
సాక్షి,సిటీబ్యూరో :సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతిపై వరాలు జల్లు కురిపించింది. శుక్రవారం ప్రకటించిన ‘బడ్జెట్’గ్రేటర్‌లోని వేతన జీవులకు భారీ ఊరటనిచ్చింది. గత బడ్జెట్లలో మధ్య తరగతికి, ఉద్యోగులకు అనుకున్న స్థాయిలో లబ్ధి చేకూరలేదన్న నిస్పృహతో ఉన్నఉద్యోగులకు ఈసారి కేంద్ర ఆర్థికశాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ వరాలు ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆదాయపు పన్నుకలలను మోదీ ప్రభుత్వం సాకారం చేసింది. దీనిపై గ్రేటర్‌లోని సుమారు10 లక్షల మంది వేతనజీవులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వేతనజీవులకు ఉపశమనం ఇలా..
ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో మహానగరం పరిధిలో సుమారు 10 లక్షల మంది ఉద్యోగులకు ఉపశమనం కలగనుంది. దీనికి అదనంగా రూ.6.5 లక్షల ఆదాయం ఉండి బాండ్లు, పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా పూర్తి పన్ను మినహాయింపునివ్వడం విశేషం. ఆదాయపు పన్ను స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.40 వేల నుంచి రూ.50 వేలకు పెంచడం మరో ఊరటనిచ్చే అంశం. దీంతోపాటు పోస్టల్, బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీపైనా రూ.40 వేల వరకు రాయితీని ఇచ్చింది. అంతేకాదు, రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని గ్రాట్యుటీగా అందుకొనే వారికి కూడా ఉపశమనం కల్పించారు. రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీపై పన్ను మినహాయించడంపై పదవీవిరమణ పొందిన ఉద్యోగులు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
సొంతింటికల సాకారం
ఆదాయ పన్ను చట్టం సెక్షన్–54 కింద, ఒక ఇంటికి సంబంధించి వర్తించే మూలధన పన్ను మినహాయింపును ఇప్పుడు రెండు ఇళ్లకు పెంచారు. ఈ క్రమంలో ఆ మొత్తం రూ.2 కోట్లకు మించకూడదు. అయితే, ఒక వ్యక్తికి ఈ మినహాయింపు జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది. ఈ పరిణామంతో మహానగరంలో సొంతిళ్లు కొనుగోలు చేయాలనుకుంటున్న ఉద్యోగులకు ఇంటి కలలను సాకారం చేసుకునే అవకాశం లభినట్టయింది. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖకు గత సంవత్సరం కంటే దాదాపు 12 శాతం బడ్జెట్ పెరగడంతో నగరంపైనా దీని ప్రభావం ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి గతేడాది కంటే స్వల్పంగా కేటాయింపులు తగ్గడంతో పెద్దగా ప్రభావమేమీ ఉండదని భావిస్తున్నారు. నగరంలో ఇప్పటికే 92 ప్రాంతాల్లో నిర్మించనున్న లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షల చొప్పున మంజూరయ్యాయి. 2022 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యంలో భాగంగా, లక్ష ఇళ్ల నిర్మాణ పురోగతిని బట్టి నిధులందుతాయి. గ్రేటర్‌లో ప్రస్తుతం మంజూరైన లక్ష ఇళ్లు కాక అదనంగా మరో 20 వేల ఇళ్లు నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకు స్థలాలు ఎంపిక చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. సేకరణ పూర్తయితే వాటికీ నిధులందే అవకాశం ఉంది.
ఇళ్ల కొనుగోలుదారుల్లో ఆశలు..
నగరంలో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోవడంతో చాలామంది ఇళ్ల కొనుగోళ్ల కోసం చూస్తున్నారు. దీంతోపాటు రెండో ఇంటి రుణానికీ ఐటీ బెనిఫిట్ ఇవ్వడంతో నగరంలో ఇళ్ల నిర్మాణం పెరగ్గలదని యోచిస్తున్నారు. ఇంటి అద్దె ద్వారా వచ్చే ఆదాయంపైనా పన్ను విధింపును 1.8 లక్షల నుంచి 2.4 లక్షలకు పెంచడంతో నగరంలో ఇళ్లు అద్దెలకిచ్చిన సొంత భవనాల యజమానులకు సైతం ఉపశమనం కలిగించింది.
రెండుఅద్దెలకుమినహాయింపు
పిల్లల చదువు రీత్యా కుటుంబం ఒక చోట.. తాను మరో చోట ఉండే ఉద్యోగులకు కూడా బడ్జెట్ ఊరటనిచ్చింది. అటువంటి వారు రెండు చోట్ల ఇళ్లపై చెల్లించే అద్దెలకు మినహాయింపునకు క్లెయిమ్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఉద్యోగులు ‘చెల్లించిన అద్దెకు’ పన్ను మినహాయింపును రూ.2.4 లక్షలకు పెంచడం విశేషం. ఇక నగరంలోని మధ్యతరగతి, వేతన జీవులు గృహరుణాల చెల్లింపుల్లో రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపును ఇచ్చారు.
24 గంటల్లో రీఫండ్లు..
ఆదాయపు పన్ను రీఫండ్లు వేగవంతం కానున్నాయి. వీటిని 24 గంటల్లో పరిష్కరించి నిధులను విడుదల చేయనున్నారు. వచ్చే రెండేళ్లలో అన్ని పన్ను రిటర్నుల అంచనాలను కంప్యూటరీ కరిస్తామన్నారు. పన్ను చెల్లింపుదారులకు, అధికారులకు సంబంధం లేకుండా చేస్తామన్నారు. ఇది వాస్తవ రూపంలోకి వస్తే అవినీతి మరింత తగ్గే అవకాశం ఉంది.
కార్మికులభద్రతకు భరోసా..
‘ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో కార్మికులకు మేలు చేకూరే పలు ప్రయోజనాలను ఆమోదించారు. ముఖ్యంగా ప్రధానమంత్రి శ్రమ్ యోజన’ కింద 60 ఏళ్లు దాటిన కార్మికులకు నెలకు రూ.3,000 పింఛను చెల్లిస్తారు. దీనికోసం సంఘటిత రంగ కార్మికులు నెలకు రూ.100 ప్రీమియంగా చెల్లించాలి. ఈ పథకం కింద గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు
15 లక్షల మంది కార్మికుల భద్రతకు భరోసా లభించనుంది.
సినిమా ఓకే..తినుబండారాలే..!
కేంద్ర బడ్జెట్ ‘వినోదానికి’ భరోసానిచ్చింది. సినిమా థియేటర్లపై జీఎస్‌టీ భారాన్ని కాస్త తగ్గించారు. సింగిల్ థియేటర్లపై గతంలో ఉన్న 18 శాతం జీఎస్‌టీని 12 శాతానికి, మల్టీప్లెక్స్‌లో 28 శాతం నుంచి 18 శాతానికి జీఎస్‌టీ తగ్గించారు. దీంతో సింగిల్ థియేటర్లలో గతంలో రూ.118 ఉన్న టిక్కెట్ ధర రూ.112కు తగ్గనుంది. నగరంలోని సుమారు 1100 సింగిల్ థియేటర్లకు ఇది ఊరట కలిగించే అంశమే. మల్టిప్లెక్స్‌ల్లో రూ.150 నుంచి రూ.250 వరకు ఉంది. ఈ ఏడాది ఆరంభం నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. ఆ మార్పులనే తాజా బడ్జెట్‌లో పొందపర్చారని పలు సినిమా థియేటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. మల్టిప్లెక్స్‌ల్లో జీఎస్‌టీ తగ్గినప్పటికీ, తినుబండారాలు, వాటర్‌బాటిళ్లు, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై స్పష్టత లేకపోవడంతో ప్రేక్షకులపై పెద్దగా భారం తగ్గలేదు.
‘ఉజ్వల’కు ఆదరణఅంతంతే..
సాక్షి.సిటీబ్యూరో: విశ్వనగరం వైపు పరుగులు తీస్తున్న హైదరాబాద్ మహా నగరంలో ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ పథకానికి ఆదరణ కరవైంది. తాజగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మరిన్నీ ఎల్పీజీ కనెక్షన్లను మంజూరు చేసింది. ఇప్పటికే నగరంలో ఐదు లక్షలకు పైగా కుటుంబాలు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లకు దూరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా హైదరాబాద్ నగరాన్ని ‘కిరోసిన్ ఫ్రీ’ నగరంగా తీర్చిదిద్దేందకు కసరత్తు చేస్తున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. మరోవైపు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఎల్పీజీ కనెక్షన్ల పింపిణీకి సవాలక్ష కొర్రీలు అడ్డుపడుతున్నాయి. మహానగరంలో 32 లక్షల వరకు కుటుంబాలు ఉండగా, వంట గ్యాస్ కనెక్షన్లు 26.21 లక్షల వరకు ఉన్నట్టు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం గుర్తించిన ఆహార భద్రత బీపీఎల్ కుటుంబాల్లోనే సుమారు 2.50 లక్షలకు పైగా కుటుంబాలు గ్యాస్ కనెక్షన్లకు దూరంగా ఉన్నాయి.
‘జై కిసాన్’ సమ్మాన్
సాక్షి,మేడ్చల్ జిల్లా: కేంద్ర బడ్జెట్‌తో మేడ్చల్ జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఐదెకరాలు లోపున్న రైతులకు ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్’ పథకం కింద ఎకరానికి ఏడాదికి రూ.6 వేలు అందజేసేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 47 వేల మంది రైతులు ఉండగా, ఐదెకరాలు లోపున్న వారు 24,591 మంది ఉన్నారు. వీరందరికీ కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా మేలు చేకూరనుంది. ఇక ‘శ్రమ్ యోజన పథకం’ కింద జిల్లాలోని 6 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులకు లబ్ధి చేకూరనుంది.
విపక్షాల పెదవి విరుపు..బీజేపీ ఆనందం
రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పీయూష్ గోయల్‌తో ప్రజలను ఆకట్టుకునే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టించిందని, అయితే ఆ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు జరపలేదని విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ఎన్నికల ముందు మరోసారి ప్రజలను మోసగించేలా బడ్జెట్ రూపకల్పన చేశారని విమర్శిస్తున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఓరటబెట్టింది ఏమీ లేకపోగా, సార్వత్రిక ఎన్నికల ముందు అంకెల గారడీతో పేద ప్రజలను మోసగించాలని చూడడం దారుణమని మేడ్చల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత తోటకూరి జంగయ్య యాదవ్, సీపీఎం జిల్లా కార్యదర్శి సత్యం, సీపీఐ నేత బాలమల్లేశం పేర్కొన్నారు. కాగా, కేంద్ర బడ్జెట్ రైతులకు, పేద ప్రజలు, కార్మికులు, ఉద్యోగులకు ఎంతో మేలు చేసే విధంగా ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షడు మాధవరం కాంతారావు, తిరుమల్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
చాలా అంశాలను వదిలేశారు..
బడ్జెట్‌లో ఉద్యోగ, మధ్యతరగతివర్గాలకు ఊరటనిచ్చారు. రైతుకు పెట్టుబడి సహాయం మంచి పరిణామం. కానీ ఇంకా అనేక అంశాలపై దృష్టి పెట్టలేదు. సంఘటిత రంగ పెన్షనర్ల డిమాండ్లు పట్టించుకోలేదు. యువత, ఇతర వర్గాల అభ్యున్నతికి, స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీలకు ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. స్వామినాథన్ సిఫార్సులను విస్మరించారు. – టి.రామస్వామి యాదవ్,బీహెచ్‌ఈఎల్ రిటైర్డ్ ఉద్యోగి
Comments
Please login to add a commentAdd a comment