
శుక్రవారం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్, చిత్రంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, సుష్మ, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ
పార్లమెంటులో కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన పీయూష్ గోయల్ (54) మోదీ ప్రభుత్వం అమలు పరిచిన ఆర్థిక సంస్కరణలన్నింటికీ సూత్రధారి. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అనారోగ్య కారణంగా తాత్కాలిక ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టిన గోయల్ ఆ హోదాలోనే ‘మధ్యంతర’బడ్జెట్ ప్రవేశపెట్టారు. చార్టెర్డ్ అకౌంటెంట్‌గా, న్యాయ విద్యార్థిగా అత్యున్నత ప్రతిభా పాటవాలు చూపిన గోయల్ 2014 ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల ప్రచారం ద్వారా ఎన్‌డీఏ విజయానికి దారులు వేశారు. విపత్కర సమయాల్లో నేనున్నానంటూ ముందుకొచ్చి పార్టీని, ప్రభుత్వాన్ని ఆదుకున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు పని చేస్తూ ‘పని రాక్షసుడి’గా పేరుపడ్డారు. రైల్వే మంత్రిగా బులెట్ రైళ్లు, స్పీడ్ రైళ్లతో భారతీయ రైల్వేను పరుగులు పెట్టిస్తున్నారు. రైల్వేల ఆధునీకరణ, ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేశారు. మోదీ ప్రభుత్వం అమలు చేసిన నిరంతర విద్యుత్, స్వచ్ఛ ఇంధనం, ఉదయ్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన వంటి పథకాల రూపకర్త గోయలే. దేశంలోని 5,97,464 గ్రామాలను పూర్తిగా విద్యుదీకరించినందుకుగాను గోయల్‌కు రెండు రోజుల క్రితమే పెన్సిల్వేనియా వర్సిటీ కర్నాట్ బహుమతిని ప్రదానం చేసింది.
అంచెలంచెలుగా..
స్వతంత్ర ప్రతిపత్తి గల సహాయ మంత్రిగా మోదీ మంత్రివర్గంలో చేరిన గోయల్ తన శక్తిసామర్థ్యాలను నిరూపించుకుని అనతికాలంలోనే కేబినెట్ స్థాయికి ఎదిగారు. బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రిగా బొగ్గు గనుల వేలాన్ని పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించారు. ఉజ్వల పథకం కింద దేశంలో ఎల్‌ఈడీ బల్బుల వినియోగాన్ని పెంచి కరెంటు ఖర్చు తగ్గించారు. త్వరగా, వినూత్నంగా నిర్ణయాలు తీసుకుంటారని పేరున్న గోయల్‌కు జ్ఞాపకశక్తి అపారం. సీఏలో ఆలిండియా రెండో ర్యాంకు సాధించారు. న్యాయవిద్యలో ముంబై యూనివర్సిటీలోనే సెకండ్ ర్యాంకు సంపాదించారు. స్టేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా డైరెక్టర్ల బోర్డుల్లో పని చేశారు. కేంద్ర మంత్రి వర్గంలో చేరే నాటికి గోయల్ బీజేపీ కోశాధికారిగా ఉన్నారు. ఆయన తర్వాత పార్టీ మరెవరినీ కోశాధికారిగా నియమించకపోవడం గమనార్హం. కార్పొరేట్ వర్గాలతో సన్నిహిత సంబంధాలున్న పీయూష్ గోయల్ తన 34 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రభుత్వానికి ఎన్నో విజయాలు సాధించి పెట్టారు. గోయల్ తండ్రి వేద్ ప్రకాశ్ గోయల్ బీజేపీ జాతీయ కోశాధికారిగా, కేంద్రంలో మంత్రిగా పని చేశారు. తల్లి చంద్రకాంత గోయల్ మహారాష్ట్ర శాసనసభకు మూడుసార్లు ఎన్నికయ్యారు.
నాలుగు నెలలకు రూ.34.17 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వచ్చే ఏప్రిల్ నుంచి నూతన ఆర్థిక సంవత్సరం (2019–20)లో మొదటి నాలుగు నెలల కాలానికి గాను (ఏప్రిల్ నుంచి జూలై వరకు) రూ.34.17 లక్షల కోట్ల వ్యయాల కోసం కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ద్వారా పార్లమెంట్ అనుమతి కోరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి స్థూల వ్యయాలు రూ.97.43 లక్షల కోట్లుగా మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అంచనాలను పేర్కొన్నారు. మొదటి నాలుగు నెలల కాలానికి అయ్యే వ్యయాలకు గాను పార్లమెంటు ఆమోదం కోరారు. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్–మే నెలల్లో పూర్తవుతాయి. తదుపరి ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను వచ్చే జూలైలో కొత్త ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించనుంది.
Comments
Please login to add a commentAdd a comment