రేపటి నుంచి జేఈఈ మెయిన్స్‌ | JEE Mains from tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి జేఈఈ మెయిన్స్‌

Published Mon, Jan 7 2019 5:04 AM | Last Updated on Mon, Jan 7 2019 5:04 AM

JEE Mains from tomorrow - Sakshi

సాక్షి, అమరావతి : ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ఐఐటీ, ఇతర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థ (జీఎఫ్‌టీఐ)ల్లో ప్రవేశాల కోసం ఈ నెల 8 నుంచి 12 వరకు జేఈఈ మెయిన్‌ ప్రవేశపరీక్ష నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాట్లు చేసింది. నాలుగు రోజులపాటు జరిగే ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లో ప్రతీరోజూ రెండు విడతలుగా నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 263 పట్టణాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 9.65 లక్షల మంది హాజరుకానుండగా అందులో రాష్ట్రం నుంచి దాదాపు 65 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, బాపట్ల, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయనగరం పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఎన్‌టీఏ ఏర్పాటుచేసింది. ఇప్పటివరకు ఏటా ఒకసారి చొప్పున జేఈఈ మెయిన్‌ పరీక్షను సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిర్వహిస్తుండగా.. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఎన్‌టీఏ ఏటా రెండుసార్లు పరీక్ష నిర్వహించేలా షెడ్యూల్‌ జారీచేసింది. ఇందులో భాగంగా ఈ నెలలో మొదటి విడత పరీక్షను నిర్వహిస్తోంది. రెండో విడత పరీక్షను ఏప్రిల్‌లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది.

పరీక్షా కేంద్రాల మార్పు ఉండదు
విద్యార్థులు తమకు కేటాయించిన కేంద్రంలోనే పరీక్ష రాయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రం మార్పు ఉండబోదని ఎన్‌టీఏ స్పష్టంచేసింది. విద్యార్థులు తప్పుడు సమాచారం ఇచ్చినా, ఒక షిఫ్ట్‌కు బదులు రెండో షిఫ్ట్‌లో లేదా వేర్వేరు రోజుల్లో రెండుస్లారు పరీక్ష రాసినా వారి దరఖాస్తులను తిరస్కరిస్తామని.. వారి ఫలితాలను పరిగణనలోకి తీసుకోబోమని తేల్చిచెప్పింది. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాల్సిందేనని, ఆ తర్వాత వచ్చే విద్యార్థులను అనుమతించబోమని ఎన్‌టీఏ పేర్కొంది. పరీక్ష ఫలితాలను ఈ నెల 31న వెల్లడించనున్నట్లు తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement