
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం తమ మధ్యంతర బడ్జెట్‌లో క్రీడలకు రూ. 2216.92 కోట్లను కేటాయించింది. గడిచిన ఏడాది కంటే తాజా బడ్జెట్ కేటాయింపుల్లో క్రీడలకు రూ. 214.20 కోట్లు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో క్రీడలకు రూ. 2002.72 కోట్లు వెచ్చించింది. బడ్జెట్ వాటాల్లో భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్)కి అత్యధికంగా నిధుల్ని కేటాయించింది. ఈ విషయాలను శుక్రవారం ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ లోక్‌సభలో వెల్లడించారు.
ఇదీ ‘క్రీడల బడ్జెట్’ స్వరూపం
► ‘సాయ్’కి రూ. 450 కోట్లు. గతంలో (రూ. 396 కోట్లు) కంటే రూ. 54 కోట్లను ఎక్కువగా కేటాయించారు. జాతీయ శిబిరాల నిర్వహణ, క్రీడాసామాగ్రి కొనుగోలు, క్రీడాకారుల ఖర్చులకు వీటిని వెచ్చిస్తారు.
► జాతీయ క్రీడాభివృద్ధి నిధి (ఎన్‌ఎస్‌డీఎఫ్) మొత్తాన్ని రూ. 2 కోట్ల నుంచి గణనీయంగా రూ. 70 కోట్లకు పెంచారు. క్రీడాకారులకు అందించే ఇన్సెంటీవ్స్ కోసం రూ. 89 కోట్లను కేటాయించారు. గతంలో రూ. 63 కోట్లు మంజూరు చేశారు.
►క్రీడాకారుల ప్రోత్సాహకాలు, అవార్డుల్లో భాగంగా ఇచ్చే నగదు బహుమతుల మొత్తాన్ని రూ. 316.93 కోట్ల నుంచి రూ. 411 కోట్లకు పెంచారు. గతంతో పోలిస్తే రూ. 94.07 కోట్లు పెరిగాయి.
► ‘ఖేలో ఇండియా’కు రూ. 601 కోట్లు కేటాయించారు. ఇది గతం (రూ.550.69 కోట్లు) కంటే రూ. 50.31 కోట్లు అదనం. జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్)లకు చేసే చెల్లింపుల్లో స్వల్పంగా కోత విధించారు. గతంలో రూ. 245.13 కోట్లు కేటాయించగా... ఈసారి రూ. 245 కోట్లకు పరిమితం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment