఆశలపై నీళ్లు
కేంద్ర బడ్జెట్ రైతుల ఆశలపైనీళ్లు చల్లింది. కంటితుడుపు చర్యగా కేవలం రూ.6వేలు సాయంప్రకటించడం దారుణం. సాయాన్ని ఎకరాకు కనీసం రూ.పది వేలు చేయాలి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. రుణామాఫీచేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నా.. పట్టించుకోకపోవడం దారుణం. – కె.శ్రీనివాస్. రైతు సంఘం అప్‌ల్యాండ్ జిల్లా కార్యదర్శి
పేదల బడ్జెట్ కాదు
బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం దారుణం. ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం గ్యాస్ ధరలు పైపైకి పోవడంపై పెదవి విప్పలేదు. ఇది పేదల బడ్జెట్ కాదు. మహిళలకు ఈ బడ్జెట్‌లో మొండిచేయి చూపారు. – మహ్మద్ ఆమరజహాబేగ్. ఏఐసీసీ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment