ఏపీకి తీరని అన్యాయం | Huge loss to AP in Union Budget 2019 Says Vijayasai Reddy | Sakshi
Sakshi News home page

ఏపీకి తీరని అన్యాయం

Published Sat, Feb 2 2019 5:31 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Huge loss to AP in Union Budget 2019 Says Vijayasai Reddy  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని వైఎస్సార్‌ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్ట ప్రకారం ఏపీకి ఇచ్చిన హామీలపై కేంద్ర ఆర్థికమంత్రి పియూష్‌ గోయల్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ఆర్థిక మంత్రి శుక్రవారం లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరును బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అన్యాయం చేసింది కేవలం ఈ ఒక్క బడ్జెట్‌లో మాత్రమే కాదని, గత నాలుగేళ్లు బీజేపీ మిత్రపక్షంగా టీడీపీ ఆమోదించిన నాలుగు బడ్జెట్లలో  జరిగిన అన్యాయమే పునరావృతమైందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక దేశంలో 2018 నాటికి బ్యాంకులకు రూ.10 లక్షల కోట్ల మొండిబకాయిలు ఉంటే.. 25 శాతం కూడా రికవరీ చేయని దుస్థితి నెలకొందన్నారు. మరోవైపు ఆర్థిక వ్యవస్థలో చెలామణిలోకి రాని నల్లధనం రూ.70 లక్షల కోట్లు ఉంటే.. రూ.1.3 లక్షల కోట్లు పన్నుల రూపంలోకి తీసుకొచ్చామని కేంద్ర మంత్రి అంటున్నారని, అయితే ఇందులో 30 శాతం పన్ను, 30% పెనాల్టీ పోనూ వచ్చింది కేవలం 50% నుంచి 60% ఆదాయం మాత్రమే అన్నారు. మొత్తంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 

ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. పార్టీ పార్లమెంటరీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా అమలు చేయడంతో పాటు విభజన చట్టంలో పొందుపరచిన హామీలను నెరవేర్చాలని నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement