ఆత్మగౌరవం తమిళులకు తాకట్టు | Palle Raghunatha Reddy Ganta Srinivasa Rao Telugu language development Chennai | Sakshi
Sakshi News home page

ఆత్మగౌరవం తమిళులకు తాకట్టు

Published Wed, Sep 21 2016 2:24 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

ఆత్మగౌరవం తమిళులకు తాకట్టు

ఆత్మగౌరవం తమిళులకు తాకట్టు

 సాక్షి ప్రతినిధి, చెన్నై : తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఆనాడు ఎన్‌టీ.రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అయితే ఈ నాటి తెలుగుదేశం పార్టీ అధ్య క్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తమిళనాడుకు తాకట్టు పెట్టేశారు. తమిళనాడులోని తెలుగు వారిని నిర్బంధ తమిళ చట్టంతో అణచివేతకు గురిచేస్తున్న వారి వద్దకు వెళ్లి ‘ఏపీలో తెలుగు భాషాభివృద్ధికి ‘ఎన్నా పణ్ణణుం అన్నే’ (ఏమీ చేయాలన్నా..) అంటూ ఏపీ మంత్రులు అర్థించారు.   తెలుగు జాతిని, భాషను ఉద్దరించాలన్న ఉద్దేశంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు భాషాభివృద్ధి అధ్యయన కమిటీని ఇటీవల ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షులుగా ఏపీ భాషా సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని అధ్యక్షులుగా నియమించారు.
 
 ఇతర సభ్యులుగా ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ నియమితులయ్యారు. చంద్రబాబు ఆదేశాల మేరకు వీరంతా సోమవారం చెన్నైకి చేరుకున్నారు. మంగళవారం వీరికి ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా తోడయ్యారు. వీరంతా తమిళనాడు ప్రభుత్వ సచివాలయం వెళ్లి అక్కడి విద్యాశాఖ మంత్రి, పలువురు అధికారులను కలుసుకున్నారు. కొందరి ఇళ్లకు కూడా వెళ్లినట్లు తెలిసింది. ‘తమిళనాడులో తమిళ భాష ప్రజల్లోకి ఎంతగానో చొచ్చుకుని ఎలా వె ళ్లగలి గింది, భాష అమల్లో ప్రభుత్వం పరంగా కూడా మెచ్చదగిన రీతిలో ఎలా అమల్లో ఉంది’ అని తెలుసుకోవాలన్న ఏకైక అజెండాతోనే వారందరి వద్దకు ఏపీ ప్రభుత్వ భాషా ప్రతినిధులు వెళ్లడం విశేషం.
 
 తెలుగు పెద్దలను విస్మరించి తమిళ ప్రముఖులకు పెద్దపీట:    ఏపీలో తెలుగుకు పెద్దపీట వేయాలంటే ఎన్నో మార్గాలు ఉండగా, వాటన్నింటినీ విస్మరించి తమిళ  నేతలను అడిగి తెలుసుకోవాల్సిన దుర్గతిని పట్టించారు. దేశం లో అన్ని రాష్ట్రాల్లో కంటే తమిళనాడులో మాతృభాషపై మమకారం ఎక్కువ. తమిళులకు తమ మాతృభాషపై అభిమానంతో పాటూ పరభాషలపై దురభిమానం కూడా ఎక్కువేనని సోమవా రం నాటి సభలో ఉపసభాపతి వ్యాఖ్యానించా రు. మాతృభాషను బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చేలా తిరుక్కురల్ రాసిన తిరువళ్లువర్, మహాకవి భారతియార్ తదితర మహానుభావులు ఎందరో ఉన్నారు. మరి ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అనే కీర్తిని తెచ్చిన గిడుగు రామమూర్తి, గురజాడ అప్పారావు, వీరేశలింగం వం టి మహానుభావులు మనకూ ఎందరో ఉన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఎన్‌టీ.రామారావు తెలు గు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడ మీ స్థాపిం చారు. మాతృభాషా పరమైన ప్రయోజనాలు కాపాడడంలో అవన్నీ నిర్వీర్యమై పోయాయి.
 
  ప్రభుత్వ లావాదేవీలన్నీ తెలుగులోనే సాగాలనే ప్రయత్నం లేదు. తెలుగు సినిమాలకు తెలుగు పేర్లే పెట్టిన నిర్మాతలకు రాయితీలు ఇవ్వడం ద్వారా తెలుగు భాషను ప్రోత్సహించాలని కొం దరు నిర్మాతలు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. ప్రభుత్వం పట్టించుకున్న పాపా న పోలేదు. న్యాయస్థానాల్లో అందరికీ అర్థం అయ్యేలా  తెలుగు భాషలోనే వాదోపవాదాలు జరగాలి, తీర్పులు చెప్పాలని భాషాభిమానులు ఏన్నో ఏళ్ల క్రితం చేసిన ప్రతిపాదన ఏమైందో ఎవ్వరికీ తెలియదు. తెలుగు భాష ఉనికి కాపాడుకునేలా ఏపీ ప్రభుత్వం నుంచి క చ్చితమైన ఉత్తర్వులు ఏవీ లేవు. తెలుగు భాషను ఉద్దరించాలని ఇన్నాళ్లకైనా నిర్ణయం తీసుకోవడం స్వాగతించదగినదే.
 
 అయితే కార్యాచరణలో తెలుగు పండితులను విస్మరించి తమిళ పెద్దల సలహాలు తీసుకోవడం ఆత్మగౌరవానికి భంగకరమే. ఏపీలో తెలుగుకు పూర్వవైభవం తేవడం ఎలా అనే అంశాన్ని ప్రభుత్వం ప్రజల ముందు ఉంచితే సమున్నతమైన సలహాలు ఇచ్చే వారు ఎందరో ఉన్నారు. తెలుగునాట మాతృభాషకు ఏమిటీ గతి అని ఆవేదన చెందుతున్న పండితులు పరుగు పరుగున వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేగాక దశాబ్దాల తరబడి తమిళనాడులో స్థిరపడి ఉన్న తెలుగు సంఘాల పెద్దలను అడిగినా తమిళభాష అమలును పూసగుచ్చినట్లు చెప్పేవారు. ఇలా ప్రత్యక్షంగా చెన్నైకి వచ్చి అధికారికంగా ‘అమ్మా’ అంటూ ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. పరభాషలపై తమిళులకు అయిష్టత ఉ న్నందునే హిందీ వ్యతిరేకోద్యమాన్ని నిర్వహిం చారు. 2006లో నిర్బంధ తమిళ చట్టాన్ని తీసుకువచ్చారు.
 
  నిర్బంధ తమిళ చట్టంలో ప్రధాన బా ధితులు తెలుగువారే. నిర్బంధం ఉచ్చు నుంచి తమకు విముక్తి కల్పించాలని చంద్రబాబుకు ఎందరో మొర పెట్టుకున్నా స్పందన శూన్యం. ఒకప్పుడు తమిళనాడులో తెలుగువారిని ‘గొల్టీ’ అని హేళనగా పిలిచేవారు. ప్రస్తుతం గొల్టీ అనే పేరు తెరమరుగైనా తమిళుల మనస్సుల తెరవెనుక ఇంకా కదలాడుతోనే ఉంది. తమిళులకు పరభాషలపై దురభిమానం ఉందని వ్యాఖ్యానిస్తూనే వారి నుంచి సలహాలు తీసుకునేందుకు ఏపీ పెద్దలు సిద్ధపడ్డారు. పరభాషలపై దురభిమానం కలిగి ఉన్న తమిళ పెద్దలు పొరుగు రాష్ట్రమైన ఏపీలో తెలుగు భాష ఉద్దరణకు తగిన సలహాలు ఎలా ఇస్తారో ఏపీ పెద్దలే చెప్పాలి. ‘తెలుగు’దేశం అని పేరు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన పార్టీ తన మాతృభాష ఉద్దరణకు తమిళ దేశాన్ని ఆశ్రయించడం శోచనీయం.
 
   మంత్రు లు గంటా శ్రీనివాసరావు, పల్లెరఘునాథరెడ్డి, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ మంగళవారం సచివాలయంలో పాఠశాల విద్యా శాఖ మంత్రి కె పాండియరాజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావులను కలుసుకుని నిర్బంధ తమిళం, తమిళనాడులో తమిళ భాష అమలు తీరు తెన్నులపై మాట్లాడారు. కార్యక్రమంలో ఏఐటీఎఫ్ అధ్యక్షుడు సీఎంకే రెడ్డి, ద్రవి డ దేశం అధ్యక్షుడు కృష్ణారావు, ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement