మోదీ.. ‘రియల్‌’ మేజిక్‌!! | Interim Budget 2019: Relax your second home is now tax-free | Sakshi
Sakshi News home page

మోదీ.. ‘రియల్‌’ మేజిక్‌!!

Published Sat, Feb 2 2019 12:47 AM | Last Updated on Sat, Feb 2 2019 4:40 AM

Interim Budget 2019: Relax your second home is now tax-free - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారీ నిర్మాణ సంస్థలు ప్రాజెక్టుల్ని పూర్తి చేయలేక మధ్యలోనే చేతులెత్తేస్తుండటం... అప్పటికే డబ్బులు చెల్లించి ఇళ్లకోసం ఎదురుచూస్తున్న కొనుగోలుదారులు న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తుండటం కొన్నాళ్లుగా రియల్టీ రంగాన్ని తీవ్రంగా వేధిస్తున్నాయి. రెరా వంటి చట్టాల్సి తెచ్చినా ఈ మధ్య కాలంలో రియల్టీ పుంజుకున్నది లేదు. ఈ రంగాన్ని ఆదుకోవటానికి కేంద్రం ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్ని వర్గాలూ భావిస్తున్న తరుణంలో ఈ సారి బడ్జెట్లో కేంద్రం పలు చర్యలు తీసుకుంది. అందుబాటు గృహాలపై పన్ను రాయితీలు మరో ఏడాది పాటు పొడిగించటమే కాకుండా... అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) మీద పన్ను మినహాయింపులు రెండేళ్ల వరకూ పొడిగించింది. రెండో ఇంటిపై కూడా ఆదాయ పన్ను మినహాయింపులిచ్చింది. వీటికి సంబంధించిన వివరాలు చూస్తే... 

ఊహాజనిత అద్దెపై పన్నుండదు.. 
ప్రస్తుతం ఒక వ్యక్తి పేరిట రెండు ఇళ్లున్నాయనుకోండి. అద్దెకు ఇవ్వకుండా రెండు ఇళ్లలోనూ తనే నివాసం ఉంటున్నా... ఒకదాన్ని అద్దెకు ఇచ్చినట్లుగా భావించి, ఆ ఊహాజనిత అద్దెపై ఆదాయపు పన్ను చెల్లించాల్సి వస్తోంది. మారుతున్న పరిస్థితుల్లో ఉద్యోగరీత్యా, పిల్లల చదువు రీత్యా, లేక తల్లిదండ్రుల సంరక్షణ మొదలైన సందర్భాల్లో మధ్యతరగతి ప్రజలకు రెండు చోట్ల ఇళ్లు ఉండటమన్నది అవసరంగా మారిపోతోందని, అలా రెండు ఇళ్లలనూ తామే నివాసముంటున్నా అద్దె వస్తున్నట్లుగా భావించి ఆదాయపు పన్ను చెల్లించటమనేది ఇబ్బందిగా మారిందని తన బడ్జెట్‌ ప్రసంగంలో పీయూష్‌ గోయెల్‌ స్పష్టంచేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి బడ్జెట్‌లో రెండో గృహంపై వచ్చే ఊహాజనిత అద్దెకు ఆదాయ పన్ను మినహాయింపునిచ్చారు. అంటే రెండు ఇళ్లున్న వారు తాము గనక రెండింట్లోనూ ఉంటే... ఒకదాన్ని అద్దెకిచ్చినట్లుగా భావించి  పన్ను కట్టక్కర్లేదన్నమాట. అంతేకాకుండా ఐటీ సెక్షన్‌ 54 ప్రకారం ఒక ఇంటిని విక్రయించగా వచ్చే మొత్తాన్ని రెండు ఇళ్లు కొనుగోలుకు వెచ్చించే అవకాశాన్ని కల్పించారు. గరిష్ఠంగా రూ.2 కోట్ల మొత్తానికి లోబడి ఈ రెండు ఇళ్లకు వెచ్చించిన మొత్తంపై మూలధన లాభాలకు మినహాయింపు కల్పిస్తారు. ఇప్పటిదాకా ఇది ఒక గృహం కొనుగోలుకు మాత్రమే వర్తించేది.కాకపోతే ఇది జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది!

ఇన్వెంటరీ మీద నో ట్యాక్స్‌..
అమ్ముడు పోకుండా ఉన్న గృహాలపై (ఇన్వెంటరీ) పన్ను మినహాయింపును రెండేళ్ల వరకూ పొడిగించారు. ఈ ఏడాది ముగిసే నాటికి నిర్మాణం పూర్తయిన గృహాలకు కూడా ఈ మినహాయింపు వర్తింస్తుందని తెలియజేశారు. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ సుమారు 7 లక్షల వరకూ ఉంటుందని పలు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థల సర్వేలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఇన్వెంటరీ ఉన్న డెవలపర్లకు కాస్త ఊరట లభించిందన్నమాట.

2020 వరకూ సెజ్‌ లాభాల కొనసాగింపు.. 
స్టాంప్‌ డ్యూటీ వ్యవస్థలో సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించిందని.. క్లయింట్‌ నివాసం ఆధారంగా స్టాక్‌ ఎక్సే్ఛంజీల ద్వారా స్టాంప్‌ డ్యూటీ సేకరిస్తారని బడ్జెట్‌లో గోయల్‌ తెలిపారు. దేశంలో ప్రస్తుతం స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌లకు (సెజ్‌) అందుతున్న పోత్సాహకాలు, రాయితీల లాభాలను 2020 వరకూ పొడిగిస్తున్నట్లూ ప్రకటించారు. కాగా ఈ చర్యలు దేశంలోని వాణిజ్య రియల్టీ రంగానికి ప్రోత్సాహాన్ని అందిస్తాయని టాటా రియల్టీ ఎండీ అండ్‌ సీఈఓ సంజయ్‌ దత్‌ తెలిపారు. సెజ్‌లల్లోని స్టార్టప్స్, మధ్యస్థాయి కంపెనీలతో కమర్షియల్‌ స్థలాలకు డిమాండ్‌ పెరుగుతుందని.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ సెజ్‌ల ఏర్పాటుకు కంపెనీలు ముందుకొస్తాయని ఆయన పేర్కొన్నారు.  

అన్ని గృహ నిర్మాణ ప్రాజెక్టులకూ.. 
సెక్షన్‌ 80 ఐబీఏ ప్రకారం అందుబాటు గృహాలకు ప్రస్తుతం ఇస్తున్న పన్ను మినహాయింపును మరొక ఏడాది పాటు పొడిగించారు. 2019–20 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అనుమతి పొందిన అన్ని గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లకూ ఇది వర్తిస్తుంది. అందుబాటు ధరల్లోని గృహాలను నిర్మించే డెవలపర్లకు సెక్షన్‌ 80 ఐబీఏ కింద 100 శాతం ఆదాయ పన్ను రాయితీ కూడా ఉంటుంది. అంతేకాకుండా ప్రాజెక్ట్‌ నిర్మాణ కాల పరిమితిని మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పొడిగించారు. అందుబాటు గృహాల కార్పెట్‌ ఏరియా దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్‌ నగరాల్లో 30 చ.మీ., మిగిలిన ప్రాంతాల్లో 60 చ.మీ. పరిమితికి లోబడి ఉండాలి. 

జీఎస్‌టీ తగ్గింపు కోసం మంత్రుల బృందం.. 
ఎన్నికల ముందు, ఆఖరి బడ్జెట్‌లో తప్పనిసరిగా రియల్టీ రంగంపై జీఎస్‌టీ తగ్గింపు ప్రకటన ఉంటుందని ఊహాగానాలు వచ్చాయి. జీఎస్‌టీ తగ్గింపు తోనే గృహ నిర్మాణ రంగంలో డిమాండ్‌ ఉంటుందని ఎదురుచూశారు. కేంద్రం వీటికి ఫుల్‌స్టాప్‌ జీఎస్‌టీ తగ్గింపు సాధ్యాసాధ్యాలపై ప్రత్యేకంగా మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ‘‘రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా), బినామీ ట్రాన్సాక్షన్, ప్రొహిబిషన్‌ చట్టాలు వచ్చాక రియల్టీ లావాదేవీల్లో పారదర్శకత చేకూరింది. గృహాలపై జీఎస్‌టీ భారం తగ్గించాలని మా ప్రభుత్వం కోరుకుంటోంది. జీఎస్‌టీ కౌన్సిల్‌ ఏర్పాటు చేసిన ఈ మంత్రుల బృందం సాధ్యమైనంత త్వరగా జీఎస్‌టీ తగ్గింపు ప్రతిపాదనలను సిద్ధం చేస్తుందని భావిస్తున్నాం. తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం’’ అని గోయల్‌ వివరించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న గృహాలపై 12%, అందుబాటు గృహాల మీద 8% జీఎస్‌టీ ఉంది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ) తీసుకున్న ప్రాజెక్ట్‌ల మీద జీఎస్‌టీ లేదు. 

డిజిన్వెస్ట్‌మెంట్‌తో రూ. 90వేల కోట్లు
వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్‌) ద్వారా రూ. 90,000 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. 2018–19లో ఈ లక్ష్యం రూ. 80,000 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ. 36,000 కోట్లు సమీకరించిన కేంద్రం మరో రెండు నెలల్లో ఇంకో రూ. 44,000 కోట్లు సేకరణపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం దాదాపు 57 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌ఈ) లిస్టయ్యాయి. వీటి మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ సుమారు రూ. 13 లక్షల కోట్లుగా ఉంటుంది. 2017–18లో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ. 1 లక్ష కోట్లు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్నట్లుగా రూ. 80,000 కోట్ల లక్ష్యాన్ని సాధించగలమనేది కేంద్రం అంచనా.

‘స్టాక్స్‌’పై ఒకే స్టాంప్‌ డ్యూటీ 
స్టాక్స్, బాండ్స్‌ వంటి ఆర్థిక సాధనాల లావాదేవీలపై ఇకపై ఒకే స్టాంప్‌ డ్యూటీ రేటును వర్తింపచేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ డ్యూటీని స్టాక్‌ ఎక్సే్చంజీలే వసూలు చేసి, ఖజానాకు జమచేయాల్సి ఉంటుంది.   ఇన్వెస్టర్లు నివసించే రాష్ట్రాలతో కేంద్రం ఈ నిధులను పంచుకుంటుంది. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకమైన స్టాంప్‌ డ్యూటీ ఉంటోంది. ఈ సంక్లిష్టతలను తొలగించే దిశగా ఫైనాన్షియల్‌ సెక్యూరిటీస్‌ లావాదేవీలపై విధించే స్టాంప్‌ డ్యూటీలకు సంబంధించి సంస్కరణలు ప్రవేశపెడతామంటూ కేంద్రం గతేడాది ఇచ్చిన హామీని ప్రస్తుతం నెరవేర్చినట్లయింది.  

2018–19 డిజిన్వెస్ట్‌మెంట్‌ ఆదాయం: 80,000 కోట్లు
2017–18లో రూ. లక్ష కోట్ల మొత్తం పీఎస్‌యూ షేర్ల విక్రయం ద్వారా ఖజానాకు వచ్చింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement