
న్యూఢిల్లీ: అత్యధికంగా విద్యుత్ వాహనాల వినియోగంతో అంతర్జాతీయంగా రవాణా విప్లవానికి భారత్ సారథ్యం వహించగలదని ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. ఈ క్రమంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, ఇంధన భద్రత సాధించగలదన్నారు. ఇంధనం, గ్యాస్ దిగుమతులు తగ్గితే.. పునరుత్పాదక విద్యుత్ వనరులు గణనీయంగా వృద్ధి చెందగలవని మంత్రి వివరించారు. ‘ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగితే ఈ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించగలదు. అలాగే గణనీయంగా విదేశీ మారకం కూడా ఆదా కాగలదు‘ అని ఆయన చెప్పారు. 2030 నాటికి దేశీయంగా అమ్ముడయ్యే వాహనాల్లో 30% వాటా విద్యుత్ వాహనాలదే ఉండగలదని పరిశ్రమవర్గాల అంచనా.
సత్వర కార్యాచరణ ప్రణాళిక ఉండాలి ..
రవాణా విప్లవానికి భారత్ సారథ్యం వహించాలంటే ప్రభుత్వం సత్వరమే నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, నిర్దిష్ట గడువు విధించుకుని అమలు కూడా చేయాల్సి ఉంటుందని పరిశ్రమవర్గాలు వ్యాఖ్యానించాయి. ‘నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన దిశగా ప్రభుత్వం త్వరలోనే నిర్మాణాత్మకమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించగలదని ఆశిస్తున్నాం‘ అని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల సమాఖ్య ఎస్‌ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ తెలిపారు. విధానాలను తరచూ మార్చేస్తుండటం వల్ల తగ్గిపోయిన డిమాండ్‌కు ఊతమిచ్చేలా వచ్చే ఏడాది, రెండేళ్ల పాటు ప్రభుత్వం భారీ స్థాయిలో రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ వాహనాలకు ఊతమివ్వడంపై మరింతగా దృష్టి పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ స్వాగతించారు. వాయు కాలుష్య కారక ఉద్గారాలు వెలువడే స్థాయిని బట్టి వాహనాలపై పన్నులు విఢదించడం ద్వారా పర్యావరణ అనుకూల వాహనాలను ప్రోత్సహించవచ్చన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల దిగుమతులపై సుంకాలు తగ్గిస్తే.. ఆయా వాహనాల ధరలు కూడా తగ్గగలవని ట్వెంటీ టూ మోటార్స్ సహ వ్యవస్థాపకుడు పర్వీన్ ఖర్బ్ తెలిపారు.