న్యూఢిల్లీ: దేశంలోని కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. నెలకు రూ.15,000 దాకా వేతనం పొందుతున్న వారికి ప్రత్యేక పింఛన్ పథకాన్ని శుక్రవారం బడ్జెట్‌లో ప్రకటించింది. ప్రధానమంత్రి శ్రమ–యోగి మాన్‌ధన్(పీఎంఎస్‌వైఎం) పేరిట అమలు చేసే ఈ పథకంలో కార్మికులకు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.3,000 చొప్పున పింఛన్ అందజేస్తారు. ఇందుకోసం కార్మికులు, ప్రభుత్వం తమ వంతు వాటాగా నెలకు రూ.100 చొప్పున పింఛన్ ఖాతాలో జమ చేయాల్సి ఉం టుంది. ‘‘భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 50 శాతం అసంఘటిత రంగంలోని కార్మికుల శ్రమ నుంచే వస్తోంది.
రిక్షా తొక్కేవారికి, పూట గడవడానికి ఇళ్లలో సేవకులుగా పనిచేస్తున్న వారికి, చిన్నాచితకా కంపెనీల్లో ఉపాధి పొందుతున్న వారికి వృద్ధాప్యంలో సమగ్ర సామాజిక భద్రత కల్పించడం తప్పనిసరి’’అని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అసంఘటిత రంగ కార్మికులు 29 ఏళ్ల వయసులో పీఎంఎస్‌వైఎం పథకంలో చేరొచ్చు. నెలకు కేవలం రూ.100 చొప్పున చెల్లిస్తే 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతినెలా రూ.3,000 చొప్పున పింఛన్ అందుకోవచ్చు. 18 ఏళ్ల వయసులోనే చేరితే నెలకు రూ.55 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. ప్రభుత్వం అంతేమొత్తాన్ని తన వాటాగా ప్రతినెలా కార్మికుల పింఛన్ ఖాతాలో జమ చేస్తుంది.
పీఎంఎస్‌వైఎం పథకం ద్వారా వచ్చే ఐదేళ్లలో 10 కోట్ల మంది కార్మికులు ప్రయోజనం పొందుతారని అంచనా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద పెన్షన్ పథకాల్లో ఇది కూడా ఒకటి అవుతుందని అన్నారు. పీఎంఎస్‌వైఎం పథకానికి తాజా బడ్జెట్‌లో కేంద్రం రూ.500 కోట్లు కేటాయించింది. అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు కేటాయిస్తామని పేర్కొంది. ఈ ఏడాది నుంచే ఈ పథకం అమల్లోకి రానుంది.
దేశవ్యాప్తంగా కార్మికులకు కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లో పలు వరాలు ప్రకటించింది. ప్రతి కార్మికుడికి కనిష్ట పెన్షన్‌ను రూ.1,000 నిర్దేశించింది. అలాగే కార్మికుడు సర్వీసులో ఉండగా మరణిస్తే ఈపీఎఫ్‌వో ప్రస్తుతం రూ.2.5 లక్షలు చెల్లిస్తోంది. కేంద్రం దీన్ని ప్రస్తుతం రూ.6 లక్షలకు పెంచింది. అన్ని కేటగిరీల అంగన్‌వాడీలు, ఆశా యోజన కార్మికుల గౌరవ వేతనాలను 50 శాతం పెంచేసింది. ఉద్యోగాల సృష్టిలో గొప్ప ప్రగతి సాధించామని పీయూష్ గోయల్ వెల్లడించారు.
గత రెండేళ్లలో ఈపీఎఫ్‌వో సభ్యత్వాలు 2 కోట్లు పెరగడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం రూ.10 లక్షల గ్రాట్యుటీపై పన్ను విధిస్తుండగా, దీన్ని రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. అంటే రూ.20 లక్షల గ్రాట్యుటీపై ఎలాంటి పన్ను ఉండదు. ఒక సంస్థలో ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులు పదవీ విరమణ పొందినప్పుడు లేదా ఉద్యోగం మానేసినప్పుడు గ్రాట్యుటీ తీసుకోవడానికి అర్హులని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో అన్ని వర్గాల కార్మికుల కనీస ఆదాయం 42 శాతం పెరిగిందని అన్నారు.
విధివిధానాలేవీ?
అసంఘటిత రంగ కార్మికులకు 60 ఏళ్లు దాటాక నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్ ఇస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ.. ఈ పథకం విధివిధానాలను మాత్రం వెల్లడించలేదు. ఏయే రంగాల్లో, ఎలాంటి పనులు చేసుకునే వారికి ఇస్తారో స్పష్టం చేయలేదు. ఉదాహరణకు 59 ఏళ్ల కార్మికుడు ఒక సంవత్సరంపాటు నెలకు రూ.100 చొప్పున చెల్లిస్తే.. 60 ఏళ్ల వయసు దాటగానే అతడికి పెన్షన్ అందజేస్తారా? అనే దానిపై అనుమానాలున్నాయి. దేశంలో దాదాపు 42 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వీరిలో ఎంతమందికి ప్రయోజనం దక్కుతుందో తెలియదు. పీఎంఎస్‌వైఎం పథకంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
పింఛన్‌తో పాటు.. గౌరవం!
చిన్నచిన్న దుకాణాల్లో, ఇళ్లలో పనిచేస్తూ మనచుట్టూ ఎంతోమంది కనిపిస్తారు. పనిచేసినంతకాలమే వారికి గౌరవమైనా.. ఆదాయమైనా! వయసు మళ్లితే జీవితమే కష్టం. అలాంటి వారికి నెలకు రూ.3వేల చొప్పున పెన్షన్ ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టింది కేంద్రం. ఈ పింఛన్ల కోసం రాజకీయ నాయకుల దగ్గర లైన్లలో నిల్చుని పేర్లు రాయించుకోనక్కర్లేదు. ఎందుకంటే ఇది గౌరవంగా పొందే పింఛను. పని చేసినన్నాళ్లూ వారు నెలకు రూ.55 నుంచి 100 వరకూ నామమాత్రపు మొత్తం చెల్లింస్తే చాలు. అంతేమొత్తాన్ని ప్రభుత్వమూ చెల్లిస్తుంది.
విద్యారంగం
దేశంలో అసంఘటిత రంగంలో పనివారు 42 కోట్లు
తాజా పథకంతో లబ్ధి పొందేవారు 10 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment