‘రియల్’ రచ్చ!
టీడీపీలో సరికొత్త రచ్చకు తెరలేచింది. జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటుచేస్తామని సాక్షాత్తు సీఎం చంద్రబాబు ప్రకటించడంతో తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో టీడీపీ నేతలు భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఆ సంస్థలు ఏర్పాటైతే.. వాటి పేరు చెప్పి రియల్ వెంచర్లు వేసి భారీగా సొమ్ముచేసుకోవడానికి ఎత్తు వేశారు. ఇప్పుడు ఆ సంస్థలు తాము కొనుగోలు చేసిన భూముల పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటుచేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో రాష్ట్రంలో 11 జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఏర్పాటుచేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆ మేరకు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎయిమ్స్, ఐఐటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం మాత్రమే మంజూరు చేశారు. వాటి ఏర్పాటుకు నిధులు కేటాయించారు.
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తిరుపతి పరిసర ప్రాంతాల్లో సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐటీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), ఐఐఎస్‌ఈఆర్(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్) క్యాంపస్‌లు ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఆ విద్యా సంస్థలు ఏర్పాటుచేస్తే.. భూములకు భారీ ఎత్తున డిమాండ్ పెరిగితే రియల్ వెంచర్లు వేసి సొమ్ము చేసుకోవచ్చని టీడీపీ నేతలు భావించారు. ఇదే అదునుగా ఏర్పేడు-శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గంలో తిరుపతి-మదనపల్లె రోడ్డు, తిరుపతి-చిత్తూరు రోడ్డు పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారు.
కేంద్ర బడ్జెట్లో ఐఐటీ, ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మాత్రమే మంజూరు కావడంతో టీడీపీ నేతలకు గొంతులో వెలక్కాయపడ్డట్లయింది. ఐఐటీని తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలని ఇటీవల మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాళహస్తి-ఏర్పేడు మండలాల్లోని మేర్లపాక, పాగాలి, పంగూరు, చిందేపల్లి, చింతలపాళెం, పల్లాం, ఎంపేడు ప్రాంతాల్లో భారీ ఎత్తున ప్రభుత్వ భూములు ఉన్నాయని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెబుతున్నారు.
రేణిగుంట విమానాశ్రయం, జాతీయ రహదారులు, తెలుగుగంగ జలాలు అందుబాటులో ఉండడం వల్ల ఈ ప్రాంతమే ఐఐటీ ఏర్పాటుకు అనుకూలమని బొజ్జల వాదిస్తున్నారు. బొజ్జల వాదనను మెజార్టీ టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో తిరుపతి-చిత్తూరు, తిరుపతి-మదనపల్లె రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఐఐటీని ఏర్పాటుచేయాలని పట్టుబడుతున్నారు.
రేణిగుంట విమానాశ్రయంతోపాటు జాతీయ రహదారులు ఈ ప్రాంతానికి అందుబాటులో ఉంటాయని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలో గురువారం రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కలెక్టర్ సిద్ధార్థజైన్, జేసీ శ్రీధర్‌తో కలిసి శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో పర్యటించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మేర్లపాక, పాగాలి, పంగూరు, చిందేపల్లి, చింతలపాళెం, పల్లాం, ఎంపేడు గ్రామాలనూ.. చంద్రగిరి నియోజకవర్గంలోని రంగంపేట గ్రామ పరిసర ప్రాంతాల్లోని భూములను పరిశీలించారు.
ఐఐటీ ఏర్పాటుకు 300 ఎకరాలు, ఐఐఎస్‌ఈఆర్‌కు 200 ఎకరాలు, సెంట్రల్ వర్సిటీకి 500 ఎకరాలు అవసరం. ప్రస్తుతం ఐఐటీ ఒక్కటే మంజూరైన నేపథ్యంలో ఆ కేంద్రాన్ని తమ ప్రాంతంలోనే ఏర్పాటుచేయాలంటూ టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. బొజ్జల, బొజ్జలను వ్యతిరేకిస్త్తున్న వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో పంచాయితీ సీఎం వద్దకు వెళ్లినట్లు రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫలానా ప్రాంతంలోనే ఐఐటీ ఏర్పాటుచేయాలని సూచిస్తే.. ఆ సంస్థ యాజమాన్యం అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
ప్రభుత్వం ఎంపిక చేసిన భూములను ఐఐటీ యాజమాన్య ప్రతినిధి బృందం పరిశీలిస్తుంది. విమాన, రోడ్డు సౌకర్యాలు, నీటి లభ్యత, భద్రత మెరుగ్గా ఉన్న ప్రాంతంలోనే ఐఐటీ ఏర్పాటు చేస్తారు. ఐఐటీ ప్రతినిధి బృందం పరిశీలించి.. ఆమోదముద్ర వేసిన ప్రాంతంలోనే ఆ సంస్థను నెలకొల్పుతారన్నది తెలుగుతమ్ముళ్లకు తెలియంది కాదని, ఒత్తిడి తేవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అధికారవర్గాలు తెగేసి చెబుతుండడం గమనార్హం.