
మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన నిర్ణయాలు డిమాండ్‌కు ప్రేరణనివ్వడంతోపాటు దేశ వృద్ధి రేటుకు బలాన్నిస్తాయని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంఘాలు అభిప్రాయపడ్డాయి. కుప్తంగా చూస్తే...
ఈ బడ్జెట్ మొత్తం మీద వినియోగదారుల విశ్వాసాన్ని పెంచుతుంది. బ్రాండెడ్ ఆహార ఉత్పత్తులు, కన్జ్యూమర్ ఉత్పత్తుల డిమాండ్‌కు ఊపునిస్తుంది. ద్రవ్యలోటును 3.4 శాతానికి సవరించడం కొంచెం ఆందోళన కలిగించే అంశం
– సునీల్ దుగ్గల్, డాబర్ ఇండియా సీఈవో
కనీస మద్దతు ధరలు, రైతులకు సంబంధించిన పథకంలో పెట్టుబడులు పెంచడం ద్వారా ఆర్థిక రంగానికి బలాన్నివ్వడం ఆహ్వానించతగినది. పన్ను మినహాయింపు పెంచడం, పన్ను రిటర్నుల ప్రక్రియను సులభతరం చేయడం అన్నవి పన్నుల భారాన్ని తగ్గించడమే కాకుండా పన్నులు చెల్లించే వారి సంఖ్యను కూడా పెంచుతుంది
– సౌగత గుప్తా, మారికో ఎండీ, సీఈవో
ముందుచూపుతో కూడిన బడ్జెట్ ఇది. వినియోగదారుల చేతుల్లో ఖర్చు చేసేందుకు మరిన్ని నిధులు ఉండేలా చేస్తుంది. వీటికితోడు ఇటీవల పలు గృహోపకరణాలపై జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వినియోగదారులు చేసే ఖర్చు కూడా పెరుగుతుంది. ఇది మా రంగంలో డిమాండ్ పెంచుతుంది.
– సునీల్ డిసౌజ, వర్ల్‌పూల్ ఇండియా ఎండీ
2030 నాటికి సమగ్ర ఆరోగ్య, చక్కని ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ‘ఆరోగ్య భారత్’ లక్ష్యాన్ని బడ్జెట్లో పేర్కొనడం ఆసక్తికరం. అయితే, ఈ బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపును పెంచకపోవడం లోటు.
– అజాద్‌మూపెన్, ఆస్గర్ డీఎం హెల్త్‌కేర్ చైర్మన్
నూతన భారత్ కోసం ఉద్దేశించిన బడ్జెట్ ఇది. సమాజంలోని పలు వర్గాలకు సంబంధించి ప్రాధాన్యతల విషయంలో తాత్కాలిక ఆర్థిక మంత్రి సమతుల్యం పాటించారు. ఉద్యోగాల కల్పన, నైపుణ్య అంతరాలను భర్తీ అంశాలను పరిష్కరించేలా ఉంది. పన్ను మినహాయింపులు, తక్కువ ద్రవ్యోల్బణం దేశీయ డిమాండ్‌ను, వినియోగాన్ని పెంచుతాయి. దీంతో వ్యవస్థలో లిక్విడిటీ పెరుగుతుంది
– రితేష్ అగర్వాల్, ఓయో హోటల్స్
అద్భుతమైన బడ్జెట్. దేశంలో అతిపెద్ద వర్గమైన మధ్యతరగతి, రైతులకు, అవ్యవస్థీకృత రంగంలోని పనివారికి ఏదైనా చేసేందుకు ఆర్థిక మంత్రి ప్రయత్నించారు. అదే సమయంలో ద్రవ్యలోటు 3.4 శాతం స్థాయిలోనే కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నారు. ఇది ప్రజానుకూల బడ్జెట్. ఆర్థిక రంగానికి మేలు చేస్తుంది.
– అజయ్ సింగ్, స్పైస్‌జెట్ చైర్మన్, ఎండీ
స్టార్టప్‌ల్లో పెట్టుబడులపై ఏంజెల్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని, జీఎస్‌టీ సంబంధించి మరింత స్పష్టత ఇవ్వాలన్న పరిశ్రమ విజ్ఞప్తులకు ఈ బడ్జెట్‌లో చోటు కల్పించలేదు. అయితే, తగిన చర్చల ద్వారా వీటిని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం
– ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్
రెండు హెక్టార్ల భూమి (ఐదెకరాల్లోపు) ఉన్న రైతులకు ఏడాదికి రూ.6,000 ఇవ్వాలన్న పథకం లక్షలాది మంది పత్తి రైతులకు మేలు చేస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం వారికి చేయూతనిస్తుంది
– పి.నటరాజ్, చైర్మన్ సదరన్ ఇండియా మిల్స్ అసోసియేషన్
బడ్జెట్ ప్రకటనలు స్టీల్ రంగానికి మొత్తం మీద సానుకూలం. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మధ్యంతర బడ్జెట్‌లోనూ చోటు కల్పించారు. రైల్వేలు, రోడ్లు, జలమార్గాలు వృద్ధికి కీలకం
– ఏకే చౌదరి, సెయిల్ చైర్మన్
2030 నాటికి వాహన కాలుష్య రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని స్వాగతిస్తున్నాం. పర్యావరణ అనుకూల వాహనాల విషయంలో ప్రభుత్వం తొలిసారిగా తన నిబద్ధతను ప్రకటించింది. తాజా ప్రకటనతో ఈ రంగంలో అనిశ్చితి తొలిగినట్టయింది. ఫేమ్–2 ప్రకటన కోసం ఆతృతగా పరిశ్రమ ఎదురుచూస్తోంది.
– ఎన్.నాగసత్యం, ఈడీ, ఓలెక్ట్రా గ్రీన్‌టెక్
క్రెడిట్ నెగెటివ్ ...
ఆదాయం పెంచే ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు లేకుండా అధిక ఖర్చులకు దారితీసే పలు చర్యలు ద్రవ్యోలోటు పెరిగేందుకు దారితీస్తాయి. ఇది సార్వభౌమ క్రెడిట్ రేటింగ్‌కు పెద్ద ప్రతికూలం. 2020లోనూ ద్రవ్యలోటు 3.4 శాతాన్ని చేరుకోవడం కష్టమే. వరుసగా ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోలేకపోవడాన్ని మేము క్రెడిట్ నెగెటివ్‌గానే చూస్తాం
– రేటింగ్ ఏజెన్సీ మూడిస్
Comments
Please login to add a commentAdd a comment