మొన్న మహాత్మాగాంధీ అమరుడైన రోజు, ప్రధాని మోదీ స్టూడెంట్ కుర్రాళ్లకి, వారి తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకు ఢిల్లీ తాలక్‌టోరా స్టేడియంలో మంచి క్లాసు పీకారు. ‘పరీక్షలు పండగలా ఉండాలి’ అనగానే, ‘అబ్బో! ఎలక్షన్లు మాత్రం ఉండద్దా’ అని ఓ తెలుగు కుర్రాడు గొణిగాడు. ‘మీరు పరీక్షల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి’ అని మోదీ అంటే ‘ఆప్ భీ’ అన్నదొక హిందీ అమ్మాయి. ‘జీవితంలో పరీక్షలు ఒక భాగమే తప్ప జీవిత సర్వస్వం కాదు’ అనగానే ‘ఎలక్షన్ల లాగా’నే అంటూ ఓ కుర్రాడు అందించాడు. ‘పిల్లలెప్పుడూ తుళ్లుతూ నవ్వుతూ ఉండాలి’ అన్నారు గంభీరంగా ప్రసంగ ధోరణిలో. అందరూ ఒక్కసారి ఫెళ్లున నవ్వారు. ఎందుకంటే ప్రధాని నవ్వడం వాళ్లెప్పుడూ పొరబాటున కూడా చూడలేదుట.
భారత పూర్వ ప్రధాని చిరునవ్వడం వారి తండ్రి ఒకసారి కళ్లారా చూశారట. మరో ప్రధాని మన్మోహన్ నవ్వడం చూసిన పెద్దలు ఒకరిద్దరా సభలో ఉన్నారట. మోదీయే కాదు, ఆయన మంత్రివర్గంలో కూడా ఎవ్వరూ నవ్వరు. నీతిపరులు గంభీరంగా ఉండాలని నవ్వుతారు. పెద్ద పెద్ద జడ్జీలు, గవర్నర్లు సాధారణంగా నవ్వరు. పిల్లల్ని ఇంకొకరితో పోల్చి తక్కువ చేయవద్దని మోదీ చెప్పారు. బీజేపీ మాత్రం పోల్చుకుని అనవసరంగా పోటీ పడటం దేనికి? రేపు ఎన్నికల్లో తేడాపడితే దేశ సేవ చేయడానికి ఇంకొకరికి సువర్ణ అవకాశం వస్తుంది. మోదీ ఎక్కడున్నా ప్రజాసేవ మితం లేకుండా చెయ్యొచ్చు. స్వేచ్ఛగా బోలెడు ఉద్యమాలు చెయ్యొచ్చు. అసలు ఓం ప్రథమంగా రామమందిర నిర్మాణం మీద మహోద్యమం తీయచ్చు. దీంతో ఏంటంటే గుడి వచ్చినా రాకపోయినా, కొన్ని వర్గాల్లో గొప్ప కీర్తి మిగుల్తుంది. మొన్న పిల్లలకి వైఫల్యం నుంచి విజయం సాధించాలని చెప్పారు. ఇట్లాంటివి చెప్పడానికి భలే ఉంటాయి, కానీ వింటుంటే చెవుల్లో సెగలొస్తాయన్నాడొక స్టూడెంటు.
‘చదువు పుస్తకాల్లో మాత్రమే ఉండదు. పుస్తకాల్లోనూ ఉంటుంది’. విన్నావా, మనం కూడా మంత్రులమై ఇట్లా మాట్లాడాలిరా. వీళ్లకంటే కాషాయ డ్రెస్ వేసుకుని మాట్లాడే ప్యూర్ వేదాంతులు నయమని ఓ అమ్మాయి తెగ వేష్ట పడింది. మా స్కూలు టీచరు, మా గుళ్లో పూజారి వీళ్లు కూడా ఇవే మాటలు చెబుతుంటారు– వినే వాళ్లుంటే. పాపం వాళ్లకెవరూ ఉండరు. చాలా పెద్దాయన కాబట్టి ఎక్కడ చూసినా మైకులే– ఎవరూ విన్నా వినకపోయినా. రేడియోలు, టీవీలు మోదీ సందేశాన్ని వినిపించాయ్. అవన్నీ రేపెప్పుడో పుస్తకాలుగా వస్తాయ్. పాఠ్యగ్రంథాలు అవుతాయ్. కానీ ఆయన పవర్‌లో ఉండాలి.
మనమే చచ్చినట్టు నిశ్శబ్దంగా వింటాం. ఇవ్వాళ పెద్ద పెద్ద వాళ్లు బడ్జెట్ సభలో తెగ కేకలు పెట్టారని పిల్లలు అనుకున్నారు. ‘ఔను, వాళ్లంటే సాటి సమానస్తులు కదా. వాళ్లకేం భయం’ అని కొందరు సమర్థించారు. బడ్జెట్ అన్నా తాయిలాలన్నా ఒకటేనా అని పిల్లలకి ధర్మ సందేహం వచ్చింది. ఎన్నికల ముందే అమ్మనాన్నలకి, మేష్టారికి మంచి చేస్తారెందుకు. ఇంకాస్త ముందు చెయ్యచ్చుకదా అని పిల్లలకి సందేహం వచ్చింది. ‘మంచి చేయడానికి ఓటు వేయడానికి ఎక్కువ టైం ఉంటే మర్చిపోరూ’ – ఓ పెద్ద కుర్రాడు దీర్ఘం తీశాడు.
అసలిది గొర్రెతోక బడ్జెట్‌ట. కోతి తోకది తర్వాత వస్తుందిట– ఓ పెద్దాయన టీవీలో చెబుతున్నాడు. ఏ తోక అయితేనేంగానీ నేనెప్పుడూ ఏటా బడ్జెట్ ప్రసంగం శ్రద్ధగా వింటా. బంగారం, పెట్రోలు లాంటి వాటిపై పన్నులు రాయితీలు నేనసలు పట్టించుకోను. వాటిమీద ఉండేది కూడా స్వల్పంగానే ఉంటుంది. నాకు వినబుద్ధి అయ్యేవి, గుండు సూదులు, తుంగచాపలు, ఎర్రరంగు మొలతాళ్లు, కుక్కల మెడ బెల్టులు, నిక్కరు గుండీలు, సీళ్లలక్క, చింతరావి మామిడి కొయ్యలతో చేసిన పాంకోళ్లపై పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇంకా ఇట్లాంటివే బోలెడుంటాయి. ఈసారి మోదీ బడ్జెట్ అతిలౌక్యంగా కొట్టాడన్నాడొక గ్రామపెద్ద. మావూరి చిన్న టీకొట్లో స్ట్రాంగ్‌గా కావాలా, లైట్‌గా కావాలా అని అడిగితే ‘లౌక్యంగా కొట్టు’ అనడం అలవాటు. అంటే అటూ ఇటూ కాకుండా అని అర్థం.
శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Published Sat, Feb 2 2019 1:05 AM | Last Updated on Sat, Feb 2 2019 1:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment