హల్లులతో వినూత్నంగా పాప్–అప్ పుస్తకం
కళాక్షరిక పేరుతో పుస్తకం తయారీ
అక్షరాల్లో బొమ్మలు కనిపించేలా అచ్చుల పుస్తకం రూపకల్పన
సాక్షి, సిటీ బ్యూరో: నవ మాసాలు తన కడుపులో బిడ్డను మోసి ప్రాణం పోస్తుంది అమ్మ. ఆ బిడ్డకు తొలిగురువు అమ్మే అవుతుంది.. చిట్టి పలుకులు... బుజ్జి మాటలు నేర్పిస్తుంది.. అందుకే మనం మాట్లాడే భాషను అమ్మ భాషగా పరిగణిస్తాం... అదే ఒక భాషకు లిపి కావాలంటే వందల ఏళ్లు పడుతుంది. ఒక స్త్రీ బిడ్డకు జన్మనిచ్చినప్పుడే ఆమె జన్మ పరిపూర్ణమైనట్టు.. ఒక భాషకు లిపి రూపుదిద్దుకుంటేనే ఆ భాషకు పరిపూర్ణత వస్తుంది.
అలా లిపి ఉన్న మన తెలుగు భాషకు, లిపికి వేల ఏళ్ల చరిత్ర ఉంది.. మానవుడు ఎన్నో మార్పులకు లోనైనట్టే.. మన తెలుగు లిపిలో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కాలక్రమంలో కొన్ని అక్షరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పటికే కొన్ని అక్షరాలు వాడుకలో లేవు. అంతరించి పోయే ప్రమాదం ఉన్న అక్షరాల్లో తెలుగు లిపి ముందు వరుసలో ఉంది. దీనికి కారణాలు అనేకం. ఆ విశేషాలు తెలుసుకుందాం..
తెలుగు లిపికి ప్రాణం పోస్తున్న ఆర్కిటెక్ట్..
ప్రమాదంలో ఉన్న తెలుగు లిపిని బతికించుకునేందుకు ఇప్పటికే అనేక మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ఒకరే శశి గూడూరు. తెలుగు లిపిని పిల్లలతో పాటు భవిష్యత్తు తరాలకు గుర్తుండి పోయేలా ప్రయత్నిస్తున్నారు ఆయన. అందుకోసం వినూత్నంగా అచ్చులు, హల్లులతో కూడిన పుస్తకాలను రూపొందించారు. ముఖ్యంగా పుస్తకం తెరవగానే అక్షరాలు త్రీడీ రూపంలో పాప్–అప్ అయ్యేలా తయారు చేశారు.
చెరగని ముద్ర వేసేలా..
టైపోవనం వ్యవస్థాపకుడు శశి గూడూరుకు తెలుగు భాషపై మక్కువ ఎక్కువ. మాతృభాషపై ఆయనకున్న మమకారంతో కళాక్షరిక అనే పుస్తకాన్ని రూపొందించారు. డిజైనింగ్‌లో ఆయనకున్న నైపుణ్యం మొత్తాన్ని రంగరించి దీన్ని తీసుకొచ్చారు. ‘క’అక్షరం నుంచి ‘క్ష’వరకూ తెలుగు హల్లులు పుస్తకం తెరవగానే పాప్–అప్ అవుతాయి. తెలుగులో ఇలాంటి పుస్తకం రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఆ సందేశమే ప్రేరణ...
ఆన్‌లైన్‌లో ఒక త్రీడీ కార్డు దొరికిందని, అందులో గుర్రం బొమ్మ ముందుకు దూసుకొస్తున్నట్టు ఉందని, అప్పుడే ఈ పుస్తకం తయారు చేయాలనే ఆలోచన వచ్చిందని వివరించారు. ఇంగ్లి‹Ùలో ఇలాంటి ప్రయోగాలు చేశారని, అందుకే తెలుగులోనూ ఇలా ఎందుకు తయారు చేయకూడదనే సంకల్పంతో ఈ బుక్‌ను తీసుకొచ్చానని చెప్పారు.
ముఖ్యంగా ‘ఱ’అక్షరం వాడకం పూర్తిగా తగ్గిపోయిందని, ఆ అక్షరాన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేశానని, పుస్తకం తెరవగానే మళ్లీ ఉద్భవిస్తున్నట్టు రూపకల్పన చేశానని శశి చెప్పుకొచ్చారు. ఐఐటీ బాంబేలో విజువల్ కమ్యూనికేషన్స్‌లో పీజీ చేసే సమయంలో తెలుగుపై ఇష్టం పెరిగిందని చెప్పుకొచ్చారు. తెలుగు అక్షరాలు చిన్నపిల్లలతో పాటు, పెద్ద వారి మనసులోనూ చెరగని ముద్ర వేయాలన్న కోరికతోనే పాప్–అప్ పుస్తకాన్ని రూపొందించారు.
తెలుగు అక్షరాలు ఎంతో అందమైనవి...
తెలుగు అక్షరాలు ఎంతో అందమైనవని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని శశి గూడూరు చెప్పారు. తెలుగులో పలు రకాల ఫాంట్లు డిజైన్ చేశారు. అనేక డిజైన్లు రూపొందించారు. అచ్చుల్లో బొమ్మలు ప్రతిబింబించేలా శశి తయారు చేసిన పుస్తకానికి ఎంతో ప్రాచుర్యం లభించింది. యువతలో తెలుగుపై క్రేజ్ పెరిగేందుకు టీషర్టులపై తెలుగులో అక్షరాలను వినూత్నంగా డిజైన్ చేసి ప్రింట్ చేస్తున్నారు. అంతేకాకుండా బ్యాగులపై కూడా ఆలోచనాత్మకంగా డిజైన్లు రూపొందించి, అవగాహన కల్పిస్తున్నారు.
పలు లోగోల రూపకల్పన..
తెలుగు భాష పునరుజ్జీవనానికి కృషి చేస్తున్న శశి గూడూరు.. తెలంగాణ ప్రభుత్వానికి కూడా తన సేవలందించారు. టీ–శాట్, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్, తెలంగాణ పర్యాటక శాఖ లోగోలను శశి గూడూరు రూపొందించారు. అలాగే తెలుగులో ఐదు రకాల ఫాంట్లను తయారు చేశారు. తనకు చేతనైనంతగా తెలుగుకు సేవ చేస్తున్నానని, భవిష్యత్తులో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటానని శశి గూడూరు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment