చరిత్రలోని ఐదు ముఖ్యమైన బడ్జెట్లు | Five important budgets in history | Sakshi
Sakshi News home page

చరిత్రలోని ఐదు ముఖ్యమైన బడ్జెట్లు

Published Sat, Feb 2 2019 3:32 AM | Last Updated on Sat, Feb 2 2019 3:32 AM

Five important budgets in history - Sakshi

దేశ ఆర్థిక స్థితిని బడ్జెట్‌ ప్రతిబింబిస్తుంది. ఈ బడ్జెట్‌లో కేటాయింపుల ఆధారంగానే దేశ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సంక్షేమపథకాలకు కేటాయింపులు, కీలక నిర్ణయాలుండే ఈ బడ్జెట్‌పై సామాన్యుడి దగ్గర్నుంచి.. కార్పొరేట్‌ దిగ్గజాల వరకు అందరికీ ఆసక్తి ఉంటుంది. ఏడాదికోసారి ఆర్థిక శాఖ మంత్రి.. తమ ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలను బడ్జెట్‌ ద్వారా దేశ ప్రజలకు, ప్రపంచానికి వెల్లడిస్తారు. కేంద్ర మంత్రి పీయుష్‌ గోయల్‌ తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో.. చరిత్రలోని ఐదు ముఖ్యమైన బడ్జెట్‌ల గురించి తెలుసుకుందాం. 

బ్లాక్‌ బడ్జెట్‌ 1973
1973లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను దేశ చరిత్రలో బ్లాక్‌ బడ్జెట్‌గా పిలుస్తారు. రహస్య లేదా పేర్కొనలేని ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు జరిగినందునే ఈ బడ్జెట్‌ను బ్లాక్‌ బడ్జెట్‌ అంటారు. 1973–74లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్‌రావ్‌ చవాన్‌ భారీ ద్రవ్యలోటుతో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ రూ.550 కోట్లు. ఇందులో రూ.56 కోట్లను బొగ్గుగనులు, సాధారణ బీమా కంపెనీలు, ఇండియన్‌ కాపర్‌ కార్పొరేషన్‌ల జాతీయీకరణకు కేటాయించారు. ఈ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

నవశకానికి నాంది 1991
భారత ఆర్థిక వ్యవస్థలో కొత్త శకానికి నాంది పలికినట్లుగా పేర్కొన్న బడ్జెట్‌ను 1991లో నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ప్రవేశపెట్టారు. దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆర్థిక సరళీకరణకు బీజం వేసినందునే.. దీన్ని దేశ ఆర్థిక వ్యవస్థలో నవశకానికి నాందిపలికిన బడ్జెట్‌ అని అంటారు. పీవీ నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వం ఎగుమతి, దిగుమతి విధానంలో మార్పులు తెచ్చింది. తద్వారా దేశ ఆర్థిక విధా నాలను ప్రపంచ వాణి జ్యానికి అనుగుణంగా.. సరళీకృతం చేశారు. 220%గా ఉన్న కస్టమ్స్‌ డ్యూటీని 150%కి తగ్గించారు. ఈ బడ్జెట్‌ విధానాల కారణంగానే.. రెండు దశాబ్దాల్లో భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన నిలిచింది. 

డ్రీమ్‌ బడ్జెట్‌ 1997
భారత చరిత్రలో 1997లో నాటి యునైటెడ్‌ ప్రభుత్వ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ‘డ్రీమ్‌ బడ్జెట్‌’గా నిలిచిపోయింది. వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్‌ పన్నుల్లో మార్పులు తీసుకొచ్చిన బడ్జెట్‌ ఇది. అప్పుడు 40%గా ఉన్న ఆదాయపన్ను రేటును 30%కు తీసుకొచ్చింది ఈ బడ్జెట్‌లోనే. చాలా చోట్ల సర్‌చార్జీలను, రాయల్టీ రేట్లను తగ్గించారు. పన్నుల భారం తగ్గడంతో దీన్ని ప్రజలు స్వాగతించారు.  

మిలీనియం బడ్జెట్‌ 2000
కొత్త శతాబ్దంలో (2000) యశ్వంత్‌ సిన్హా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను మిలీనియం బడ్జెట్‌ అంటారు. భారత సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులకు ఈ బడ్జెట్‌ బాటలు వేసింది. ఇందులో మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక మంత్రిగా సాఫ్ట్‌వేర్‌ ఎగుమతిదారులకు ఇచ్చిన ప్రోత్సాహకాలను విడతలవారిగా తగ్గించారు. కంప్యూటర్లు, సీడీలు మొదలైన 21 వస్తువులపై కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించారు. తద్వారా ఐటీ రంగం జోరు పెరిగేందుకు కారణమైంది. ఇది కేంద్రం తీసుకున్న సాహసోపేత నిర్ణయమని ఆర్థిక నిపుణులు కూడా ప్రశంసించారు.  

రోల్‌బ్యాక్‌ బడ్జెట్‌ 2002
బడ్జెట్‌ అంటే ప్రతిసారీ కొత్త ప్రణాళికలు, వాటి అంచనాలను ప్రకటించమేనని తెలుసు. కానీ 2002–03కోసం యశ్వంత్‌ సిన్హా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పథకాలు ప్రతిపాదించారు. ఇందులో ఎల్పీజీ సిలిం డర్ల ధరలు పెంచడం, సర్వీస్‌ టాక్స్‌ పెంపు వంటి నిర్ణయాలు ప్రకటించారు. అయితే విపక్షాలనుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో.. ఈ నిర్ణయాలను వెనక్కు తీసుకున్నారు. అందుకే ఇది దేశ చరిత్రలో రోల్‌బ్యాక్‌ బడ్జెట్‌గా నిలిచిపోయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement