
సాక్షి,సిటీబ్యూరో: దక్షిణమధ్య రైల్వేలో గతంలో చేపట్టిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం మినహా తాజా బడ్జెట్‌లో ఎలాంటి కొత్త ప్రతిపాదనలు చేయలేదు. ఐదేళ్ల నుంచి నత్తనడక సాగుతున్న ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్‌లో కేవలం రూ.10 లక్షలే కేటాయించారు. అలాగే రెండేళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన యాదాద్రి ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టుకు రూ.20 కోట్ల నిధులను కేటాయించారు. రెండేళ్ల క్రితం ప్రతిపాదించిన చర్లపల్లి రైల్వే టర్మినల్‌కు మరో రూ.5 కోట్లు ఇచ్చారు. మౌలాలిలో నిర్మించనున్న రైల్వే ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌కు మరో రూ.1.5 కోట్ల నిధులను కేటాయించారు. ఎంఎంటీఎస్ రెండో దశ మినహా ఎలాంటి పురోగతి లేని మిగతా మూడు ప్రాజెక్టులకు ప్రస్తుత నిధులు సైతం అరకొరే. గతంలో ప్రకటించిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రీ డెవలప్‌మెంట్ ప్రతిపాదన, లాలాగూడ కేంద్రీయ ఆస్పత్రి సూపర్ స్పెషాలిటీ హోదా, నర్సింగ్ కళాశాల నిర్మాణం, వట్టినాగులపల్లి టర్మినల్ వంటి ప్రతిపాదనలు మరోసారి పెండింగ్ జాబితాలోకి చేరిపోయాయి. జంటనగరాల నుంచి షిరిడీ, బెంగళూరు, శబరిమలై, పట్నా, తదితర ప్రాంతాలకు కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని ఎంతోకాలంగా డిమాండ్ ఉన్నప్పటికీ ఆచరణకు నోచుకోలేదు.
పట్టాలెక్కించేందుకు పాట్లు
నగర శివార్లను అనుసంధానం చేసే ఎంఎంటీఎస్ రెండో దశ రైళ్లను పట్టాలెక్కించేందుకు దక్షిణమధ్య రైల్వే పాట్లు పడుతోంది. రూ.817 కోట్లతో, 2012–13 లో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. అన్ని మార్గాల్లో లైన్‌ల నిర్మాణం తుది దశకు వచ్చింది. కానీ నిధుల కొరత కారణంగా కొత్త రైళ్లను కొనుగోలు చేసేందుకు అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఈ ప్రాజెక్టుకు రూ.10 లక్షలు కేటాయించింది.
యాదాద్రి ..సర్వేలకే పరిమితం
ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా నిర్మిస్తున్న సికింద్రాబాద్–ఘట్కేసర్ మార్గానికి పొడిగింపుగా ఘట్కేసర్–రాయిగిరి మధ్య 33 కి.మీ రైల్వేలైన్ నిర్మించేందుకు 2016–17లోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అప్పట్లో ఈ ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించింది. రూ.412 కోట్ల అంచనాలతో దీనికి ప్రణాళిక రూపొందించారు. ఆర్‌వీఎన్‌ఎల్‌సర్వే కూడా పూర్తి చేసింది. నిర్మాణ వ్యయంలో 51 శాతం రాష్ట్రం వాటాగా, 49 శాతం రైల్వే వాటాగా ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం భూమి, ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాల్సి ఉంది. దీనికి తాజాగా కేంద్రం రూ.20 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టుకూ టెండర్లు ఖరారు కాలేదు.
నిమ్స్, ఎయిమ్స్‌కు మొండిచేయి
కేంద్ర బడ్జెట్‌లో ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, బీబీనగర్‌లోని ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ‘ఆయుస్మాన్ భవ’ సహా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని కీలక ఆస్పత్రులకు కనీస నిధులు కేటాయించలేదు. సాధారణ నిధులను మినహాయిస్తే.. ఆస్పత్రులకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంజగుట్ట నిమ్స్‌లో ట్రామాకేర్, సూపర్ స్పెషాలిటీ బ్లాకుల నిర్మాణం, ఆధునీకీకరణ పూర్తిగా కేంద్ర బడ్జెట్‌తోనే జరిగింది. ఇటీవల నిమ్స్ ఆదాయం భారీగా తగ్గిపోయింది. ప్రతినెలా ఉద్యోగుల వేతనాలు, ఫించన్ల చెల్లింపు కోసం రూ.12 కోట్ల వరకు అవసరం అవుతుండగా, ఆ మేరకు ఆదాయం రాకపోవడంతో వేతనాల చెల్లింపునకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఆదుకుంటుందని భావించినా ఫలితం దక్కలేదు. బీబీనగర్‌లో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న ఆల్ ఇండియా మెడికల్ సైన్స్(ఎయిమ్స్)కు ఇటీవల రూ.1028 కోట్లు కేటాయించడం మినహా తాజా బడ్జెట్‌లో అదనపు కేటాయింపులు చేయలేదు. హెచ్‌సీయూ సహా ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీతో పాటు రాష్ట్రస్థాయిలోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఈ బడ్జెట్ నిరాశేమిగిల్చింది.
Comments
Please login to add a commentAdd a comment