
న్యూఢిల్లీ: పీఎం–కిసాన్ పథకం కింద తొలి విడతలో రూ.2 వేలు పొందే చిన్న, సన్నకారు రైతులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఈ పథకానికి ఇప్పటికే రూ.20 వేల కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా మొత్తం 12 కోట్ల మంది రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని అంచనా. ఈశాన్య రాష్ట్రాల్లో మినహా ఈ రైతు ప్యాకేజీ అమలులో పెద్దగా ఇబ్బందులేమీ రావని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. సాగుకు పెట్టుబడి సాయంపై వ్యవసాయ శాఖ చాలా రోజులుగా కసరత్తు చేస్తోందని, అదే ఉత్సాహంతో ఈ పథకాన్ని అమలుచేస్తామని తెలిపారు. రూపకల్పన కన్నా అమలుపరచడమే ఇందులో ప్రధానమని, చిన్న, సన్నకారు రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధను తాజా బడ్జెట్ ప్రతిబింబిస్తోందని అన్నారు.
లబ్ధిదారుల్ని గుర్తించే ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులు, వ్యవసాయ కార్యదర్శులకు ఈ నెల 1న లేఖలు పంపారని వెల్లడించారు. లబ్ధిదారుల పేరు, కులం తదితర వివరాల్ని సేకరించి స్థానిక గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులో ఉంచాలని లేఖలో సూచించారు. చాలా రాష్ట్రాల్లో భూ దస్త్రాల డిజిటలీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఫిబ్రవరి ఒకటి నాటికి భూ రికార్డుల్లో పేర్లు నమోదైన యజమానులే పీఎం–కిసాన్ పథకానికి అర్హులని రాజీవ్ కుమార్ తెలిపారు. ఏడాదికి రూ.6 వేలు అంటే చిన్న మొత్తమేమీ కాదని, ఆ డబ్బుతో పేద రైతులు ఎన్నో ఖర్చులు వెళ్లదీసుకోవచ్చని అన్నారు.
చిక్కులు తప్పవు: నిపుణులు
పథకం అమలులో న్యాయపర చిక్కులు తప్పవని వ్యవసాయ నిపుణుల విశ్లేషణ. యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ పథకానికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయని సీనియర్ న్యాయవాది ఎన్‌కే పొద్దార్ పేర్కొన్నారు. ఒకే సాగు భూమికి ఒకరి కన్నా ఎక్కువ మంది యజమానులు ఉండి, వారందరికీ రూ.6 వేల చొప్పున సాయం అందితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ పథకం కింద వెచ్చించే కోట్లాది రూపాయలు అనుత్పాదక వినియోగంలోకి వెళ్తాయని ఆర్థిక నిపుణుడు శశికాంత్ సిన్హా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment