సాక్షి, హైదరాబాద్: ఈసారి బడ్జెట్‌లో పెండింగ్‌లో ఉన్న పాత ప్రాజెక్టులను పూర్తిచేసేందుకే కేంద్రం ఎక్కువ ఆసక్తి చూపించింది. కొత్త ప్రాజెక్టుల గురించి ఎలాంటి ప్రకటన చేయకుండా.. పాత వాటికి నిధుల కేటాయింపునకే పెద్దపీట వేసింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కాజీపేట డివిజన్ హోదా, వట్టినాగులపల్లి టెర్మినల్ నిర్మాణం తదితర డిమాండ్లు ఈ బడ్జెట్‌లోనూ తీరని కోరికలుగానే మిగిలిపోయాయి. కాజీపేట–బల్లార్షా మూడో లైనుకు ఈ ఏడాది కూడా మోక్షం లభించలేదు. మరోవైపు అక్కన్నపేట–మెదక్ రైలు మార్గం ఈఏడాది ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కొత్తపల్లి–మనోహరాబాద్‌కు మార్గంలోనూ మనోహరాబాద్–గజ్వేల్ వరకు ట్రయల్ రన్‌కు అధికారులు సిద్ధమవుతుండటం శుభసూచకం. శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే కేంద్రమైన సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ జనరల్ మేనేజర్ జాన్ థామస్ బడ్జెట్ వివరాలు వెల్లడించారు.
కీలక ప్రాజెక్టులకు కేటాయింపులు..
1. మనోహరాబాద్ కొత్తపల్లి ప్రాజెక్టుకు రూ.200 కోట్లు
2. మునీరాబాద్–మహబూబ్‌నగర్ మార్గానికి రూ.275 కోట్లు
3. భద్రాచలం–సత్తుపల్లి లైన్‌కు రూ.405 కోట్లు
4. కాజీపేట–బల్లార్షా మూడో లైన్‌కు రూ.265 కోట్లు
5. సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ డబ్లింగ్‌కు రూ.200 కోట్లు
6. కాజీపేట–విజయవాడ మూడోలైన్‌కు రూ.110 కోట్లు
7. ఘట్‌కేసర్–యాదాద్రి ఎంఎంటీఎస్ ఫేజ్–2కు రూ.20 కోట్లు
8. చర్లపల్లి శాటిలైట్ స్టేషన్‌కు రూ.5 కోట్లు
9. కాజీపేట ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్‌కు రూ.10 కోట్లు
10. మౌలాలిలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైల్వే ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ ఏర్పాటుకు రూ.1.5 కోట్లు
తీరని కలలు...
1980 నుంచి తీరని కలగా మిగిలిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఈసారి కూడా మోక్షం దక్కలేదు. కాజీపేటను డివిజన్‌గా మార్చాలన్న డిమాండ్, లాలాగూడలో మెడికల్ కాలేజీ నిర్మించాలన్న డిమాండ్ ప్రస్తుతానికి పెండింగ్‌లోనే ఉన్నాయి. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని చర్లపల్లి, వట్టినాగులపల్లి టెర్మినళ్ల నిర్మాణం ఇంకా సాకారం కావడం లేదు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించడంలో జాప్యం చేస్తున్నందునే ఇది ఆలస్యమవుతోంది.
ఈ సర్వే పనులకు టెండర్లు పిలుస్తారా?
1. పటాన్‌చెరు–సంగారెడ్డి–జోగిపేట–మెదక్ 95 కిలోమీటర్లు
2. నిజామాబాద్–నిర్మల్–ఆదిలాబాద్ రూ.125 కోట్లు
3. కరీంనగర్–హుజూరాబాద్–ఎల్కతుర్తి: 60 కిమీ
‘ఓట్ల కోసమే ఈ బడ్జెట్ ’
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం ఓట్ల కోసమే పెట్టినట్టుందని కాంగ్రెస్ ఆరోపించింది. పేదలను వదిలి వ్యాపారుల మన్ననలు పొందేలా ఉన్న ఈ బడ్జెట్‌తో బీజేపీ వ్యాపారస్తుల పార్టీ అని మరోమారు తేలిపోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఏఐసీసీ కిసాన్‌సెల్ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డితో కలసి మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపు పన్నును మినహాయించినట్టు ప్రకటించి వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని చెప్పడం దారుణమన్నారు. బడాబాబులకు ఐటీ తగ్గించి పేదలను పట్టించుకోకుండా అంకెలు చూపెట్టారని, మోదీ వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని, రాబోయే ఎన్నికల్లో మోదీ సర్కారును గద్దెదింపేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్
ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ త్వరలో జరిగే సాధారణ ఎన్నికలకు ప్రచారం మాదిరిగా ఉందని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ ద్వారా గతంలో తాను ప్రవేశపెట్టిన అన్ని పథకాలు విఫలమైనట్లుగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్టు అయిందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు, మద్దతు ధర, ఈనామ్ లాంటివన్నీ విఫలమవడంతో ఇప్పుడు కొత్తగా రైతులకు పెట్టుబడి సాయం పేరుతో ముందుకొచ్చారని విమర్శించారు. ఆదాయ పన్ను పరిమితి పెంపు మంచిదని పేర్కొన్నారు. అయితే, దీన్ని గత ఐదేళ్లలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ఎన్నికల కోణంలో ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment