న్యూఢిల్లీ: స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఈసారి బడ్జెట్లో కేటాయింపులు పెరిగాయి. తాజా బడ్జెట్లో ఈ శాఖకు రూ. 2,9164.90 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ. 24758.62 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 20 శాతం అధికం. రాబోయే ఐదేళ్లకు చేపట్టాల్సిన పనుల గురించి రోడ్ మ్యాప్ తయారు చేస్తామని స్త్రీశిశు సంక్షేమమంత్రి మనేకా గాంధీ చెప్పారు. దేశవ్యాప్తంగా స్త్రీలు, పిల్లల కోసం ఏకీకృత కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. దేశ జనాభాలో 40 శాతమున్న పిల్లలకు జరపాల్సిన కేటాయింపులు మాత్రం అంచనాలకు అనుగుణంగా లేవని చైల్డ్ రైట్స్ అండ్ యూ సంస్థ సీఈఓ పూజా మర్వాహా పెదవివిరిచారు. బడ్జెట్ ప్రసంగంలోకానీ, విజన్ 2030లో కానీ పిల్లల ప్రస్తావనే లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తావన లేకపోవడంపై కూడా ఎన్‌జీవోలు నిరాశ వ్యక్తం చేశారు.
ప్రధాన కేటాయింపులు
► ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకానికి కేటాయింపులు రూ. 1,200 కోట్ల నుంచి రూ. 2,500 కోట్లకు పెంపు.
► ఈ పథకం కింద గర్భిణీ స్త్రీలు, బాలింతలకు రూ. 6,000 సాయం.
► జాతీయ పౌష్టికాహార మిషన్(ఎన్‌ఎన్‌ఎం) ద్వారా పదికోట్ల మందికి ప్రయోజనం. ఈ పథకానికి రూ. 3,400 కోట్ల కేటాయింపు.
► శిశు అభివృద్ధి సేవలకు కేటాయింపులు రూ. 925 కోట్ల నుంచి రూ. 1500కు పెంపుదల.
► బేటీ బచావ్, బేటీ పడావో పథకానికి రూ. 200 కోట్ల నుంచి రూ. 280 కోట్ల కేటాయింపుల పెంపుదల.
► అంగన్‌వాడీ సేవలకు రూ. 19,834.37 కోట్ల కేటాయింపులు.
► నేషనల్ క్రెచ్ స్కీమ్‌కు రూ. 30 కోట్ల నుంచి రూ. 50 కోట్లకు కేటాయింపులు పెంచారు.
► వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పథకానికి కేటాయింపులు రూ. 52 కోట్ల నుంచి రూ. 165 కోట్లకు పెంపు.
► మహిళా శక్తి కేంద్రాల పథకానికి కేటాయింపులు రూ. 115 నుంచి రూ. 150 కోట్లకు పెంచారు.
► ఉజ్వల(అక్రమ రవాణా నుంచి కాపాడిన మహిళలను ఆదుకునే పథకం)కు కేటాయింపులు రూ. 20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు, విడో గృహాలకు రూ. 8 కోట్ల నుంచి రూ. 15 కోట్లకు పెంచారు.
► మహిళా సాధికారత, సశక్తిత మిషన్‌కు బడ్జెట్‌ను రూ. 1,156 కోట్ల నుంచి రూ. 1,330 కోట్లకు పెంపుదల.
‘ఆమె’కోసం రూ.1,330 కోట్లు
న్యూఢిల్లీ: మహిళల రక్షణ, సాధికారతకోసం బడ్జెట్‌లో రూ.1,330 కోట్లు కేటాయించామని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. గత బడ్జెట్‌కన్నా ఈ మొత్తం రూ.174 కోట్లు అధికమని శుక్రవారం లోక్‌సభలో ఆయన తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా తెలిపారు. గత నాలుగేళ్లుగా మహిళలకోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా ‘మహిళాభివృద్ధి నుంచి మహిళల నేతృత్వంలో అభివృద్ధి’సాధించగలిగామని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి ముద్ర యోజన లబ్ధిదారుల్లో 70 శాతంపైగా మహిళలు ఉన్నారని, సులువైన రుణ పద్ధతి ద్వారా వారు స్వయంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకున్నారని గోయల్ చెప్పారు. అలాగే 26 వారాల ప్రసూతి సెలవుల ద్వారా మహిళలకు ఉపాధిలో ఆర్థిక భరోసా కలిగిందన్నారు. ఉజ్వల యోజన ద్వారా ఎనిమిది కోట్ల ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లను ప్రభుత్వం అందిస్తోందని, ఇప్పటికే లబ్ధిదారుల సంఖ్య ఆరుకోట్లు దాటిందని, మిగిలినవి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందజేస్తామని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment