జై కిసాన్‌..  | Union Budget 2019 Full Happy Farmers | Sakshi
Sakshi News home page

జై కిసాన్‌.. 

Published Sat, Feb 2 2019 9:08 AM | Last Updated on Sat, Feb 2 2019 9:12 AM

Union Budget 2019  Full Happy Farmers - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: పార్లమెంట్‌ ఎన్నికల వేళా కేంద్రం రైతన్నకు జై కొట్టింది. బడ్జెట్‌లో అన్నదాతకు పెట్టపీట వేసింది. రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.8వేలు పొందుతున్న కర్షకులకు కేంద్రం సైతం పెట్టుబడి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6వేలు ఇస్తామని బడ్జెట్‌లో ప్రకటించింది. తాత్కాలిక ఆర్థికశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ శుక్రవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. రైతులు, మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులు, మహిళలు, తదితర వర్గాలను ఆకర్షించే పథకాలు ప్రకటించారు. అయితే బడ్జెట్‌లో ముఖ్యంగా ఉద్యోగుల ఆదాయ పరిమితి పన్ను పెంపు, 60 ఏళ్లు నిండిన వారికి పెన్షన్, ఐదెకరాల్లోపు ఉన్న రైతులకు నేరుగా బ్యాంక్‌ ఖాతాల్లో ఏడాదికి రూ.6వేలు జమ చేయడం, గ్రాట్యుటీ పరిమితి రూ.20లక్షల నుంచి రూ.30లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో జిల్లా వాసులకు లబ్ధి చేకూరనుంది. 

జిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు దాదాపు 10వేల మంది వరకు ఉన్నారు. ఇది వరకు ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితి రూ.2లక్షల 50వేలు ఉండగా, ఈ బడ్జెట్‌లో వార్షిక ఆదాయ రూ.5లక్షల వరకు ఉన్నవారు ఇకపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.6.5లక్షల వరకు ఉన్న వారికి బీమా, పెన్షన్‌ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాయితీ స్టాండర్డ్‌ పరిమితి రూ.40వేల నుంచి రూ.50వేల పరిమితికి పెంచారు. పోస్టల్, బ్యాంక్‌ డిపాజిట్లపై టీడీఎస్‌ పరిమితి పెంచారు. రూ.10వేల నుంచి రూ.40వేల వరకు టీడీఎస్‌ పెంపు జరిగింది.

60 ఏళ్లు నిండిన వారికి రూ.3వేల పెన్షన్‌.. 
జిల్లాలో 60 ఏళ్లు నిండిన వృద్ధులు 63వేల మంది ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు రూ.వెయ్యి పింఛన్‌ అందిస్తుంది. అయితే ఎన్నికల మెనిఫెస్టోలో హామీలో నెలకు రూ.2వేలు ఇస్తామని ప్రకటించిన విషయం విధితమే. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమయోగి బంధన్‌ పేరుతో అసంఘటిత కార్మికులకు పింఛన్, 60 ఏళ్లు నిండిన వారందరికీ ప్రతీనెల రూ.3వేలు ఇచ్చే విధంగా ఈ పథకం ప్రవేశపెడుతోంది. నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత రూ.3వేల పింఛన్‌ ఇవ్వనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్న దాదాపు 50వేల మంది కార్మికులకు ఈ పథకం దోహద పడనుంది.
 
రైతు ఖాతాలోకి ఏడాదికి రూ.6వేలు.. 
పేద రైతు ఆదాయ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరానికి రెండు విడతల్లో కలిపి మొత్తం రూ.8వేలు చెల్లిస్తుండగా, ఎన్నికల మెనిఫెస్టోలో పొందుపర్చిన విధంగా ఇకపై రెండు విడతలకు కలిపి మొత్తం రూ.10వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే బడ్జెట్‌లో తాత్కాలిక ఆర్థిక శాఖ పీయూష్‌ గోయల్‌ రైతుల కోసం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ఏడాదికి మూడు విడతల్లో రూ.6వేలు బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే రెండు హెక్టార్లలోపు (5ఎకరాలు) వ్యవసాయ భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది. దీనిద్వారా జిల్లాలో దాదాపు 50వేల మంది అన్నదాతలకు ప్రయోజనం చేకూరనుంది.

అంగన్‌వాడీల జీతాల పెంపు  
అంగన్‌వాడీ కార్యకర్తలపై కేంద్రం కరుణించింది. వీరి జీతాలను 50 శాతం పెంచుతున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ వేతనాల కింద రూ.3వేలు ఇస్తుండగా..రాష్ట్రం మరో రూ.7,500 కలిపి రూ.10,500 ఇస్తోంది. జీతాల పెంపుతో వారికి లబ్ధి చేకూరనుంది. జిల్లాలో మొత్తం 2,248 మంది అంగన్‌వాడీలు ఉన్నారు. ఇందులో అంగన్‌వాడీ కార్యకర్తలు 992 మంది, ఆయాలు 992, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు 264 మంది ఉన్నారు. 50 శాతం జీతాల పెంపు ప్రకటనతో వీరికి అదనంగా మరో రూ.1500 జీతం పెరగనుంది.

అన్ని వర్గాలను ఆకర్షించేలా.. 
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ అన్నివర్గాలను ఆకర్షించేలా ఉందని పలువురు పేర్కొంటున్నారు. అసంఘటిత కార్మికులకు శ్రమయోగి బంధన్‌ పేరుతో పెన్షన్, కార్మికుల ప్రమాద బీమా రూ.1లక్ష 50వేల నుంచి రూ.6లక్షలకు పెంపు, ఇంటి కొనుగోలుదారులకు జీఎస్టీ ఆదాయం మినహాయింపు, సినిమా థియేటర్‌ ధరలపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు, వంట గ్యాస్‌ కనెక్షన్లు లేనివారికి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు, అంగన్‌వాడీ కార్యకర్తల వేతనం 50శాతం పెంపు, ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతుల రుణాలను రీషెడ్యూల్‌ చేయడం, ఆవుల సంరక్షణకు ప్రత్యేక పథకం, కిసాన్‌ క్రెడిట్‌ కార్డు కింద రుణాలు ఇవ్వడం, ఆయుష్మాన్‌ భారత్, తదితర పథకాలను ప్రవేశపెట్టారు.
 

రైతులకు ప్రయోజనం  
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయంలో రైతులకు మేలు జరుగుతుంది. 5 ఎకరాలు ఉన్న రైతులకు సంవత్సరానికి రూ.6వేలు ఇస్తుందని ప్రకటించడం సంతోషమే. అయితే ఏడాది పాటు కష్టపడి రైతులు పండించిన పంటలకు మద్దతు ధర పెంచాలి. రైతులను అన్ని విధాలా ఆదుకోవాలి. ఎరువులు, విత్తనాలు ఉచితంగా పంపిణీ చేస్తే బాగుంటుంది. – గంధం నవీన్, రైతు, వడూర్‌

ఉద్యోగులకు ఊరట.. 

ఉద్యోగ, ఉపాధ్యాయులు నిజాయతీగా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఆదాయ పన్ను పరిమితి రూ.2లక్షల 50వేలకు ఉండగా, కేంద్ర ప్రభుత్వం రూ.5లక్షల వరకు పెంచడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే దీని పరిమితిని మరింతగా పెంచితే బాగుండేది. సీనియర్‌ ఉద్యోగులు 3 నెలల జీతం ఐటీకే సరిపోతుంది. కొంతమేరకైతే బడ్జెట్‌ నిర్ణయం ఊరటనిచ్చింది. – శ్రీహరిబాబు, ఉపాధ్యాయుడు, ఆదిలాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement