
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు డీమానిటైజేషన్ సహా నల్లధనం కట్టడికి ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలతో బయటకు వెల్లడించని రూ.1.30 లక్షల కోట్ల ధనం పన్ను పరిధిలోకి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నల్లధనాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.‘‘నల్లధన నియంత్రణ చట్టం, పరారీలో ఉన్న నేరస్తుల చట్టం, డీమోనిటైజేషన్ వంటి నిర్ణయాలు రూ.1,30,000 కోట్లను పన్ను పరిధిలోకి తీసుకొచ్చింది. రూ.50,000 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నాం. ఈ కాలంలోనే రూ.6,900 కోట్ల మేర బినామీ ఆస్తులు, రూ.1,600 కోట్ల మేర విదేశీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నాం. 3,38,000 షెల్ కంపెనీలను గుర్తించి రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతోపాటు ఆ కంపెనీల డైరెక్టర్లను డిస్‌క్వాలిఫై చేశాం’’ అని మధ్యంతర బడ్జెట్‌లో భాగంగా మంత్రి చెప్పారు.
ఎన్నికల తర్వాత అధికాదాయ వర్గాల వారికి కూడా పన్ను మినహాయింపు లుంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ సంకేతమిచ్చారు. మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రూ.ఐదు లక్షల ఆదాయం దాటిన వారికి పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేక పోయామని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌లో వీరికి ప్రయోజనం కల్పిస్తామని చెప్పారు. ఇది మధ్యంతర బడ్జెట్ కావడంతో కొన్ని పరిమితులున్నాయని, దీంతో అన్ని నిర్ణయాలు తీసుకోలేకపోయినట్లు వివరణ ఇచ్చారు. కొత్త ఆర్థిక సంవత్సరం రాగానే పన్ను ప్రణాళికల గురించి ఆలోచించే మధ్యతరగతి ప్రజల కోసం ఎన్నికల వరకు ఆగకుండా ఇప్పుడే ప్రకటించినట్లు తెలిపారు. ఇప్పుడు ఆదాయ పన్ను విభాగం పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో పనిచేస్తోందని, గతేడాది 99.54% రిటర్నులు ఆన్‌లైన్ ద్వారానే వచ్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో రిటర్నుల స్క్రూట్నీ కూడా మానవ ప్రమేయం లేకుండా పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే జరిగే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
85శాతం ట్యాక్స్ పేయర్లకు ప్రయోజనం
తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో 85 శాతం మంది పన్నుచెల్లింపుదారులు ప్రయోజనం పొందుతారని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. 2019–20 తాత్కాలిక బడ్జెట్‌లో ప్రతిపాదించిన విధానాలు, రాయితీలతో మధ్య తరగతి కుటుంబాలు, రైతులు, పేదవర్గాలు లబ్ధి పొందుతారని ఓ టీవీ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. ‘ఇది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన బడ్జెట్ కాదు. నాలుగున్నరేళ్లుగా మేం ఈ అంశాలపై నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాం’అని మంత్రి అన్నారు. ప్రధాని చెబుతున్నట్లు ‘అందరితో కలిసి అందరికీ ప్రగతి ఫలాలు’ అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. రైతులు, అసంఘటిత రంగ కార్మికులు, మత్స్య, పశుపోషణ రంగాల్లో పనిచేసే వారందరి కోసం ఈ బడ్జెట్‌ను రూపొందించాం. మధ్య తరగతి కొనుగోలు శక్తి పెరగడానికి, వస్తు, సేవల వినియోగం, అభివృద్ధికి కృషి చేశాం’ అని ఆయన వివరించారు. దేశ చరిత్రలోనే మొదటిసారి మొత్తం 22 వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించామంటూ మంత్రి.. ఇది కాకుండా పేద రైతులకు ఏటా రూ.6 వేల కోట్ల మేర మేలు చేకూరుస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment