JEE Mains 2021 Exams: Know About Timings And Dates, Exam Pattern, Marks Details - Sakshi
Sakshi News home page

రేపట్నుంచి జేఈఈ మెయిన్‌.. తొలిసారి తెలుగులో

Published Mon, Feb 22 2021 12:22 AM | Last Updated on Mon, Feb 22 2021 6:23 PM

JEE Main 2021 To Be Conducted From February 23rd - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, జీఎఫ్‌టీఐలలో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ మొదటి సెషన్‌ పరీక్షలు ఈ నెల 23న ప్రారంభం కానున్నాయి. 2021–22 విద్యా సంవత్సరంలో బీఈ/బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలను నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఈ నెలతోపాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మొత్తంగా నాలుగు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఏ సెషన్‌లోనైనా పరీక్షలు రాసుకునేలా, అన్నింటిలో ఉత్తమ స్కోర్‌ ఏది వస్తే దానినే పరిగణనలోకి తీసుకునేలా చర్యలు చేపట్టింది. ఇంగ్లిష్‌ మాత్రమే కాకుండా మొదటిసారిగా 12 భాషల్లో పరీక్షలను నిర్వహించనుంది.

తెలుగులో పరీక్షలు రాసేందుకు 374 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో జేఈఈ మెయిన్‌ నిర్వహించినప్పుడు 10 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరవగా ఈసారి ఫిబ్రవరి 23, 24, 25, 26 తేదీల్లో జరిగే మొదటి సెషన్‌లో 6,61,761 మంది పరీక్ష రాయనున్నారు. ఇంకా మూడు సెషన్లలో పరీక్షలు రాసే అవకాశం ఉండటంతో ఫిబ్రవరి సెషన్‌లో పరీక్షలు రాసే వారి సంఖ్య తగ్గింది. ఇక మార్చి 15, 16, 17, 18 తేదీల్లో రెండో సెషన్‌ పరీక్షలు, ఏప్రిల్‌ 27, 28, 29, 30 తేదీల్లో మూడో సెషన్‌ పరీక్షలు, మే 24, 25, 26, 27, 28 తేదీల్లో నాలుగో సెషన్‌ పరీక్షలు జరగనున్నాయి. మేలో సీబీఎసీఈ 12వ తరగతి పరీక్షలు ఉన్నందున జేఈఈ మెయిన్‌ పరీక్ష తేదీల్లోనే ఎవరైనా విద్యార్థులకు 12వ తరగతి పరీక్ష ఉంటే విద్యార్థులు తెలియజేయాలని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. ఈ నెల 23 నుంచి 26 వరకు జరిగే మొదటి సెషన్‌ జేఈఈ మెయిన్‌ పరీక్షలకు హాజరయ్యేందుకు నాలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

అందులో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉండగా మూడో స్థానంలో తెలంగాణ ఉంది. ఏపీ విద్యార్థులు 87,797 మంది దరఖాస్తు చేసుకోగా తెలంగాణ నుంచి 73782 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల కోసం తెలంగాణలో 12 కేంద్రాలను, ఏపీలో 20 కేంద్రాలను ఎన్‌టీఏ ఏర్పాటు చేసింది. తెలంగాణ పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, నిజమాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేటలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. అలాగే ఏపీ పరిధిలో అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెంలో ఏర్పాటు చేశారు. 

పరీక్ష విధానం ఇలా.. 
ఈసారి కరోనా కారణంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఎన్‌టీఏ అదనంగా 15 ప్రశ్నలు ఇస్తోంది. మొత్తంగా 90 ప్రశ్నలు ఇవ్వనుండగా అందులో విద్యార్థులు 75 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. బీఈ/బీటెక్‌ పరీక్షను తీసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో సెక్షన్‌–ఏ, సెక్షన్‌–బీ ఉంటాయి. సెక్షన్‌–ఏలో 20 ప్రశ్నలు ఉంటాయి. మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉండే వాటన్నింటికీ సమాధానాలు రాయాలి. ప్రతి తప్పుడు సమాధానానికి ఒక మార్కు కోత పడుతుంది. సెక్షన్‌–బీలో నెగెటివ్‌ మార్కులు ఉండవు. ప్రతి సబ్జెక్టులో 10 చొప్పున న్యూమరికల్‌ వ్యాల్యూ జవాబుగా ఉండే ప్రశ్నలు ఇస్తారు. అందులో 5 చొప్పున ప్రశ్నలకు సమాధానం రాయాలి.  

ఇదీ పరీక్షల సమయం... 
ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో రోజూ రెండు షిఫ్ట్‌లలో ఆన్‌లైన్‌ పరీక్షలు 
మొదటి షిఫ్ట్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.  
రెండో షిఫ్ట్‌ పరీక్ష మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. 
కచ్చితంగా అరగంట ముందే పరీక్ష కేంద్రంలో ఉండాలి. పరీక్ష ప్రారంభ సమయం తరువాత విద్యార్థులను అనుమతించరు. 
మొదటి షిఫ్ట్‌ పరీక్షకు విద్యార్థులను ఉదయం 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు పరీక్ష కేంద్రం, హాల్లోకి అనుమతిస్తారు.  
రెండో షిఫ్ట్‌ పరీక్షకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:30 గంటల వరకు అనుమతిస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement