
సొంత ఇంటి కలను నిజం చేసుకోవచ్చు.స్టార్టప్ కంపెనీలు పెట్టుకోవచ్చు. సినిమాకు హాయిగా వెళ్లొచ్చు...వేతన జీవులు జాలీగా షాపింగ్ చేయొచ్చు..పన్ను పరిమితి లాభంతో సిటీలో సరికొత్త మార్కెటింగ్ ట్రెండ్స్ చోటుచేసుకోనున్నాయి. మాల్స్...స్టాల్స్..మల్టీప్లెక్స్‌లు ఇతర వ్యాపార వాణిజ్య కేంద్రాలు పెరిగే అవకాశం ఉంది. మధ్యతరగతి ప్రజలు సైతం వీకెండ్‌ను ఎంజాయ్ చేయవచ్చు.ఎందుకంటే ఇది పీపుల్స్ ఫ్రెండ్లీ బడ్జెట్. శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకు వరాలు కురిపించింది. ముఖ్యంగా ఆదాయ పన్ను పరిమితి పెంపు నగరంలోని పది లక్షల మంది వేతనజీవులకు భారీఊరట.
సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై నగరంలోని వేతనజీవులు,మధ్యతరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శుక్రవారం ప్రకటించిన ‘బడ్జెట్’ గ్రేటర్‌లోని వేతన జీవులకు భారీ ఊరటనిచ్చింది.
ఆదాయ పన్ను పరిమితి రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచడంతో గ్రేటర్ నగరంలోని సుమారు 10 లక్షల మంది వేతనజీవులకులబ్ధి చేకూరనుంది. అలాగే నగరంలోని మధ్యతరగతి, వేతన జీవులకుగృహరుణాల చెల్లింపుల్లో రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. ‘ప్రధానమంత్రి శ్రమ్ యోజన’ కింద 60 ఏళ్లు దాటిన కార్మికులకు నెలకు రూ.3,000 పింఛను చెల్లిస్తారు. ఈ పథకం కింద గ్రేటర్ పరిధిలో సుమారు15 లక్షల మంది కార్మికుల భద్రతకు భరోసా చేకూరనుంది. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి గతేడాది కంటే స్వల్పంగా కేటాయింపులు తగ్గడంతో పెద్దగా ప్రభావమేమీ ఉండదనిభావిస్తున్నారు. నగరంలో ఇప్పటికే 92 ప్రాంతాల్లో నిర్మించనున్న లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షల చొప్పునమంజూరయ్యాయి. 2022 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యంలో భాగంగా, లక్ష ఇళ్ల నిర్మాణ పురోగతిని బట్టి నిధులందుతాయి.
♦ సినిమా థియేటర్లపై జీఎస్‌టీ భారాన్ని కాస్త తగ్గించారు. సింగిల్ థియేటర్లపై గతంలో ఉన్న 18 శాతం జీఎస్‌టీని 12 శాతానికి, మల్టీప్లెక్స్‌లో 28 శాతం నుంచి 18 శాతానికి జీఎస్‌టీ తగ్గించారు. దీంతో సింగిల్ థియేటర్లలో గతంలో రూ.118 ఉన్న టిక్కెట్ ధర రూ.112కు తగ్గనుంది. నగరంలోని సుమారు 1100 సింగిల్ థియేటర్లకు ఇది ఊరట కలిగించే అంశమే. మల్టిప్లెక్స్‌ల్లోనూ ధర తగ్గే అవకాశం ఉంది.
♦ కేంద్ర బడ్జెట్‌లో ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, బీబీనగర్‌లోని ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ప్రస్తావనే లేదు.‘ఆయుష్మాన్ భవ’ సహా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని కీలక ఆస్పత్రులకు కనీస నిధులు కేటాయించలేదు. హెచ్‌సీయూ సహా ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, రాష్ట్రస్థాయిలోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఈ బడ్జెట్ నిరాశే మిగిల్చింది.
♦ రైళ్లకు సంబంధించి కొత్త రైళ్లు గానీ, లైన్లు గానీ లేవు. పాతప్రాజెక్టులకు మాత్రం నామమాత్రం నిధులిచ్చారు. ఎంఎంటీఎస్–2కు రూ.10 లక్షలు, యాదాద్రి ఎంఎంటీఎస్‌కు రూ.20 కోట్లు, చర్లపల్లి టర్మినల్‌కు రూ.5 కోట్ల బడ్జెట్ కేటాయించారు. దీంతో రాష్ట్రం వాటా ఇస్తే తప్ప రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు.
♦ ఇక కిసాన్ సమ్మాన్ పథకం కింద గ్రేటర్ పరిధిలోని మేడ్చల్ జిల్లాలో 24,591 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
♦ ఉజ్వల పథకానికి కేంద్రం మరింత ఊతం ఇచ్చినా...ఈ పథకం పట్ల గ్రేటర్‌లో లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ పథకం కింద ఎల్పీజీ కనెక్షన్ పొందడానికి సవాలక్ష నిబంధనలు అడ్డుపడుతున్నాయి.
♦ మొత్తంగా కేంద్రబడ్జెట్ ఈసారి నగరంలోని ఎక్కువ మంది జనాభాకు ఊరటనిచ్చినట్లేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు విపక్షాలు మాత్రం బడ్జెట్‌ను విమర్శిస్తున్నాయి. ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన ప్రజాకర్షక బడ్జెట్ అంటూ విమర్శించగా...బీజేపీ నేతలు మాత్రం హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment