రక్షణకు మేం రెడీ | Budget allocation for defence increased to above Rs 3 lakh crores | Sakshi
Sakshi News home page

రక్షణకు మేం రెడీ

Published Sat, Feb 2 2019 3:03 AM | Last Updated on Sat, Feb 2 2019 11:59 AM

Budget allocation for defence increased to above Rs 3 lakh crores  - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి 2019–20 బడ్జెట్‌లో రూ. 3,18,931 కోట్లు కేటాయించారు. గత ఏడాది రక్షణ శాఖ బడ్జెట్‌తో కేటాయింపు రూ. 2,95,511 కోట్లతో పోలిస్తే ఇది 6.87 శాతం ఎక్కువగా తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్‌ గోయల్‌ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయుధాలు, యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, ఇతర పరికరాలు కొనడానికి బడ్జెట్‌ కేటాయింపులో రూ. 1,08,248 కోట్లను మూలధనంగా పేర్కొన్నారు. మూలధనం ఆర్మీకి రూ. 29,447 కోట్లు, నేవీకి రూ. 23,156 కోట్లు, ఎయిర్‌ఫోర్స్‌కు రూ. 39,302 కోట్లు కేటాయించారు. ఇక జీతాల చెల్లింపు తదితర రెవెన్యూ వ్యయానికి రూ. 2,10,682 కోట్లు కేటాయించారు. కేంద్రం ప్రభుత్వం మొత్తం మూలధనంలో 32.19 శాతం సాయిధ బలగాలకు కేటాయించామని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వ్యయం మొత్తంలో 15.48 శాతం రక్షణ రంగం కేటాయింపులేనని చెప్పారు. రక్షణ రంగానికి ఇచ్చిన దానికి అదనంగా పెన్షన్ల కోసం రూ. 1,12,079 కోట్లను కేటాయించారు.

సరిహద్దులను కాపాడటానికి అవసరమైతే మరిన్ని నిధులు ఇవ్వడానికి కూడా సిద్ధమని పీయూష్‌ గోయల్‌ బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. కఠినమైన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుతున్న సైనికులు గర్వకారణమని, అందుకే ఈ ఏడాది వారికోసం ఇప్పటివరకూ ఎవరూ కేటాయించని స్థాయిలో నిధులు కేటాయించామని తెలిపారు. నలభైఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఒకే హోదా ఒకే పింఛన్‌ను తాము పరిష్కరించామని తెలిపారు. యూపీఏ సర్కారు 2014–15 మధ్యంతర బడ్జెట్‌లో కేవలం రూ. 500 కోట్లు మాత్రమే కేటాయిస్తే తాము ఆ పథకం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ రూ.35 వేల కోట్లు పంపిణీ చేశామని పీయూష్‌ అన్నారు. యూపీఏ ఒకేహోదా ఒకే పింఛన్‌ (వన్‌ ర్యాంక్‌ వన్‌ పింఛన్‌)ను మూడు బడ్జెట్‌లలో ప్రస్తావించినప్పటికీ అమలు చేసింది మాత్రం తామేనంటూ ఆయన.. ‘మిలటరీ సర్వీస్‌ పే’లో అన్ని దళాల వారికీ అలవెన్సులను గణనీయంగా పెంచామని వివరించారు. అంతేకాకుండా ప్రమాదకర పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తున్న నేవీ, వాయుసేనల సిబ్బందికి ఇచ్చే ప్రత్యేక అలవెన్సులను కూడా ఎక్కువ చేశామని గుర్తు చేశారు.  

హోం మంత్రిత్వ శాఖకు 1,03,927
కేంద్ర హో మంత్రిత్వ శాఖకు కేటాయింపులు తొలిసారి లక్ష కోట్ల రూపాయలు దాటాయి. 2019–20 కేంద్ర బడ్జెట్‌లో హోం మంత్రిత్వ శాఖకు రూ. 1,03,927 కోట్లు కేటాయించారు. 2018–19 బడ్జెట్‌లో ఆ శాఖకు రూ. 99.03వేల కోట్లతో పోలిస్తే ఈ సారి 4.9 శాతం ఎక్కువ. దేశ రాజధానిలో శాంతిభద్రత కాపాడే ఢిల్లీ పోలీసులకు ఈ బడ్జెట్‌లో రూ. 7,496.91 కోట్లు, సరిహద్దులో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 2 వేల కోట్లు కేటాయించారు. సీఆర్‌పీఎఫ్‌ బలగాల కోసం రూ. 23,742.04 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి సీఆర్‌పీఎఫ్‌కు దాదాపు రూ. 1,095 కోట్లు అదనంగా కేటాయింపులు జరిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం బీఎస్‌ఎఫ్‌ కోసం 19,647.59 కోట్లు ఇచ్చారు. ఇది గతేడాదితో పోలిస్తే రూ. 1,061 కోట్లు అదనం. సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్, సశస్త్ర సీమా బల్, అస్సాం రైఫిల్స్, నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌తో పాటు సాయిధ బలగాల కోసం మొత్తం రూ. 71,618.70 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో ఈ కేటాయింపులు రూ. 67,779.75గా ఉన్నాయి. 

ఇతర కేటాయింపులు..
- ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు ఈ బడ్జెట్‌లో రూ. 2,198.35 కోట్లు కేటాయించారు.  
ప్రధాని, మాజీ ప్రధాని భద్రతకోసం వినియోగించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌నకు రూ. 530.75 కోట్లు ఇచ్చారు.  
పోలీస్‌ మౌలిక వసతుల అభివృద్ధి, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, వాహనాల కొనుగోళ్లు, బారక్‌లు, ఇళ్ల నిర్మాణం కోసం రూ. 5,117 కోట్లు ఇచ్చారు.  
పోలీసు బలగాల ఆధునికీకరణ కోసం రూ. 3,378 కోట్లు, సరిహద్దులో మౌలిక వసతులు, నిర్వహణకు రూ. 2 వేల కోట్లు, మహిళల రక్షణ, సాధికారత మిషన్‌కు రూ. 1,330 కోట్లు, సరిహద్దు ప్రాంత అభివృద్ధి కార్యక్రమానికి రూ. 825 కోట్లు, జమ్మూకశ్మీర్‌లో వలసదారులు, స్వదేశానికి తిరిగివచ్చిన వారి పునరావాసం కోసం రూ. 809 కోట్లు, స్వాతంత్య్ర పోరాటయోధుల పింఛన్ల కోసం రూ. 953 కోట్లు, నిర్భయ ఫండ్‌కు రూ. 50 కోట్లు కేటాయించారు.  
ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి జాతీయ విపత్తు రిలీఫ్‌ ఫండ్‌కు రూ. 10,000 కోట్లు కేటాయించారు.  
రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా 2021 జనాభా లెక్కలకు రూ. 541.33 కోట్లు, రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు రూ. 50 కోట్లు, జమ్మూ కశ్మీర్‌లో పరిశ్రమల ఏర్పాటుకు రూ. 78.09 కోట్లు, హిందీ భాష ప్రచారానికి రూ. 4,895.81 కోట్లు కేటాయించారు.  
కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవులకు రూ. 4,817.48 కోట్లు, చండీగఢ్‌కు రూ. 4,291.70 కోట్లు, దాద్రా నగర్‌ హవేలీకి రూ. 1,117.99 కోట్లు, డామన్‌ అండ్‌ డయ్యు రూ. 821.4 కోట్లు, లక్షద్వీప్‌కు రూ. 1,276.74 కోట్లు ఢిల్లీకి రూ.1,112 కోట్లు, పుదుచ్చేరికి రూ. 1,545 కోట్లు కేటాయించారు.  

కంచె.. కాస్త పలచబడింది!
‘జై జవాన్‌’ అన్నది పేరుకేనా? సమయం దొరికినపుడల్లా సైనికుల గొప్పలు చెప్పే మోదీ సర్కారు.. రక్షణరంగానికి చేసిన కేటాయింపులెంత? ఆయుధాల దిగుమతుల్లో అతిపెద్ద దేశమైన మనకు.. ప్రస్తుత తరుణంలో రక్షణరంగ కేటాయింపులేమీ పెరగలేదు. రూ.3 లక్షల కోట్లకన్నా ఎక్కువ కేటాయించామని, ఈ స్థాయి నిధులివ్వటం ఇదే తొలిసారని చెబుతున్నారు. కానీ ఆయుధాలు కొనేది డాలర్లలో. గతేడాది డాలర్‌ విలువ ఇప్పటికన్నా చాలా తక్కువ. దీంతో గతేడాది కేటాయింపులు దాదాపు 44.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఇపుడు రూ.3 లక్షల కోట్లు దాటినా... డాలర్లలో మునుపటేడాది కన్నా తక్కువే. 

డాలర్లలో గతేడాది కేటాయింపులు 44.5 బిలియన్లు డాలర్లలో ప్రస్తుత కేటాయింపులు 43 బిలియన్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement