
మార్కెట్ రుణ సమీకరణ రూ.4.48 లక్షల కోట్లు
మార్కెట్ నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.4.48 లక్షల కోట్ల రుణ సమీకరణ జరపనుందని ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2018–19 ఆర్థిక సంవత్సరం (రూ.4.47 లక్షల కోట్లు) రుణ సమీకరణకన్నా ఇది కొంచెం ఎక్కువ. నిజానికి 2018–19 ఆర్థిక సంవత్సరంలో 4.07 లక్షల కోట్ల మార్కెట్ రుణ సమీకరణలనే బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే నికరంగా ఈ పరిమాణం రూ.4.47 లక్షల కోట్లకు పెరిగినట్లు సవరిత అంచనాలు తెలిపాయి. ఇక స్థూలంగా చూస్తే రుణ పరిమాణం రూ.5.71 లక్షల కోట్ల నుంచి రూ.7.1 లక్షల కోట్లకు పెరిగింది. గడచిన రుణాల రీపేమెంట్లు కూడా స్థూల రుణాల్లో కలిసి ఉంటాయి. ఈ తరహా చెల్లింపులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2.36 లక్షల కోట్లు ఉంటాయని తాజా బడ్జెట్ పేర్కొంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం– చేసే వ్యయం మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును పూడ్చుకునే మార్గాల్లో ప్రభుత్వానికి మార్కెట్ నుంచి రుణ సమీకరణ ఒకటి. డేటెడ్ బాండ్లు, ట్రెజరీ బిల్లుల ద్వారా ఈ నిధుల సమీకరణ జరుగుతుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు కట్టుతప్పనున్న విషయం స్పష్టమైపోయింది. 2018–19 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.3 శాతంగా ద్రవ్యలోటు ఉండాలని వార్షిక బడ్జెట్ నిర్దేశించింది. విలువలో ఇది రూ.6.24 లక్షల కోట్లు. అయితే 2018 నవంబర్ పూర్తయ్యే నాటికే ఈ లోటు రూ.7.16 లక్షల కోట్లను తాకింది. అంటే లక్ష్యానికన్నా మరో 15 శాతం ఎక్కువయిందన్న మాట. మెజారిటీ ఆర్థిక సంస్థలు, విశ్లేషణలకు అనుగుణంగానే ద్రవ్యలోటు అంచనాలు పెరగనున్నట్లు ఆర్థికమంత్రి తన తాజా బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడం గమనార్హం. కాగా ద్రవ్యలోటును 2019–20 ఆర్థిక సంవత్సరంలో 3.4 శాతంగా కొనసాగించడానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆర్థికమంత్రి తన ప్రసంగంలో తెలిపారు.
రైతులకు మద్దతు ఇవ్వకపోతే... అంచనాలకు అనుగుణంగానే!
‘‘2018–19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 3.3 శాతానికి కట్టడి చేయాలనే అనుకుంటున్నాం. అయితే రైతులకు ఆదాయ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. ఇందుకు సవరించిన అంచనాల్లో (2018–19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో) రైతులకు రూ.20,000 కోట్లను అందించాలని నిర్ణయించాం. 2019–20లో (బడ్జెట్ అంచనాలు) ఈ మొత్తం రూ.75,000 కోట్లుగా అంచనావేస్తున్నాం. అందువల్లే ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొంత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాం. ఈ మద్దతు కల్పించకపోతే, ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3.3%, వచ్చే ఆర్థిక సంవత్సరం 3.1%గా ఉంటుంది’’ అని గోయెల్ పేర్కొన్నారు. 2020–21 నాటికి 3% లక్ష్యమన్నారు.
కరెంట్ అకౌంట్ లోటు 2.5 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు (ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) జీడీపీలో 2.5 శాతం ఉంటుందని గోయెల్ బడ్జెట్ పేర్కొంది.
తగ్గిన పన్ను ఆదాయం
2018–19 ఆర్థిక సంవత్సరంలో స్థూల పన్ను ఆదాయం బడ్జెట్ అంచనాలకన్నా స్వల్పంగా రూ.23,067 కోట్లు తగ్గుతోంది. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు అంచనాలకన్నా తగ్గడం దీనికి కారణం.
జీడీపీలో స్థూల పన్ను వసూళ్లు 12.1 శాతానికి!
2019–20 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో స్థూల పన్ను ఆదాయం 12.1 శాతానికి పెరుగుతుందని బడ్జెట్ అంచనావేసింది. 2020–21లో ఇది 12.2 శాతానికి చేరుతుందని పేర్కొంది.
లక్ష్యాలను దాటిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు
ప్రత్యక్ష పన్ను వసూళ్లు మాత్రం 2018–19 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలను దాటడం గమనార్హం. బడ్జెట్ అంచనా రూ.11.50 లక్షల కోట్లయితే, అదనంగా మరో రూ.50,000 కోట్లతో మొత్తం రూ.12 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు లక్ష్యం రూ.13.80 లక్షల కోట్లు. ఈ విభాగంలో కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయ పన్ను (పీఐటీ) ఉంటాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.7.60 లక్షల కోట్లను కార్పొరేట్ పన్నుగా, వ్యక్తిగత ఆదాయపు పన్నుల ద్వారా రూ.6.20 లక్షల కోట్లను సమీకరించాలన్నది బడ్జెట్ ప్రణాళిక. 2018–19లో ఈ మొత్తాలు వరుసగా 6.71 లక్షల కోట్లు, రూ.5.29 లక్షల కోట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment