సాక్షి, అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో అమలు చేసిన ఒక పథకానికి అచ్చుగుద్దినట్టు అలానే ఉండే పథకాన్ని ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశమంతటా అమలు చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి డ్వాక్రా మహిళలందరికీ 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా ఎంతో కొంత పింఛను అందించాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం తీరునే ఇప్పుడు దేశంలోని అసంఘటిత కార్మికులందరికీ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి 60 ఏళ్ల తర్వాత పింఛన్లు అందించే పథకాన్ని అమలు చేయడానికి కేంద్రం ముందుకొచ్చింది. 60 ఏళ్లు దాటిన మహిళలు సభ్యులుగా ఉన్న డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అనేక అంక్షలు అమలు చేస్తున్న విషయాన్ని అప్పటి ప్రభుత్వ ఉన్నతాధికారులు వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకు రాగా వారి కోసం అభయహస్తం పేరుతో పింఛన్ల పథకాన్ని ప్రకటించారు.
డ్వాక్రా మహిళలు రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 చొప్పున ఈ పథకంలో జమ చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి మహిళ పేరున ఏడాదికి రూ.365 చొప్పున చెల్లిస్తుంది. మహిళ వాటా, ప్రభుత్వ వాటా రెండు కలిపి ప్రభుత్వమే ఆ డబ్బులను ఎల్‌ఐసీ వంటి బీమా సంస్థల్లో పింఛన్ల స్కీంలో పెట్టుబడిగా పెడుతుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత వారికి పింఛన్లు చెల్లిస్తోంది. సభ్యులు పథకంలో చేరిన సంవత్సరాల ఆధారంగా రూ.500 నుంచి రూ.2,600 మధ్య పింఛను చెల్లించాలి. మహిళలకు 60 ఏళ్లు రాకమునుపే ఆ కుటుంబంలో చదువుకునే పిల్లలకు స్కాలర్ షిప్పు ఇవ్వడం.. ఒక వేళ దుర్మరణం వంటి విషాదకర సంఘటన జరిగితే బీమాగా కొంత మొత్తాన్ని ఆ కుటుంబానికి అందజేయడం ఈ పథకం ప్రధాన ఉద్ధేశం. ప్రస్తుత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 34 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఈ పథకంలో సభ్యులుగా కొనసాగుతుండగా, వారిలో 3,21,703 మంది ఈ పథకం ద్వారా ప్రతి నెలా ప్రస్తుతం పింఛన్లు అందుకుంటున్నారు.
వైఎస్ ముందు చూపుతో ఆనాడే ఆదర్శ పథకం
అసంఘటిత కార్మికుల కోసం ఈ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో సభ్యులుగా చేరిన వారు ఏడాదికి రూ.100 జమ చేస్తే.. ప్రభుత్వం కూడా వంద రూపాయలు అతని పేరిట జమ చేస్తూ.. అతనికి 60 ఏళ్ల తర్వాత రూ.3 వేల వరకు పింఛను ఇస్తుంది. ఇది అభయహస్తం పథకానికి అచ్చుగుదినట్టుగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ముందు చూపుతో ఇలాంటి విన్నూత పథకాలు ప్రవేశపెట్టారని, ఇప్పుడు అవి దేశానికి ఆదర్శంగా మారాయని అంటున్నారు. అయితే, అభయహస్తం పథకానికి చంద్రబాబు ప్రభుత్వం ‘అన్న అభయహస్తం’ అని పేరు మార్చిందే గానీ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ పథకంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి మరింత మంది డ్వాక్రా మహిళలకు పింఛన్ల లబ్ధి కలిగేలా చేయడానికి మాత్రం అసక్తి చూపడం లేదనే విమర్శ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment