
సాక్షి, హైదరాబాద్ : సాంప్రదాయాలకు విరుద్దంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాకుండా ప్రజాకర్షకంగా బడ్జెట్ ప్రవేశపెట్టారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇది కేవలం ఓట్లకోసం మాత్రమే ప్రవేశపెట్టిన బడ్జెట్‌గా తాము భావిస్తున్నామని తెలిపారు. గాంధీభవన్‌లో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 'ఐదు లక్షల ఆదాయపన్ను పరిమితి పెంపు గొప్పగా చెప్పుకుంటున్నారు. 2014 లోనే రూ.2 లక్షల 50 వేలకు పెంచాము. చిత్తశుద్ది ఉంటే నాలుగేళ్లలో ఏటేటా పెంచాల్సింది. అలా కాకుండా ఇప్పుడు పెంచి అదికూడా 2019-20 నుంచి అమలు అంటున్నారు. నాలుగేళ్లుగా జీఎస్టీ, నోట్లరద్దు, అంతర్జాతీయ ఇంధన ధరల హెచ్చుతగ్గులు ప్రజలకు మేలు చేసేలా జరగలేదు. కొండను తవ్వి ఎలకను పట్టినట్టుంది, తప్ప మరేం లేదు.
మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. బీజేపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది.15 మంది ఎంపీలున్నా ఐదేళ్లుగా విభజన హామీల అమలు జరగకున్నా టీఆర్ఎస్ ఎందుకు పార్లమెంట్‌లో
కొట్లాడటంలేదు. మోదీ పాలనతో దేశ ప్రజలకు ఒరిగింది సున్నా. రైతులు, చిన్న వ్యాపారులకు ఒరిగింది ఏం లేదు' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment