మధ్యంతర బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దుతున్న తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్. చిత్రంలో సహాయ మంత్రులు రాధాక్రిష్ణన్, శుక్లా
న్యూఢిల్లీ: మోదీ సర్కారు ఎన్నికల ముందు ప్రజలపై వరాల జల్లు కురిపిస్తుందా? లేదంటే సంప్రదాయాలను అనుసరించి కేవలం పద్దులకే పరిమితం అవుతుందా? మరికొద్ది గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది. ఓటర్లను ఊరించే నిర్ణయాలతో మోదీ సర్కారు బడ్జెట్ ఉంటుందన్న భారీ అంచనాల్లో నిజం పాళ్లు ఎంతన్నది... పార్లమెంటులో శుక్రవారం తాత్కాలికంగా ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న పీయూష్ గోయల్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ తేటతెల్లం చేయనుంది. ఉదయం 11 గంటలకు గోయల్ బడ్జెట్ చిట్టాను విప్పనున్నారు.. మరో మూడు నెలల్లోపే ఎన్నికలు ఉండడంతో సంప్రదాయానికి అనుగుణంగా తాత్కాలిక బడ్జెట్‌నే ప్రవేశపెట్టనున్నట్టు ఆర్థిక శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.
మరి సంప్రదాయం ప్రకారమే అయితే, పదవీకాలం చివర్లో ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్‌లో కీలక విధాన నిర్ణయాలేవీ ఉండవు. పరిమిత కాలానికి ఖర్చులకు సంబంధించి అనుమతి తీసుకోవడం మాత్రమే ఉంటుంది. ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పడే ప్రభుత్వమే పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. అయితే, వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు పెంపు, సమస్యల్లో ఉన్న రైతాంగానికి ఉపశమనం కల్పించే ప్యాకేజీ, చిన్న వ్యాపారులకు రుణాలపై వడ్డీ రాయితీతోపాటు పలు ఇతర ప్రజాకర్షక నిర్ణయాలు ఉండొచ్చన్న అంచనాలను విశ్లేషకులు, రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల కాలానికి ప్రభుత్వ ఖర్చులకు పార్లమెంటు అనుమతి కోరడానికి అదనంగా.. గ్రామీణ, పట్టణ మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించే నిర్ణయాలను పీయూష్ గోయల్ ప్రకటించొచ్చని భావిస్తున్నారు.
ప్రభుత్వంపై ఒత్తిళ్లు..
విపక్ష కాంగ్రెస్ ఇప్పటికే రైతులకు దేశ్యాప్తంగా రుణ మాఫీ, పేదలకు కనీస ఆదాయం ఇస్తామన్న హామీలతో పాలక బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు సవాలు విసిరింది. దీంతో తాము సైతం ఏదో ఒకటి చేయాల్సిన ఒత్తిళ్లు మోదీ సర్కారుపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతాంగానికి సంబంధించి ఊరటనిచ్చే ప్యాకేజీ లేదా పథకం ఏదైనా ఉండొచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వివిధ రకాల సబ్సిడీల స్థానంలో నగదు ప్రయోజనం లేదంటే సబ్సిడీలకు అదనంగా ఇవ్వడం ద్వారా గ్రామీణ సంక్షోభాన్ని పరిష్కరించే రీతిలో ఉంటుందని అంచనా. ముఖ్యంగా రైతులకు తెలంగాణలో మాదిరిగా నేరుగా నగదును అందించడం లేదా వడ్డీ రహిత సాగు రుణాలను ప్రకటించే అవకాశాలున్నాయి. అలాగే, ఆహార పంటలకు ఉచితంగా బీమా కల్పించడం కూడా చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఇటీవలి పలు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమికి రైతాంగ సంక్షోభమే కారణమని విశ్లేషణల్లో తేలిన విషయం తెలిసిందే.
ఈ నిర్ణయాలకు చోటు?
► రైతాంగానికి ప్యాకేజీ. ఇందుకోసం ప్రభుత్వంపై అదనంగా రూ.లక్ష కోట్ల వరకు భారం. ఆహార పంటలకు ఉచిత బీమా.
► వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపును 60 ఏళ్లలోపు వారికి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచే అవకాశం. వృద్ధుల్లోని రెండు వర్గాలకు కూడా ఇంతే మేర మినహాయింపు పెంపు. మహిళలకు రూ.3.25 లక్షల వరకు పన్ను మినహాయింపునకు అవకాశం. కేవలం పన్ను మినహాయింపును పెంచి, ట్యాక్స్ శ్లాబుల్లో మార్పులు చేయకపోతే ప్రభుత్వంపై పెద్దగా ఆర్థిక భారం ఉండదని భావిస్తున్నారు.
► సెక్షన్ 80సీ పన్ను మినహాయింపు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంపు.
► ఇళ్ల ప్రాజెక్టుల్లో జాప్యం, పెరిగిన వడ్డీ రేట్ల నేపథ్యంలో... సొంతింటికి తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీకి పన్ను మినహాయింపును రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచే అవకాశం.
► చిన్న వ్యాపారులకు చౌక వడ్డీకే రుణాలు
► ఉద్యోగాల కల్పన దిశగా నిర్ణయాలు.
► దేశవ్యాప్తంగా ప్రతీ పేద కుటుంబానికి నగదు ప్రయోజనాన్ని అందించే సార్వత్రిక కనీస ఆదాయం (యూబీఐ) పథకంపైనా ఊహాగానాలు రాగా, ఇది భారీ బడ్జెట్‌తో కూడుకున్నది కావడంతో మోదీ సర్కారు దీని విషయంలో ముందుకు వెళ్లకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి.
తాత్కాలిక బడ్జెటే: ప్రధాని మోదీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాలను ఫలప్రదం చేయాలని విపక్ష పార్టీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. పార్లమెంటు హౌజ్‌లో గురువారం సాయంత్రం జరిగిన అఖిలపక్ష భేటీలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేడు ప్రవేశపెడుతున్న బడ్జెట్.. తాత్కాలిక బడ్జేటేనని, పూర్తిస్థాయి బడ్జెట్ కాదని విపక్ష నేతలకు ఆయన స్పష్టతనిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ముందు జరిగే ఈ చివరి సమావేశాల్లో సమయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుందామని విపక్షాలకు ప్రధాని పిలుపునిచ్చారు.
గత ఐదేళ్లుగా అందించిన సహకారానికి విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టనున్న 48 బిల్లుల ప్రతులను సభ్యులకు అందజేశారు. ఎన్నికలున్నందున, ట్రిపుల్ తలాఖ్, పౌరసత్వ బిల్లు తదితర వివాదాస్పద బిల్లులను సభలోకి తీసుకురాకపోవడమే మంచిదని కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ తదితర విపక్ష నేతలు ప్రభుత్వానికి సూచించాయి. ఆ బిల్లులను ప్రవేశపెడ్తే సభలో జరిగే ఆందోళనలకు తాము బాధ్యులం కాబోమని స్పష్టం చేశాయి.
ఆర్థిక పర్యవసానాలు
ఇన్వెస్టర్ల కోణంలో చూస్తే... ఈ తరహా నిర్ణయాలు బడ్జెట్‌లో ఉంటే గనుక... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 3.3 శాతానికి పరిమితం కావాలన్న ప్రభుత్వ లక్ష్యం సాధ్యం కాదు. పైగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం అదనంగా రుణాలు తీసుకోవాల్సి వస్తుందని అంచనా. ఇప్పటికే 2018–19 సంవత్సరానికి జీఎస్టీ వసూళ్లు అంచనాలకు అనుగుణంగా లేవు. రూ.1.4 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం వ్యయాలను తగ్గించకుండా, సాగు రంగానికి అధిక సబ్సిడీ ప్రయోజనాలకు చోటిస్తే అది ద్రవ్యలోటు పెరిగేందుకు దారితీస్తుందంటూ ఫిచ్ సహా ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు హెచ్చరించాయి కూడా.
Comments
Please login to add a commentAdd a comment