Telugu language development
-
'అమ్మ భాష'కు.. పాప్ అప్!
సాక్షి, సిటీ బ్యూరో: నవ మాసాలు తన కడుపులో బిడ్డను మోసి ప్రాణం పోస్తుంది అమ్మ. ఆ బిడ్డకు తొలిగురువు అమ్మే అవుతుంది.. చిట్టి పలుకులు... బుజ్జి మాటలు నేర్పిస్తుంది.. అందుకే మనం మాట్లాడే భాషను అమ్మ భాషగా పరిగణిస్తాం... అదే ఒక భాషకు లిపి కావాలంటే వందల ఏళ్లు పడుతుంది. ఒక స్త్రీ బిడ్డకు జన్మనిచ్చినప్పుడే ఆమె జన్మ పరిపూర్ణమైనట్టు.. ఒక భాషకు లిపి రూపుదిద్దుకుంటేనే ఆ భాషకు పరిపూర్ణత వస్తుంది.అలా లిపి ఉన్న మన తెలుగు భాషకు, లిపికి వేల ఏళ్ల చరిత్ర ఉంది.. మానవుడు ఎన్నో మార్పులకు లోనైనట్టే.. మన తెలుగు లిపిలో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కాలక్రమంలో కొన్ని అక్షరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పటికే కొన్ని అక్షరాలు వాడుకలో లేవు. అంతరించి పోయే ప్రమాదం ఉన్న అక్షరాల్లో తెలుగు లిపి ముందు వరుసలో ఉంది. దీనికి కారణాలు అనేకం. ఆ విశేషాలు తెలుసుకుందాం..తెలుగు లిపికి ప్రాణం పోస్తున్న ఆర్కిటెక్ట్..ప్రమాదంలో ఉన్న తెలుగు లిపిని బతికించుకునేందుకు ఇప్పటికే అనేక మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ఒకరే శశి గూడూరు. తెలుగు లిపిని పిల్లలతో పాటు భవిష్యత్తు తరాలకు గుర్తుండి పోయేలా ప్రయత్నిస్తున్నారు ఆయన. అందుకోసం వినూత్నంగా అచ్చులు, హల్లులతో కూడిన పుస్తకాలను రూపొందించారు. ముఖ్యంగా పుస్తకం తెరవగానే అక్షరాలు త్రీడీ రూపంలో పాప్–అప్ అయ్యేలా తయారు చేశారు.చెరగని ముద్ర వేసేలా.. టైపోవనం వ్యవస్థాపకుడు శశి గూడూరుకు తెలుగు భాషపై మక్కువ ఎక్కువ. మాతృభాషపై ఆయనకున్న మమకారంతో కళాక్షరిక అనే పుస్తకాన్ని రూపొందించారు. డిజైనింగ్‌లో ఆయనకున్న నైపుణ్యం మొత్తాన్ని రంగరించి దీన్ని తీసుకొచ్చారు. ‘క’అక్షరం నుంచి ‘క్ష’వరకూ తెలుగు హల్లులు పుస్తకం తెరవగానే పాప్–అప్ అవుతాయి. తెలుగులో ఇలాంటి పుస్తకం రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ఆ సందేశమే ప్రేరణ... ఆన్లైన్లో ఒక త్రీడీ కార్డు దొరికిందని, అందులో గుర్రం బొమ్మ ముందుకు దూసుకొస్తున్నట్టు ఉందని, అప్పుడే ఈ పుస్తకం తయారు చేయాలనే ఆలోచన వచ్చిందని వివరించారు. ఇంగ్లి‹Ùలో ఇలాంటి ప్రయోగాలు చేశారని, అందుకే తెలుగులోనూ ఇలా ఎందుకు తయారు చేయకూడదనే సంకల్పంతో ఈ బుక్‌ను తీసుకొచ్చానని చెప్పారు.ముఖ్యంగా ‘ఱ’అక్షరం వాడకం పూర్తిగా తగ్గిపోయిందని, ఆ అక్షరాన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేశానని, పుస్తకం తెరవగానే మళ్లీ ఉద్భవిస్తున్నట్టు రూపకల్పన చేశానని శశి చెప్పుకొచ్చారు. ఐఐటీ బాంబేలో విజువల్ కమ్యూనికేషన్స్‌లో పీజీ చేసే సమయంలో తెలుగుపై ఇష్టం పెరిగిందని చెప్పుకొచ్చారు. తెలుగు అక్షరాలు చిన్నపిల్లలతో పాటు, పెద్ద వారి మనసులోనూ చెరగని ముద్ర వేయాలన్న కోరికతోనే పాప్–అప్ పుస్తకాన్ని రూపొందించారు.తెలుగు అక్షరాలు ఎంతో అందమైనవి... తెలుగు అక్షరాలు ఎంతో అందమైనవని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని శశి గూడూరు చెప్పారు. తెలుగులో పలు రకాల ఫాంట్లు డిజైన్ చేశారు. అనేక డిజైన్లు రూపొందించారు. అచ్చుల్లో బొమ్మలు ప్రతిబింబించేలా శశి తయారు చేసిన పుస్తకానికి ఎంతో ప్రాచుర్యం లభించింది. యువతలో తెలుగుపై క్రేజ్ పెరిగేందుకు టీషర్టులపై తెలుగులో అక్షరాలను వినూత్నంగా డిజైన్ చేసి ప్రింట్ చేస్తున్నారు. అంతేకాకుండా బ్యాగులపై కూడా ఆలోచనాత్మకంగా డిజైన్లు రూపొందించి, అవగాహన కల్పిస్తున్నారు.పలు లోగోల రూపకల్పన..తెలుగు భాష పునరుజ్జీవనానికి కృషి చేస్తున్న శశి గూడూరు.. తెలంగాణ ప్రభుత్వానికి కూడా తన సేవలందించారు. టీ–శాట్, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్, తెలంగాణ పర్యాటక శాఖ లోగోలను శశి గూడూరు రూపొందించారు. అలాగే తెలుగులో ఐదు రకాల ఫాంట్లను తయారు చేశారు. తనకు చేతనైనంతగా తెలుగుకు సేవ చేస్తున్నానని, భవిష్యత్తులో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటానని శశి గూడూరు చెబుతున్నారు. -
దేశ భాషల్లో 'అచ్చు'తో అంతమయ్యే అజంత భాష తెలుగు!
సాక్షి: "కాకి పిల్ల కాకికి ముద్దు" అన్న చందాన, ఎవరి భాష వారికి ఇష్టమే. మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాషను నిత్యం కొలిచే సంప్రదాయం మన సంస్కృతిలోనే ఉంది.కాల ప్రవాహంలో, జీవనగమనంలో చాలామంది ఈ మూడింటికీ దూరమవుతున్నారు. కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ.. ముగ్గురు అమ్మలూ ఏడ్చే పరిస్థితులే కాన వస్తున్నాయి. తెలుగు భాషా సంస్కృతులు పరాయిభూముల్లోనే పరిఢ విల్లుతున్నాయి. ఉద్యోగ ఉపాధి కోసం విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు నిత్యం తెలుగుతల్లిని గుండెల్లో నిలుపుకునేలా కార్యక్రమాలు చేపడుతూ ఉండడం అభినందనీయం. ఎంత ఎంత ఎడమైతే... అంత తీపి కలయిక అన్నట్లుగా, ఏదో ఒక రూపంలో తల్లి భాషకు దగ్గరయ్యే కృషి విదేశాల్లో ఉన్న తెలుగువారు చేస్తున్నారు. కవులను, కళాకారులను ఇక్కడ నుంచీ అక్కడకు పిలుపించుకుని మన పద్యాలు, అవధానాలు, వాగ్గేయకార కీర్తనలు,కూచిపూడి నృత్యాలు,భువన విజయరూపకాలకు పట్టం కడుతున్నారు. కొన్ని దశాబ్దాల నుంచి తల్లిపాలకు,తల్లిభాషకు చాలా వరకూ దూరమవుతున్నాం. మన దేశాన్ని దోచేద్దామని వచ్చిన బ్రౌన్ దొర గుండెను సైతం మన పద్యం దోచేసింది.దొరగారు వేమన్న వెర్రిలో పడిపోయాడు. తమిళవారు మహాకవిగా భావించే సుబ్రహ్మణ్యభారతికి తెలుగువంటి తీయనైన భాష ఇంకొకటి లేనేలేదని అనిపించింది. శ్రీకృష్ణదేవరాయల పితృభాష తుళు.కానీ మాతృభాష తెలుగేనని చరిత్రకారులు చెబుతున్నారు. "దేశ భాషలందు తెలుగు లెస్స" అని శ్రీకృష్ణదేవరాయలు పలికినా, వినుకొండ వల్లభరాయడు చెప్పినా, అవి అక్షర సత్యాలు. దేశ భాషల్లో 'అచ్చు'తో అంతమయ్యే అజంత భాష తెలుగు. మూడు భారతీయ భాషల విశేషం.. తెలుగు మాట్లాడుతూ ఉంటే సంగీత మెదియో వింటున్నట్లు ఉండే అమృత భాష తెలుగు,అని ఎందరెందరో కీర్తించారు. మిగిలిన భాషలను గౌరవిస్తూనే,మన భాషను పూజించుకోవాలి. అన్ని భాషలు విలసిల్లాలి. అన్ని సంస్కృతులు విరాజిల్లాలి.సర్వమత సహనం వలె,సర్వ భాషల పట్ల ప్రియంగా ఉండమని యునెస్కో చెబుతోంది. ఈ సందర్భంగా, భాషల స్థానాన్ని విశ్లేషించుకుందాం. ప్రపంచంలోనే ఎక్కువమంది మాట్లాడే భాషల్లో నాల్గవ స్థానం హిందీకి, ఆరవ స్థానం బెంగాలీకి, 10వ స్థానం లహందీకి (పశ్చిమ పంజాబీ)దక్కాయి. ఈ పదింటిలో మూడు భారతీయ భాషలు ఉండడం విశేషం. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న భాషల్లో ఇంగ్లీష్ దే అగ్రపీఠం. మాతృభాషతో పాటు తప్పకుండా నేర్చుకోవాల్సిన భాష ఇంగ్లిష్. వీటికి తోడు అదనంగా నేర్చుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్న భాషల్లో చైనీస్,స్పానిష్,జర్మన్, ఫ్రెంచ్,అరబిక్,రష్యన్,పోర్చుగీస్, జపనీస్,హిందీ,ఇటాలియన్ కొరియా ప్రధానమైనవి. భారతదేశంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో హిందీ మొదటి స్థానంలో ఉంది. సుమారు 50కోట్ల మంది ఈ భాషను మాట్లాడేభాషగా ఉపయోగిస్తున్నారు. రెండవ స్థానం బెంగాలీకి, మూడవ స్థానం మరాఠీకి, నాల్గవస్థానం తెలుగుకు ఉన్నాయి. కేవలం జనాభాను దృష్టిలో పెట్టుకొని ఈ క్రమంలో విభజించారు. జనని సంస్కృతంబు సకల భాషలకు.. "జనని సంస్కృతంబు సకల భాషలకు " అంటారు. మన జ్ఞానం మొత్తం ఇందులోనే దాగి వుంది. మనం మాట్లాడే చాలా మాటలు సంస్కృతం నుంచి పుట్టినవే. ఇంతటి సంస్కృత భాషకు మనం దూరమై చాలా కాలమైంది. బ్రిటిష్ వాళ్లు మన విద్యా విధానాన్ని పాడు చేసిన క్రమంలో, సంస్కృతం మనకు దూరమైపోయింది. సంస్కృతాన్ని అభ్యసించడం, పరిరక్షించుకోవడం అత్యంత కీలకం. దేశంలో ఎన్ని భాషలు ఏర్పడినా, సంస్కృతంలో అవలీలగా, అలవోకగా ఒదిగిన భాషల్లో తెలుగుదే అగ్రతాంబూలం. సంగీత,సాహిత్యాలకు జీవంపోసే రసపుష్టి తెలుగులో ఉన్నంతగా మిగిలిన భాషలకు లేదు. ఉర్దూ కూడా గొప్ప భాష. ఈ భాషలో రాజసం ఉంటుంది. మొన్న మొన్నటి వరకూ సంస్థానాలలో,రాజాస్థానాలలో సంగీత, సాహిత్యాలలో రాజ్యమేలిన భాష ఉర్దూ. ఇది భారతీయమైన భాష. ఇండో-ఆర్యన్ వర్గానికి చెందిన భాషగా దీనికి గుర్తింపు వుంది. ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో ఉర్దూ 11వ స్థానంలో ఉంది. భారతీయ భాషలకు దక్కుతున్న ఈ గౌరవాలను చూసి, ఆనందిస్తూనే, మన తల్లిభాష తెలుగు గురించి మరింత ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. అత్యంత ప్రాచీన భాషలలోను మనకు హోదా దక్కింది. దీన్ని సాధించుకోడానికి రాజకీయంగా పెద్ద ఉద్యమమే చేయాల్సి వచ్చింది. మనతోటి దక్షిణాది భాషల్లో కన్నడ లిపికి, మన లిపికి ఎంతో సారూప్యతలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకూ రెండూ కలిసే ఉన్నాయి. మన కంటే కాస్త ముందుగా తమిళం సొంత పదాలు సృష్టించుకొని, స్వాతంత్య్రం పొందింది. మన జాను తెనుగు, అచ్చ తెనుగు వికసించినా, సంస్కృత భాషా సంపర్కం మన భాషకు వన్నెలద్దుతూనే ఉంది. విద్యా బోధనలో, ఉద్యోగ, ఉపాధిలో తెలుగును వెనక్కు నెట్టేస్తున్నారన్నది చేదు నిజం. అభివృద్ధి కోసం ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఏ భాషలు ఎంత అవసరమైనా, తెలుగును విస్మరించకుండా ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. ఇంగ్లీష్ భాషలో బోధన అవసరమే అయినప్పటికీ, కనీసం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ తెలుగులో బోధన ఉండడం ముఖ్యం. ఒక సబ్జెక్టుగా తెలుగును తప్పనిసరిగా ఉంచడం కంటే, ఇంగ్లీష్ లేదా తెలుగులో విద్యాభ్యాసం చేసే సదుపాయం ఉంచడం అత్యంత కీలకమని భాషా శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలను గౌరవించడం ప్రభుత్వాల బాధ్యత. తల్లిభాష తల్లిపాల వంటిది.. ఏ భాషలోనైనా చదువుకునే వెసులుబాటు కల్పించడమే వివేకం. మనో వికాసానికి, మేధో వైభవానికి తల్లిభాష తల్లిపాల వంటిది. అది అందరూ గుర్తించి తీరాలి. పట్టుదల, అవసరం, తెలివి, కృషి ఉంటే ఎన్ని భాషలనైనా, ఎప్పుడైనా నేర్చుకోవచ్చునని మన పూర్వులెందరో చేసి చూపించినవే. వివిధ స్థాయిల్లోని తెలుగు పాఠ్యాంశాలలో పద్యం దూరమవుతోంది. వ్యాకరణం, ఛందస్సు దూరమవుతున్నాయి. ఇది మంచి పరిణామం కాదు. ఆధునిక సాహిత్య ప్రక్రియలకు స్థానం కలిపిస్తూనే, సంప్రదాయమైన పద్యాన్ని సమున్నతంగా గౌరవించేలా పాఠ్యాంశాలు ఉండాలి. పద్యం మన తెలుగువాడి సొత్తు. వ్యాకరణం లేకపోతే పునాదిలేని భవనంలా భాషలు దెబ్బతింటాయి. నిన్నటి వరకూ మైసూర్లో ఉన్న తెలుగు కేంద్రం మన నెల్లూరుకు తరలి రావడం మంచి పరిణామమే. ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనూ, కేంద్రం నుంచి తెలుగు భాషా వికాసాల కోసం నిధులను తెప్పించుకోవడంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిపై అన్ని విశ్వవిద్యాలయాలలోనూ పరిశోధనలు పెరగాలి. తెలుగు చదువుకున్న వారికి ఉద్యోగ, ఉపాధిల్లో విశిష్ట స్థానం కలిపించాలి. ఈ బాధ్యత ప్రభుత్వాలదే. భాషలు జీవ నదుల వంటివి. అనేక అన్యభాషలను కలుపుకుంటూనే ప్రవహిస్తూ ఉంటాయి. కాకపోతే మురికినీరు చేరకుండా, చేరినా, చెడు జరుగకుండా చూసుకోవడం మన కర్తవ్యం. మాండలీకాలకు ఉండే సొగసు సోయగం వేరు. వాటిని గేలి చేయకుండా, ఆ పరిమళాలను ఆస్వాదిద్దాం. తల్లి తెలుగు భాషను నెత్తిపై పెట్టి పూజించుకుంటూ, ఆ వెలుగులో, ఆ వెలుతురులో రసమయంగా జీవిద్దాం. పిల్లలకు ఉగ్గుపాల దశ నుంచే తల్లిభాషపై మమకారం పెంచడం పెద్దల బాధ్యత. - మాశర్మ -
తెలుగు అభివృద్ధికి సాంకేతికతను వాడుకోవాలి
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు భాష అభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగిం చుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఏ సమాజంలో నైనా భాష, సంస్కృతి, ఒకదానినొకటి పెన వేసుకుని ఉంటాయని, సమాజం మార్పు కోరుతు న్నప్పుడు, తగిన సర్దుబాట్లు చేసుకోకపోతే, సమాజంతో పాటు భాషకూ, సంస్కృతికి తిప్పలు తప్పవన్నారు. కాలానుగుణంగా భాషలో మార్పు రాకపోతే, ఆ భాష, ఆ సంస్కృతి పతనమైన ఘటనలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. శని వారం దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు– నార్వేలు ప్రపంచవ్యాప్తంగా 75కు పైగా తెలుగు సంఘాలతో కలసి చేపట్టిన అంతర్జాతీయ సెమినార్లో ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాష, సంస్కృతి, కీర్తి పతాకను వినువీధుల్లో ఎగురవేస్తున్న తెలుగు తల్లి ముద్దుబిడ్డ లందరికీ వందనాలు అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. క్రీస్తుపూర్వం 400 సంవత్సరం నుంచి ఉనికిలో ఉన్న తెలుగు భాష ఒక ఉద్యమ రూపం దాల్చడానికి ఒకానొక కారణం మహాభార తాన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడలు తెనుగించ డమేనని వివరించారు. ‘‘ముందుచూపుతో, తగు మార్పులతో ప్రగతి శీలంగా భాషను మలిచిన యుగపురుషుల్లో గిడుగు వేంకట రామ్మూర్తి పంతులు అగ్రగణ్యులు. దాదాపు సమకాలికులైన కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తిల త్రయం, సాహితీ సామాజిక సంస్కరణలతో తెలుగు భాషను సామాన్య ప్రజల భాషగా మలిచారు. వాడుక భాష అవసరం గురించి ఆ మహానుభావులు ముందు చూపుతో హెచ్చరించి, విప్లవాత్మక చర్యలు చేపట్టక పోతే, మన తెలుగు భాష నేడు ఈ స్థితిలో ఉండేది కాదు’’అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో కూడా మాతృభాష ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగలించిందని చెప్పారు. అగ్రశ్రేణి సినీనటుడు కావడం వల్లనే ఎన్టీ రామా రావు ముఖ్యమంత్రి కాలేదని, ఊరూరా చైతన్య రథంపై తిరిగి సరళమైన సామాన్యుడి భాషలో మాట్లాడడమే కారణమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు భాషను వధించడంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నా యన్నారు. తెలుగు సినిమాలు కూడా ఆంగ్ల సబ్ టైటిల్స్ చూసి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగును కాపాడే బాధ్యత ప్రసార మాధ్యమాలపై కూడా ఉందని చెప్పారు. తెలుగు భాషకు గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర ముప్పు పొంచి ఉందని, దాన్ని కాపాడుకోవడానికి మరోసారి ఉద్యమ స్థాయిలో భాషాభిమానులందరూ పూనుకోవాలని పిలుపునిచ్చారు. పోటీని తట్టుకోవాలంటే ఆంగ్లం తప్పనిసరి అని అలాగని తెలుగును విస్మరించ రాదన్నారు. ‘‘ప్రతి ఒక్కరిలో తెలుగంటే గౌరవం పెరగాలి. సగర్వంగా నేను తెలుగువాడినని, నా మాతృ భాష తెలుగని ఎక్కడికెళ్లినా, ఏ పీఠమెక్కినా చెప్పుకోగలగాలి’’ అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఆగస్టు 29న గిడుగు రామ్మూర్తి పంతులు 158వ జయంతి సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ నివాళులర్పించారు. తెలుగు భాష అభివృద్ధికి దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు చేస్తున్న కృషిని ప్రశంసించారు. మండలి బుద్ధ ప్రసాద్, గరికిపాటి నరసింహారావు, కొలకలూరి ఇనాక్, గిడుగు స్నేహలత, పెట్లూరు విక్రమ్, తరిగోపుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
మాతృభాష తల్లిపాలవంటిది: బాలయ్య
-
'ప్రపంచ తెలుగు మహాసభ'లో బాలయ్య సవాల్
సాక్షి, హైదరాబాద్ : ప్రాంతాలు వేరైనా తెలుగు ప్రజలంతా స్నేహ భావాన్ని వీడలేదని, ఇది ఎప్పటికీ అలాగే కొనసాగాలని ప్రముఖ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన వీర తెలంగాణ పుత్రులకు, విప్లవ తెలంగాణ ఆడబిడ్డలకు తన కళాభివందనాలు అని చెప్పారు. ఈ సభల్లో పాలుపంచుకోవడం తన పూర్వజన్మసుకృతం అని చెప్పారు. తెలంగాణలో పుట్టిన వారికి అభిమానించడం తెలుసని, ఎదురించడం తెలుసని అన్నారు. తెలంగాణ సాయుధపోరాటంతో తమ సత్తాను ప్రపంచానికి చాటిన ఘనత తెలంగాణ గడ్డదని కొనియాడారు. ఇక తెలుగు భాష గురించి మాట్లాడుతూ పలువురు తెలుగు ప్రముఖులను గుర్తు చేశారు. తెలుగు పదం వింటే తన తనువు పులకిస్తుందన్న ఆయన ఐదువేల ఏళ్ల కిందట నుంచి తెలుగు జాతి ప్రారంభమైందని అన్నారు. ఒక మహనీయుడు చెప్పినట్లు మాతృభాష తల్లిపాలవంటిదని, పరాయి భాష డబ్బా పాలవంటిదని గుర్తు చేశారు. డబ్బా పాలపై మోజుతో అమ్మను అమ్మా అని పిలవలేకపోతున్నారని, తల్లులు కూడా అమ్మ అనిపించుకోవడం కంటే మమ్మీ అని, నాన్న డాడీ అని పిలిపించుకుంటున్నారని, ఇలా ఇరవై ఏళ్లు పోతే ఇవే తెలుగు పదాలేమో అనే నమ్మే దౌర్భాగ్యం వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఓ సవాల్ విసిరారు. మూడు నిమిషాలు ఒక్క పరాయి పదం రాకుండా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా అని సవాల్ విసిరారు. కమ్మనైన తెలుగు భాషలో గోదావరి వంపులున్నాయని, తెలంగాణ మాగాణం తెలుగు భాష అని, రాయలసీమ పౌరుషం తెలుగులో ఉంటుందని, కోనసీమ కొబ్బరి నీళ్ల లేతదనం తెలుగు భాషలో ఉందంటూ కవితాత్మకంగా వర్ణించారు. తెలుగు జాతికి గౌరవం దక్కాలంటే ముందు తెలుగు భాషను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. -
ఆత్మగౌరవం తమిళులకు తాకట్టు
సాక్షి ప్రతినిధి, చెన్నై : తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఆనాడు ఎన్టీ.రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అయితే ఈ నాటి తెలుగుదేశం పార్టీ అధ్య క్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తమిళనాడుకు తాకట్టు పెట్టేశారు. తమిళనాడులోని తెలుగు వారిని నిర్బంధ తమిళ చట్టంతో అణచివేతకు గురిచేస్తున్న వారి వద్దకు వెళ్లి ‘ఏపీలో తెలుగు భాషాభివృద్ధికి ‘ఎన్నా పణ్ణణుం అన్నే’ (ఏమీ చేయాలన్నా..) అంటూ ఏపీ మంత్రులు అర్థించారు. తెలుగు జాతిని, భాషను ఉద్దరించాలన్న ఉద్దేశంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు భాషాభివృద్ధి అధ్యయన కమిటీని ఇటీవల ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షులుగా ఏపీ భాషా సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని అధ్యక్షులుగా నియమించారు. ఇతర సభ్యులుగా ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ నియమితులయ్యారు. చంద్రబాబు ఆదేశాల మేరకు వీరంతా సోమవారం చెన్నైకి చేరుకున్నారు. మంగళవారం వీరికి ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా తోడయ్యారు. వీరంతా తమిళనాడు ప్రభుత్వ సచివాలయం వెళ్లి అక్కడి విద్యాశాఖ మంత్రి, పలువురు అధికారులను కలుసుకున్నారు. కొందరి ఇళ్లకు కూడా వెళ్లినట్లు తెలిసింది. ‘తమిళనాడులో తమిళ భాష ప్రజల్లోకి ఎంతగానో చొచ్చుకుని ఎలా వె ళ్లగలి గింది, భాష అమల్లో ప్రభుత్వం పరంగా కూడా మెచ్చదగిన రీతిలో ఎలా అమల్లో ఉంది’ అని తెలుసుకోవాలన్న ఏకైక అజెండాతోనే వారందరి వద్దకు ఏపీ ప్రభుత్వ భాషా ప్రతినిధులు వెళ్లడం విశేషం. తెలుగు పెద్దలను విస్మరించి తమిళ ప్రముఖులకు పెద్దపీట: ఏపీలో తెలుగుకు పెద్దపీట వేయాలంటే ఎన్నో మార్గాలు ఉండగా, వాటన్నింటినీ విస్మరించి తమిళ నేతలను అడిగి తెలుసుకోవాల్సిన దుర్గతిని పట్టించారు. దేశం లో అన్ని రాష్ట్రాల్లో కంటే తమిళనాడులో మాతృభాషపై మమకారం ఎక్కువ. తమిళులకు తమ మాతృభాషపై అభిమానంతో పాటూ పరభాషలపై దురభిమానం కూడా ఎక్కువేనని సోమవా రం నాటి సభలో ఉపసభాపతి వ్యాఖ్యానించా రు. మాతృభాషను బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చేలా తిరుక్కురల్ రాసిన తిరువళ్లువర్, మహాకవి భారతియార్ తదితర మహానుభావులు ఎందరో ఉన్నారు. మరి ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అనే కీర్తిని తెచ్చిన గిడుగు రామమూర్తి, గురజాడ అప్పారావు, వీరేశలింగం వం టి మహానుభావులు మనకూ ఎందరో ఉన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఎన్టీ.రామారావు తెలు గు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడ మీ స్థాపిం చారు. మాతృభాషా పరమైన ప్రయోజనాలు కాపాడడంలో అవన్నీ నిర్వీర్యమై పోయాయి. ప్రభుత్వ లావాదేవీలన్నీ తెలుగులోనే సాగాలనే ప్రయత్నం లేదు. తెలుగు సినిమాలకు తెలుగు పేర్లే పెట్టిన నిర్మాతలకు రాయితీలు ఇవ్వడం ద్వారా తెలుగు భాషను ప్రోత్సహించాలని కొం దరు నిర్మాతలు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. ప్రభుత్వం పట్టించుకున్న పాపా న పోలేదు. న్యాయస్థానాల్లో అందరికీ అర్థం అయ్యేలా తెలుగు భాషలోనే వాదోపవాదాలు జరగాలి, తీర్పులు చెప్పాలని భాషాభిమానులు ఏన్నో ఏళ్ల క్రితం చేసిన ప్రతిపాదన ఏమైందో ఎవ్వరికీ తెలియదు. తెలుగు భాష ఉనికి కాపాడుకునేలా ఏపీ ప్రభుత్వం నుంచి క చ్చితమైన ఉత్తర్వులు ఏవీ లేవు. తెలుగు భాషను ఉద్దరించాలని ఇన్నాళ్లకైనా నిర్ణయం తీసుకోవడం స్వాగతించదగినదే. అయితే కార్యాచరణలో తెలుగు పండితులను విస్మరించి తమిళ పెద్దల సలహాలు తీసుకోవడం ఆత్మగౌరవానికి భంగకరమే. ఏపీలో తెలుగుకు పూర్వవైభవం తేవడం ఎలా అనే అంశాన్ని ప్రభుత్వం ప్రజల ముందు ఉంచితే సమున్నతమైన సలహాలు ఇచ్చే వారు ఎందరో ఉన్నారు. తెలుగునాట మాతృభాషకు ఏమిటీ గతి అని ఆవేదన చెందుతున్న పండితులు పరుగు పరుగున వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేగాక దశాబ్దాల తరబడి తమిళనాడులో స్థిరపడి ఉన్న తెలుగు సంఘాల పెద్దలను అడిగినా తమిళభాష అమలును పూసగుచ్చినట్లు చెప్పేవారు. ఇలా ప్రత్యక్షంగా చెన్నైకి వచ్చి అధికారికంగా ‘అమ్మా’ అంటూ ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. పరభాషలపై తమిళులకు అయిష్టత ఉ న్నందునే హిందీ వ్యతిరేకోద్యమాన్ని నిర్వహిం చారు. 2006లో నిర్బంధ తమిళ చట్టాన్ని తీసుకువచ్చారు. నిర్బంధ తమిళ చట్టంలో ప్రధాన బా ధితులు తెలుగువారే. నిర్బంధం ఉచ్చు నుంచి తమకు విముక్తి కల్పించాలని చంద్రబాబుకు ఎందరో మొర పెట్టుకున్నా స్పందన శూన్యం. ఒకప్పుడు తమిళనాడులో తెలుగువారిని ‘గొల్టీ’ అని హేళనగా పిలిచేవారు. ప్రస్తుతం గొల్టీ అనే పేరు తెరమరుగైనా తమిళుల మనస్సుల తెరవెనుక ఇంకా కదలాడుతోనే ఉంది. తమిళులకు పరభాషలపై దురభిమానం ఉందని వ్యాఖ్యానిస్తూనే వారి నుంచి సలహాలు తీసుకునేందుకు ఏపీ పెద్దలు సిద్ధపడ్డారు. పరభాషలపై దురభిమానం కలిగి ఉన్న తమిళ పెద్దలు పొరుగు రాష్ట్రమైన ఏపీలో తెలుగు భాష ఉద్దరణకు తగిన సలహాలు ఎలా ఇస్తారో ఏపీ పెద్దలే చెప్పాలి. ‘తెలుగు’దేశం అని పేరు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన పార్టీ తన మాతృభాష ఉద్దరణకు తమిళ దేశాన్ని ఆశ్రయించడం శోచనీయం. మంత్రు లు గంటా శ్రీనివాసరావు, పల్లెరఘునాథరెడ్డి, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ మంగళవారం సచివాలయంలో పాఠశాల విద్యా శాఖ మంత్రి కె పాండియరాజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావులను కలుసుకుని నిర్బంధ తమిళం, తమిళనాడులో తమిళ భాష అమలు తీరు తెన్నులపై మాట్లాడారు. కార్యక్రమంలో ఏఐటీఎఫ్ అధ్యక్షుడు సీఎంకే రెడ్డి, ద్రవి డ దేశం అధ్యక్షుడు కృష్ణారావు, ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు.