
సాక్షి, హైదరాబాద్: సమాజంలో సమూలంగా మార్పులు తెస్తూ.. అవినీతి రహిత సమాజ నిర్మాణం చెయ్యడమే బీజేపీ లక్ష్యమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కే లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్.. సమాజంలో ఆర్థిక అంతరాలు లేకుండా రూపొందించిన బడ్జెట్ అని అన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు వల్ల పారదర్శకత పెరిగిందన్నారు. పేదల భవిష్యత్ కోసం ప్రజలు తాత్కాలిక కష్టాలను పట్టించుకోలేదని తెలిపారు. జీడీపీలో పెరుగుదల, ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య పెరిగిందన్నారు. జీఎస్టీ కౌన్సిల్‌తో పన్నుల్లో సమూల మార్పులు తెచ్చారని వెల్లడించారు.
వ్యవసాయం లాభసాటి చేసేందుకు, రైతుల ఆదాయం రెట్టింపు చెయ్యడం కోసం.. విద్యుత్ సమస్య లేకుండా, యూరియా సమస్య లేకుండా, ఎరువుల కొరత లేకుండా చేశారని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు వెంటనే ఇవ్వడం, కృషి సించాయ్ యోజన కింద వేల కోట్ల డబ్బులు ఇవ్వటం, పెట్టుబడి సాయం కింద 6000 రూపాయలు డబ్బులు ఇవ్వడం సాహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణించారు. దీని వల్ల తెలంగాణలో దాదాపు 50 లక్షల మంది రైతులు లాభపడ్దారని తెలిపారు. పీఎం శ్రమయోగి ద్వారా 60 ఏళ్లు నిండిన వారికి నెలకు 3000 రూపాయల పెన్షన్ వచ్చే పథకం గొప్ప విషయమన్నారు. దేశ రక్షణ కొరకు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టడం సాహసమన్నారు. పేదల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టిన ఘనత నరేంద్ర మోదీదేనని నొక్కిఒక్కానించారు. టాయిలెట్స్ కట్టడం విప్లవాత్మక నిర్ణయమన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద 50 కోట్ల మంది పేదలకు ఆరోగ్యం చేకూరుతోందన్నారు.
కానీ తెలంగాణ అందులో చేరకపోవడం దురదృష్టకరమని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల బొగ్గు నిక్షేపాలు పెరిగాయని తెలిపారు. కోట్లాది మంది హిందువులకు కామధేను పథకం పెట్టడం మంచి విషయంగా పేర్కొన్నారు. మోదీ బడ్జెట్, ఈబీసీ రిసర్వేషన్‌పై జిల్లాలు, మండలాల వారీగా అభినందన సభ పెడుతామని చెప్పారు. బడ్జెట్‌పై రాష్ట్ర ప్రజల తరపున మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రైతు బంధు పథకానికి, కేంద్ర పథకానికి తేడా ఉందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చెయ్యండని, ఎందుకు ఈబీసీ అమలు చేయటం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment