సాక్షి, న్యూఢిల్లీ : ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషణ్ (జేఈఈ), అండర్ గ్రాడ్యువేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)లను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెల్సిందే. ఓ పక్క దేశంలో ప్రాణాంతక కోవిడ్–19 కేసులు విజృంభిస్తోంటే ఈ పరీక్షలు నిర్వహించడం ఏమిటని కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు, పలు విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది విద్యార్థుల ప్రాణాలతో చెలగాడం ఆడడమేనని విమర్శిస్తున్నాయి. విద్యార్థులు తమ విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోరాదనే సదుద్దేశంతోనే పరీక్షల నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్రం వాదిస్తోంది. ఆ వాదనలో నిజం ఎంత ? ఒకరి నుంచి ఒకరికి కరోనా వైరస్ సోకకుండా భౌతిక దూరం పాటించేంత మౌలిక సౌకర్యాలు మన విద్యాలయాల్లో ఉన్నాయా ? తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రవేశ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం మన విద్యారంగానికి ఉందా? పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కరోనా వైరస్ నుంచి ముప్పు ఉండదని కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం భరోసా ఇవ్వగలదా?డజన్ల సంఖ్యలో, కొన్ని సార్లు వందకు మించి విద్యార్థులు ఒకే గదిలో కూర్చొని పరీక్షలు రాయడం మనం చూశాం.(చదవండి : నీట్ 2020 అడ్మిట్ కార్డ్ విడుదల)
వేల సంఖ్యలో విద్యార్థులు పరీక్షలు రాసినప్పుడే ఈ పరిస్థితులు కనిపిస్తాయి. ఇక నీట్‌కు, జేఈఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే పరీక్ష గదులు లేదా హాళ్లు ఎంతగా కిక్కిర్సి పోతాయో సులభంగానే ఊహించవచ్చు. ఈ రెండు పరీక్షలకు కలిపి దాదాపు 25 లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు. ఇవి ముఖ్యమైన వృత్తిపరమైన ప్రవేశ పరీక్షలు అవడం వల్ల కోవిడ్ లక్షణాలున్న అభ్యర్థులు కూడా పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది. వారి ద్వారా సహచర విద్యార్థులకు కోవిడ్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారి ద్వారా, వారి తల్లిదండ్రులకు, వారి తల్లిదండ్రులకు సోకే అవకాశాలు ఉంటాయి. అదే జరిగితే సమాజంలో కోవిడ్ కేసులు కోకొల్లలుగా పెరిగే ప్రమాదం ఉంది.
ఇలాంటి పరీక్షలకు ఒక్క నిమిషం దాటినా, మూడు నిమిషాలు దాటినా అనుమతించేది లేదంటూ పరీక్షల నిర్వహణాధికారులు తరచు హెచ్చరించడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటప్పుడు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకుండా ఇప్పుడు ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు ఎలా హాజర కాగలరు? ప్రైవేటు వాహనాలను పట్టుకొని రాగలరా? వాటిలో గుంపులుగా ప్రయాణించడం వల్ల కరోనా సోకే ప్రమాదం ఉండదా? మూడు, నాలుగు వందల మంది హాజరయ్యే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు భయపడిన కేంద్ర ప్రభుత్వం, తరచుగా పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేస్తూ వస్తోంది. అలాంటిది పాతిక లక్షల మంది హాజరయ్యే పరీక్షలను సురక్షితంగా ఎలా నిర్వహించగలదు ? వలస కార్మికులను దృష్టిలో పెట్టుకోకుండా కేంద్ర ప్రభుత్వం తొందర పడి గత మార్చి 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేసినట్లే అవుతుంది. నాటి తొందరపాటు నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 950 మంది అన్యాయంగా మృత్యువాత పడ్డారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు తొందరపడితే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment