సాక్షి, హైదరాబాద్: ఇంటర్‌లో చేరిన విద్యార్థుల్లో చాలా మంది జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు సాధించడంపై దృష్టిపెడతారు. ఆ లక్ష్యంతోనే చివరి వరకూ జేఈఈపై పట్టుకోసం ప్రయత్నిస్తారు. కొందరు సఫలమవుతారు. సాధారణంగా జేఈఈ మెయిన్స్ ర్యాంకు సాధించిన ప్రతీ ఒక్కరూ ఐఐటీ తర్వాత ఎన్‌ఐటీల్లో సీట్లు కోరుకుంటారు.
ఆ తర్వాత ప్రాధాన్యమిచ్చేది ట్రిపుల్ ఐటీ (ఐఐఐటీ)లకే. వీటిల్లో ఎంత వరకు ర్యాంకువారికి సీటొస్తుంది? ఏ బ్రాంచ్‌కు ఎంత ర్యాంకు వరకు ప్రాధాన్యత ఇవ్వొచ్చనే సందేహాలు చాలా మంది విద్యార్థుల్లో ఉంటున్నాయి. ప్రాథమిక ర్యాంకుల అంచనాను ఎన్‌టీఏ వెల్లడించకపోవడం కూడా విద్యార్థుల గందరగోళానికి కారణమవుతుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్నేళ్లుగా ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీ ర్యాంకుల కటాఫ్‌లను గమనిస్తే సులువుగా అవగాహన వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఎంత వరకు అవకాశం?
దేశవ్యాప్తంగా 11 ట్రిపుల్ ఐటీలు జేఈఈ ర్యాంకు ద్వారా సీట్లు కేటాయిస్తున్నాయి. వీటన్నింటిలో కలిపి మొత్తం 6,146 ఇంజనీరింగ్ సీట్లున్నాయి. బాలికలకు ప్రత్యేకంగా కేటాయించే సూపర్ న్యూమరరీ సీట్లు మరో 305 వరకు ఉంటాయి. మొత్తంగా రిజర్వేషన్లను అనుసరించి సీట్లు కేటాయిస్తారు. గత ఏడాది ఓపెన్ కేటగిరీలో బాలురకు 35వేల ర్యాంకు వరకు, బాలికలకు 40వేల ర్యాంకు వరకు సీట్లు దక్కాయి. ఓబీసీ, నాన్ క్రీమీలేయర్ కేటగిరీలో 60వేల ర్యాంకు వరకు సీఎస్సీలో, 65వేల ర్యాంకు వరకు ఈసీఈలో సీట్లు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 2.5లక్షల ర్యాంకు వరకు ట్రిపుల్ ఐటీల్లో సీట్లు లభించాయి.
ఆప్షన్ల ఎంపికే కీలకం
జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సెప్టెంబర్ 12 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ సమయంలో ఆప్షన్ల ఎంపికే కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. నిట్, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సంస్థల్లో ఏ ర్యాంకు వరకూ సీటు వస్తుందనే అవగాహనతోపాటు ట్రిపుల్ ఐటీల్లో సీటుకు కావాల్సిన ర్యాంకులను తెలుసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఆ ర్యాంకులకు అనుగుణంగా ఆప్షన్లు ఇచ్చుకుంటే.. సులువుగా సీటు పొందే వీలు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. వచ్చిన ర్యాంకుకు తగిన చోట సీటు లభించే ఆప్షన్లను ముందుగా ఎంచుకోవాలని.. లేకుంటే సీటు నష్టపోయే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.
తగిన వ్యూహం అవసరం
ట్రిపుల్ ఐటీ సీట్లు పొందాలనుకునే వారు ర్యాంకుల ఆధారంగా ఆప్షన్లు ఇవ్వడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. జేఈఈ మెయిన్స్ అర్హులంతా ట్రిపుల్ ఐటీ బరిలో ఉండటం సహజమే. అయితే వచ్చిన ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుందనే అంచనాకు రాగలితే ప్రయోజనకరంగా ఉంటుంది.
– ఎంఎన్ రావు, గణిత శాస్త్ర నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment