ఇక తెలుగులోనూ జేఈఈ మెయిన్‌!  | JEE Mains Exams To Be Conducted In Telugu Language | Sakshi
Sakshi News home page

ఇక తెలుగులోనూ జేఈఈ మెయిన్‌! 

Published Wed, Jan 15 2020 1:33 AM | Last Updated on Wed, Jan 15 2020 10:29 AM

JEE Mains Exams To Be Conducted In Telugu Language - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాతృ భాషలో చదువుకున్న విద్యార్థులు ఇబ్బందులు పడకుం డా ఉండేందుకు జేఈఈ మెయిన్‌ పరీక్షలను 9 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహిం చేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కసరత్తు ప్రారంభించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) ఆదేశాల మేరకు ఈ కసరత్తును ప్రారంభించింది. ప్రాంతీయ భాషల్లో చదువుకున్న వారు ఇంగ్లిష్‌/హిందీ లేదా గుజరాతీలో ఇచ్చే జేఈఈ మెయిన్‌ పరీక్ష పత్రాల కారణంగా ఇబ్బందులు పడుతు న్నట్లు ఎంహెచ్‌ఆర్‌డీ గుర్తించింది. అలాగే పలు రాష్ట్రాలు కూడా ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించాలని విజ్ఞప్తులు చేస్తుండటంతో ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. 2021 జనవరి నుంచి జేఈఈ మెయిన్‌ను ఇంగ్లిష్, హిందీ సహా 11 భాషల్లో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ఎన్‌టీఏను ఎంహెచ్‌ఆర్‌డీ ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఎన్‌టీఏ కసరత్తు ప్రారంభించింది. దాదాపు లక్షన్నర మందికి పైగా తెలుగు విద్యార్థులు రాసే ఈ పరీక్షలను తెలుగులోనూ నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. 

వచ్చే ఏప్రిల్‌లో మాత్రం మూడు భాషల్లోనే.. 
ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో బీఈ/బీటెక్, బీఆర్క్‌లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌నూ మూడు భాషల్లోనే నిర్వహిస్తోంది. ఇంగ్లిష్, హిందీతోపాటు గుజరాతీలోనూ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. 2013లో జేఈఈ మెయిన్‌ అమల్లోకి తెచ్చినపుడు తమ భాషలోనూ పరీక్ష నిర్వహించాలని గుజరాత్‌ కోరడంతో గుజరాతీలోనూ పరీక్ష నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలు అప్పట్లో అడగకపోవడంతో తెలుగులో నిర్వహించడం లేదు. 2018 వరకు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఈ పరీక్షలను నిర్వహించగా, 2019 నుంచి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జేఈఈ మెయిన్‌ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కూడా మూడు భాషల్లోనే ఈ పరీక్షలను నిర్వహించింది. వచ్చే ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ను కూడా మూడు భాషల్లోనే నిర్వహిస్తామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. 

11 భాషల్లో నిర్వహించేలా..
వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, మాతృ భాషల్లో చదువుకున్న వారు నష్టపోకుండా ఉండేందుకు 11 భాషల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఎన్‌టీఏను ఆదేశించింది. ఆ 11 భాషల్లో 9 ప్రాంతీయ భాషలు ఉన్నాయి. 2021 జనవరిలో నిర్వహించే జేఈఈ మెయిన్‌ పరీక్షలను ఇంగ్లిష్, హిందీతోపాటు ప్రాంతీయ భాషలైన అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళ్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. 2021 జనవరి తరువాత కూడా ఇకపై ప్రతి ఏటా 11 భాషల్లో ఈ పరీక్షలను నిర్వహించనుంది. ఇంకా ఏమైనా రాష్ట్రాలు అడిగితే ఆయా భాషల్లోకి ప్రశ్నపత్రాలను అనువాదం చేసి ఇచ్చే అంశాలను కూడా ఎన్‌టీఏ పరిశీలిస్తోంది.

‘ఆ జవాబులు సరైనవే’
జేఈఈ మెయిన్‌ పరీక్షలోని 5 న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నలకు  ‘కీ’లో పేర్కొన్న 5 సంబంధిత జవాబులు సరైనవేనని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పేర్కొంది. 5, 5.0, 5.00, 5.000, 5.0000, 05, 05.0, 05.00, 05.000, 05.0000 జవా బులన్నీ సరైనవేనని ఓ ప్రకటనలో ఎన్టీఏ తెలిపింది. అభ్యర్థులు దీన్ని గమనించాలని సూచించింది. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు జేఈఈ మెయిన్‌ పరీక్షలు నిర్వహించారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement