సాక్షి, న్యూఢిల్లీ : రానున్న బడ్జెట్‌లో తమకు రూ 1.20 లక్షల కోట్ల నిధులు కేటాయించాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కోరుతోంది. జులై 5న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో తమ మంత్రిత్వ శాఖకు అధిక నిధులు కోరుతూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను స్వయంగా కలిసి అభ్యర్ధించారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 1న పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో కేటాయింపుల కంటే రూ 37,000 కోట్లు అదనంగా రూ 1.20 లక్షల కోట్లు తమ శాఖకు కేటాయించాలని గడ్కరీ కోరుతున్నారు.
జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు మౌలిక రంగ ప్రాజెక్టులను ప్రైవేట్ పెట్టుబడులతో నిమిత్తం లేకుండా సత్వరమే పూర్తిచేసేందుకు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ బడ్జెట్‌లో అధిక నిధులను కోరుతోందని ఆ మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. భారత్ పది లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్ధగా ఎదగాలంటే మౌలిక వసతులను అత్యాధునికంగా నిర్మించాలని మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment