Center Guidelines
-
మార్గదర్శకాలొచ్చిన వెంటనే సన్నాహాలు
సాక్షి, అమరావతి: ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రికాషన్ డోసు, 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి టీకా అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందిన వెంటనే టీకా పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేయనుంది. 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి జనవరి 3వ తేదీ నుంచి టీకా పంపిణీ మొదలు పెట్టనున్నట్టు శనివారం ప్రధాని మోదీ ప్రకటించారు. అదే విధంగా వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు జనవరి 10వ తేదీ నుంచి ప్రికాషన్ డోసు అందించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. అయితే ప్రికాషన్ డోసు, 15–18 ఏళ్లలోపు వారికి టీకా పంపిణీ మార్గదర్శకాల కోసం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఎదురు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇదీ పరిస్థితి ► రాష్ట్రంలో హెల్త్‌కేర్ వర్కర్లు 4,91,318 మంది, ఇతర శాఖలకు చెందిన ఫ్రంట్‌లైన్ వర్కర్లు 15,53,283 మందికి ప్రభుత్వం రెండు డోసుల టీకా పంపిణీ చేసింది. ► 60 ఏళ్లు పైబడిన వృద్ధులు 50 లక్షల మందికి పైగా ఉన్నారు. 15 నుంచి 18 ఏళ్ల లోపు వారు 50 లక్షలకు పైగా ఉండొచ్చని అంచనా. మార్గదర్శకాలు రావడమే ఆలస్యం కేంద్రం నుంచి మార్గదర్శకాలు ఇంకా రాలేదు. మంగళవారం రావొచ్చని అనుకుంటున్నాం. మార్గదర్శకాలు అందిన వెంటనే సన్నాహాలు మొదలు పెడతాం. టీకా లభ్యతలో ఇబ్బందులు లేవు. కాబట్టి పంపిణీ వేగంగా చేపడతాం. – కాటమనేని భాస్కర్, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ -
‘పీఎం–కిసాన్’ లబ్ధిదారుల్ని గుర్తించండి
న్యూఢిల్లీ: పీఎం–కిసాన్ పథకం కింద తొలి విడతలో రూ.2 వేలు పొందే చిన్న, సన్నకారు రైతులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. బడ్జెట్లో ప్రతిపాదించిన ఈ పథకానికి ఇప్పటికే రూ.20 వేల కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా మొత్తం 12 కోట్ల మంది రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని అంచనా. ఈశాన్య రాష్ట్రాల్లో మినహా ఈ రైతు ప్యాకేజీ అమలులో పెద్దగా ఇబ్బందులేమీ రావని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. సాగుకు పెట్టుబడి సాయంపై వ్యవసాయ శాఖ చాలా రోజులుగా కసరత్తు చేస్తోందని, అదే ఉత్సాహంతో ఈ పథకాన్ని అమలుచేస్తామని తెలిపారు. రూపకల్పన కన్నా అమలుపరచడమే ఇందులో ప్రధానమని, చిన్న, సన్నకారు రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధను తాజా బడ్జెట్ ప్రతిబింబిస్తోందని అన్నారు. లబ్ధిదారుల్ని గుర్తించే ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులు, వ్యవసాయ కార్యదర్శులకు ఈ నెల 1న లేఖలు పంపారని వెల్లడించారు. లబ్ధిదారుల పేరు, కులం తదితర వివరాల్ని సేకరించి స్థానిక గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులో ఉంచాలని లేఖలో సూచించారు. చాలా రాష్ట్రాల్లో భూ దస్త్రాల డిజిటలీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఫిబ్రవరి ఒకటి నాటికి భూ రికార్డుల్లో పేర్లు నమోదైన యజమానులే పీఎం–కిసాన్ పథకానికి అర్హులని రాజీవ్ కుమార్ తెలిపారు. ఏడాదికి రూ.6 వేలు అంటే చిన్న మొత్తమేమీ కాదని, ఆ డబ్బుతో పేద రైతులు ఎన్నో ఖర్చులు వెళ్లదీసుకోవచ్చని అన్నారు. చిక్కులు తప్పవు: నిపుణులు పథకం అమలులో న్యాయపర చిక్కులు తప్పవని వ్యవసాయ నిపుణుల విశ్లేషణ. యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ పథకానికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయని సీనియర్ న్యాయవాది ఎన్కే పొద్దార్ పేర్కొన్నారు. ఒకే సాగు భూమికి ఒకరి కన్నా ఎక్కువ మంది యజమానులు ఉండి, వారందరికీ రూ.6 వేల చొప్పున సాయం అందితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ పథకం కింద వెచ్చించే కోట్లాది రూపాయలు అనుత్పాదక వినియోగంలోకి వెళ్తాయని ఆర్థిక నిపుణుడు శశికాంత్ సిన్హా అన్నారు.