సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయస్థాయి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2023 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు విజయఢంకా మోగించారు. ఈ ఫలితాల్లో జాతీయస్థాయిలో మొదటి రెండు ర్యాంకులను మన తెలుగు విద్యార్థులే కైవసం చేసుకున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శనివారం ఉదయం ఈ పరీక్ష తుది ఫలితాలను, స్కోర్లు, ర్యాంకులను విడుదల చేసింది. ఇందులో 100 పర్సంటైల్ సాధించిన వారు 43 మంది ఉండగా అందులో 16 మంది తెలుగు వారే కావడం విశేషం. వీరిలో ఐదుగురు ఆంధ్రప్రదేశ్ వారు కాగా.. మిగిలినవారు తెలంగాణ నుంచి రిజిస్టరై పరీక్ష రాసిన అభ్యర్థులు. టాప్–10 ర్యాంకుల్లో తొలిస్థానాన్ని దక్కించుకున్న శింగరాజు వెంకట కౌండిన్య తెలంగాణ నుంచి రిజిస్టరై పరీక్ష రాసిన ఏపీ విద్యార్థి కాగా.. రెండో స్థానంలోని కాళ్లకూరి సాయినా«థ్ శ్రీమంత్ ఏపీ నుంచే పరీక్ష ర్యాంకు దక్కించుకున్నాడు.
12వ ర్యాంకర్ పునుమల్లి లోహిత్ ఆదిత్యసాయి, 35వ ర్యాంకర్ సి. మిఖిల్, 37వ ర్యాంకు సాధించిన నిమ్మకాయల ధర్మతేజారెడ్డి, 38వ ర్యాంకర్ దుగ్గినేని వెంకట యుగేష్‌లు ఏపీకి చెందిన విద్యార్థులే. ఇక తెలంగాణకు సంబంధించి అల్లం సుజయ్ (6వ ర్యాంకు), వావిలాల చిద్విలాసరెడ్డి (7వ ర్యాంకు), బిక్కిని అభినవ్ చౌదరి (8వ ర్యాంకు), మాజేటి అభినీత్ (10వ ర్యాంకు), గుత్తికొండ అభిరామ్ (17వ ర్యాంకు), ఎంఎల్ మాధవ్ భరద్వాజ్ (18వ ర్యాంకు), పాలూరి జ్ఞాన కౌశిక్‌రెడ్డి (20వ ర్యాంకు), రామేష్ సూర్యతేజ (21వ ర్యాంకు), నందిపాటి సాయి దుర్గేశ్‌రెడ్డి (40వ ర్యాంకు), ఈవూరి శ్రీధరరెడ్డి (41వ ర్యాంకు) సాధించారు.
వెనుకబడ్డ బాలికలు..
ఈసారి జేఈఈ మెయిన్ టాప్ ర్యాంకుల సాధనలో బాలికలు బాగా వెనుకబడ్డారు. టాప్–10లో ఒక్కరూ లేరు. కర్ణాటకకు చెందిన ఒకేఒక్క అమ్మాయి రిధి కమలేష్‌కుమార్ మహేశ్వరి 100 స్కోరు మార్కులతో 16వ ర్యాంకులో నిలిచింది. బాలికల్లో ఏపీ నుంచి మీసాల ప్రణతి శ్రీజ, రామిరెడ్డి మేఘన, పైడల వింధ్య, సువ్వాడ మౌనిష నాయుడు, వాకా శ్రీవర్షిత టాప్ ర్యాంకుల్లో నిలిచారు. తెలంగాణ నుంచి కుక్కల ఆశ్రితరెడ్డి టాప్ ర్యాంకులో ఉన్నారు.
వెయ్యిలోపు ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులే అధికం..
టాప్–10లోనే కాకుండా టాప్–500 ఆపై వెయ్యి ర్యాంకుల్లో కూడా తెలుగు విద్యార్థులే అత్యధిక శాతం మంది ఉన్నారు. ఎన్టీఏ విడుదల చేసిన స్కోరు మార్కులు, తుది ర్యాంకుల ఆ«ధారంగా తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ సంస్థల్లో చదువుతున్న విద్యార్థులే ఎక్కువమంది ఈ ర్యాంకులను కైవసం చేసుకున్నట్లు ఆయా విద్యాసంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు.
గురుకుల విద్యార్థులకు ర్యాంకులు..
ఇక ఏపీలోని వివిధ గురుకులాల్లో, రెసిడెన్షియల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి ర్యాంకులే వచ్చాయని ఆయా విభాగాల అధికారులు చెబుతున్నారు. వీరికోసం ప్రభుత్వం ప్రత్యేక కోచింగ్ తరగతులు నిర్వహించడం, తొలినుంచి పోటీ పరీక్షల దృష్టితో వారిని సన్నద్ధం చేయడంతో ర్యాంకులు దక్కాయంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, ఇతర సంస్థల్లో ఇంటర్మీడియెట్ చదువుతున్న వారిలో 25 మందికి పైగా మంచి ర్యాంకులు సాధించినట్లు ప్రాథమిక గణాంకాల ప్రకారం చెబుతున్నారు.
ఈసారి పెరిగిన కటాఫ్ మార్కులు..
జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించేందుకు ఎన్టీఏ ప్రకటించిన కటాఫ్ మార్కులు ఈసారి గణనీయంగా పెరిగాయి. 2022లో జనరల్ కటాఫ్ 88.41 కాగా.. ఇప్పుడది 90.77కి చేరింది. ఈడబ్ల్యూఎస్ విభాగంలో కటాఫ్ మార్కులు 63.11 నుంచి 75.62కు.. ఓబీసీ కటాఫ్ 67.00 నుంచి 73.61కి.. ఎస్సీలది 43.08 నుంచి 51.97కి, ఎస్టీలది 26.77 నుంచి 37.23కి పెరగడం గమనార్హం. ఈసారి మెయిన్‌లో ప్రశ్నల సరళి మారడంతో కటాఫ్ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.
ఫలితాలపై చివరి వరకు ఉత్కంఠ..
ఈసారి జేఈఈ మెయిన్ తుది ఫలితాల కోసం విద్యార్థులు గత కొన్నిరోజులుగా చాలా ఉత్కంఠతో ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జేఈఈ మెయిన్ పరీక్షలను ఎన్టీఏ రెండు విడతలుగా నిర్వహించిన సంగతి తెలిసిందే. తొలివిడత పరీక్షలను జనవరి 24 25, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో నిర్వహించింది. రెండో సెషన్‌ను ఏప్రిల్ 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో పూర్తిచేసింది. రెండు విడతల్లోనూ కలిపి మొత్తం 11,62,398 మంది రిజిస్టర్ కాగా 11,13,325 మంది రాశారు. బాలురు 7,74,359 మంది రాయగా బాలికలు 3,38,963 మంది పరీక్ష రాశారు. బీఆర్క్, బీ ప్లానింగ్‌కు సంబంధించిన పేపర్–2 ఫలితాలను తరువాత ప్రకటిస్తామని ఎన్టీఏ పేర్కొంది.
నేటినుంచి అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్లు
జేఈఈ మెయిన్‌లో టాప్ 2.5 లక్షల మందికి ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జేఈఈ అడ్వాన్సుడ్–2023ని రాసేందుకు అర్హత దక్కుతుంది. వీరు ఆదివారం (నేడు) నుంచి అడ్వాన్స్‌డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను నిర్వహణ సంస్థ అయిన ఐఐటీ గౌహతి ఇప్పటికే ప్రకటించింది. ఈ పరీక్ష జూన్ 4న జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment